Jananayagan | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న భారీ చిత్రం “జన నాయగన్” పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్యంగా ఇది విజయ్ కెరీర్లో చివరి సినిమా అని ప్రకటించిన తర్వాత ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. తమిళంలో “జన నాయగన్”గా వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో “జన నాయకుడు” పేరుతో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. అయితే అనేక అడ్డంకులు వలన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.
అసలు ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని సెన్సార్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. అభిమానులు కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుండగా ఇప్పుడు మరోసారి ఈ సినిమాకు అడ్డంకి ఏర్పడినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా రివ్యూ కమిటీకి సంబంధించిన సెన్సార్ యూనిట్లో ఒక సభ్యుడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో సెన్సార్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ సినిమా సెన్సార్ వాయిదా పడినట్టు సమాచారం. ఇలా విజయ్ చివరి సినిమాగా వస్తున్న “జన నాయగన్”కు వరుస అడ్డంకులు ఎదురవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఇప్పటికే విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఎప్పుడు సెన్సార్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది.
మరోవైపు ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. విజయ్ కెరీర్లో చివరి సినిమాగా తెరకెక్కుతున్నందున “జన నాయగన్”పై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. మరి వరుస అడ్డంకులను దాటుకుని ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.