Komatireddy Venkat Reddy | నల్గొండ: ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒకవేళ నాగార్జునసాగర్ నిండినప్పటికీ చెరువులు నింపే పరిస్థితి లేదని, ఇప్పటికే బోర్లలో కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నందున కష్టకాలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అండగా నిలబడి ఆరుతడి పంటలు వేసుకునేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్‌స్టోరేజీలో ఉందని, శ్రీశైలం నుంచి నీరు వచ్చినప్పటికీ పంటలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని, ఉన్న నీరు జూన్ 2027 వరకు తాగునీటికే సరిపోతుందని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు.
ఏఎంఆర్పీ కూడా సగమే నిండిందని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని మంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో సూపర్ ఎల్‌నినో కారణంగా దక్షిణ తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. అందువల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా కష్టపడి పనిచేయాలని, ఇలాంటి కరువు పరిస్థితుల్లో రైతులకు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో పంట మార్పిడిలో భాగంగా 33 వేల ఎకరాల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అయితే దీన్ని లక్షన్నర ఎకరాల లక్ష్యంగా తీసుకుని రైతులతో ఆరుతడి పంటలు వేయించాలని ఆదేశించారు. జిల్లాలో 9 వేల ట్రాన్స్ఫార్మర్లపై ఉన్న ఓవర్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైన విద్యుత్ సామగ్రిని తెప్పిస్తామన్నారు.
కరువు వచ్చినప్పటికీ నల్గొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఆగస్టు 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. పనులు కొనసాగుతున్నాయని, ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ద్వారా జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఎస్ఎల్బీసీ కోసం ఎంతైనా ఖర్చు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. కరువు వచ్చినా, శ్రీశైలం డెడ్‌స్టోరేజీలో ఉన్నప్పటికీ ఎస్ఎల్బీసీ నుంచి సాగునీరు అందించవచ్చన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కష్టకాలంలో రైతులకు అండగా ఉండాలని, ప్రజలకు ధైర్యం చెప్పాలని, ఆరుతడి పంటలు వేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇకపై జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు.
జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద రైతులు రెండు పంటలు వరి వేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో భూములు సారం కోల్పోయి ఎందుకూ పనికిరాకుండా పోతాయని మంత్రి అన్నారు. విపరీతంగా ఎరువులు వాడటం, నిరంతరం వరి సాగు చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పంటలు వేసుకోలేని పరిస్థితి వస్తుందన్న విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందులో భాగంగా కూరగాయల పంటలు, ఉద్యాన పంటలు పండించాలని, ఆర్గానిక్ వ్యవసాయం చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాకు 5 వేల యూనిట్ల స్ప్రింక్లర్లు కావాలని అధికారులు కోరగా.. తక్షణమే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.