Bahrain : ఇరాన్ యుద్ధం తీవ్రమవుతోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఈ యుద్ధం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకపక్క ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే.. ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. తాజాగా బహ్రెయిన్‌లోని ఒక ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేసింది. అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాప్కో ఎనర్జీస్ అనే సంస్థపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఈ చమురు శుద్ధి సంస్థకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు కూడా సౌదీలోని సౌదీ అరాంకో సంస్థపై ఇరాన్ దాడి చేసింది.
ఇలా తమ దేశంలోని ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు దిగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఆయా దేశాలకు ప్రధాన ఆదాయ వనరు చమురే. అలాంటిది అక్కడి చమురు సంస్థల్ని దెబ్బతీసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని చమురు నిల్వ కేంద్రాలు, శుద్ధి కేంద్రాలు, పైప్ లైన్లు, ఇతర ప్లాంట్లపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. అయితే, ఈ దాడుల ఉద్దేశం అమెరికా తమపై దాడులు చేయకుండా అడ్డుకునేలా గల్ఫ్ దేశాలపై ఒత్తిడి తేవడమే అని విశ్లేషకుల అంచనా. ఇక్కడి అమెరికా సైనిక కేంద్రాల నుంచి తమపై దాడికి పాల్పడకుండా చూడాలని గల్ఫ్ దేశాల్ని ఇరాన్ కోరుతోంది. మరోవైపు రెండు రోజుల క్రితం ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలకు భారీ నష్టం కలిగింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.
ఇంతకుముందు 100 డాలర్లలోపే ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధర ఇప్పుడు 110 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ చేసిన ఈ పనిపై అమెరికా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇరాన్ చమురు శుద్ధి కేంద్రాలను మిస్సైల్స్ ప్రయోగించేందుకు వాడుతోందని, అందువల్లే ఆ ప్రదేశాలపై దాడి చేయాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ చెప్పింది. ఏదేమైనా ఇరాన్, గల్ఫ్ కంట్రీస్లోని చమురు కేంద్రాలపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వల్ల అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు మాత్రం పెరుగుతున్నాయి.