Mohabbat Teaser | సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ ప్రధాన జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మొహబ్బత్’. ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మ్యూజికల్ ఎమోషనల్ లవ్‌స్టోరీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆవిష్కరణోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక వేడుకకు ప్రముఖ హీరో నవదీప్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ కరుణకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరితో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సలీమ్ షేక్, దర్శకుడు మ్యాక్, సినిమాటోగ్రఫర్ వైఎస్ కృష్ణ, రచయిత కలాం, నటులు అజయ్ ఘోష్, ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, సంతోషి, దుర్గ తదితరులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేదికపై చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో హీరో నవదీప్ సినిమా టీజర్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
నవదీప్ మాట్లాడుతూ.. నిర్మాత అఫ్రోజ్ అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూనే, తన సొంత ఊరిలో ఒక స్కూల్‌ను నిర్మించడమే కాకుండా, ఇప్పుడు తన కలల సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. వారు ఎంతో అంకితభావం ఉన్న నిర్మాతలుగా కనిపిస్తున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు ఎంతో మంది కొత్త టాలెంటెడ్ నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసి ప్రోత్సహించడం అభినందనీయం. చిత్రంలోని విజువల్స్ మరియు టీజర్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. అమెరికాలో సుమారు 25 సంవత్సరాలుగా ఉద్యోగం చేసిన అఫ్రోజ్ గారు, ఇన్నేళ్ల తర్వాత సినిమా తీయాలనే తన కలను నిజం చేసుకుంటున్నారు. సినిమా నిర్మాణం అనేది సామాన్యమైన విషయం కాదు, ఇదొక ఎంతో టఫ్ జాబ్. అలాంటి రంగంలో అడుగుపెట్టిన వీరు ఇండస్ట్రీలో మంచి నిర్మాతలుగా ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తున్నాను. ఇది ‘ప్రేమిస్తే’ సినిమాను తలపించేలా సాగే ఓ డిఫరెంట్ అండ్ ఎమోషనల్ లవ్‌స్టోరీ. రాయలసీమ వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే ఈ కథ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సునీల్ కశ్యప్ అందించిన సంగీతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది” అని పేర్కొన్నారు.
నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా నేను అమెరికాలోనే ఉంటున్నాను. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలనే బలమైన ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మించాను. ఈ కథ నాకు ఎంతో నచ్చడంతో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందన్న పూర్తి నమ్మకం ఉంది. కథతో పాటు మ్యూజికల్ పరంగా కూడా ఈ సినిమా పెద్ద సంచలనం సృష్టిస్తుంది. మా చిత్రానికి సహకరించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు.
దర్శకుడు మ్యాక్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మా టీమ్ అంతా ఎంతో కష్టపడి పనిచేశాం. మా కథను పూర్తిగా నమ్మి నిర్మాత గారు ఎంతో ఖర్చు పెట్టి నిర్మించారు. ప్రేక్షకులకు కొత్తదనం అందించాలనే తపనతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సునీల్ కశ్యప్ అందించిన బాణీలు సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ఎమోషన్స్ తో నిండిన ఈ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. అలాగే ఈ చిత్రంలో అజయ్ ఘోష్ గారి పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చాలా కాలం పాటు నిలిచిపోతుంది” అని చెప్పారు.
హీరోయిన్ శ్రేయాస్ సేన్ మాట్లాడుతూ.. ఈ సినిమా నా కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైనది. ఈ ప్రాజెక్ట్ విజయం సాధిస్తుందనే విషయంలో నాకు అపారమైన నమ్మకం ఉంది. అందరి మనసులను హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.
హీరో సంతోష్ మాట్లాడుతూ.. కడపలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ మ్యూజికల్ ఎమోషనల్ లవ్‌స్టోరీని తెరకెక్కించాం. సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో నిర్మాత గారు ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ప్రధాన బలహములుగా నిలుస్తాయి. అజయ్ ఘోష్ లాంటి సీనియర్ నటుడితో కలసి నటించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం లభించింది. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు సునీల్ కాశ్యప్ మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రస్తుత కష్టకాలంలో కూడా సినిమాపై ఉన్న మక్కువతో ఇలాంటి మంచి మనసున్న నిర్మాతలు దొరకడం మన అదృష్టం. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలోని పాటలు అన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి” అని అన్నారు.