హైదరాబాద్, సెప్టెంబర్ 17 నమస్తే తెలంగాణ) : రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్రెడ్డి దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. దళితుల భూములను లాకొని, కేసీఆర్పై దాడికి వచ్చిన వారికి తలా అరెకరం చొప్పున పంచుతామని సీఎం ప్రకటించడం వెనుక దళితజాతిలో చిచ్చుపెట్టే కుట్ర దాగి ఉన్నదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం పకనే ఉన్న సర్వేనంబర్ 325లోని భూమిని 50 ఏండ్లుగా 200 దళిత కుటుంబాలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని పేరొన్నారు. కేసీఆర్ ఆ భూమిని కబ్జా చేశారంటూ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు.
కేసీఆర్ ఎలాంటి భూమికబ్జా చేయలేదని, పైగా తమకు నీరు, డ్రిప్వంటి సదుపాయాలు కల్పించారని అక్కడి దళిత రైతులే స్పష్టంచేశారని గుర్తుచేశారు. దళితులను అడ్డం పెట్టుకుని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చెప్పిన అబద్ధాలను ఎర్రవల్లి రైతులు ఇప్పటికే బట్టబయలు చేశారని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా అక్కడి భూములను సాగు చేసుకొంటున్న దళితుల భూములను లాకోవాలని కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నడం దుర్మార్గమని పేర్కొన్నారు. కేసీఆర్పై రాజకీయ కక్షతో పదేపదే దళితులను అవమానిస్తున్న ముఖ్యమంత్రికి దళిత సమాజం తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు.