దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో విషాదం ( Tragedy ) నెలకొంది. ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సోమవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ నుంచి ఎత్తైన ఇనుప స్టాండ్ ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్ లైన్ విద్యుత్ తీగలు స్టాండ్ కు తగలడంతో ఇద్దరు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.
మృతులు మాదాపూర్‌కు చెందిన చల్ల లక్ష్మీనారాయణ ( 45 ), వెళ్గనూర్కు చెందిన చందనగిరి నాగరాజు(40) గా గుర్తించారు. ఇరువురు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బంకు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, నష్ట పరిహారం అందించాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సై తహసీనుద్దీన్ ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు.