తిరుపతి : తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ (Pushpayagam) మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి (Kodandaramaswamy ) ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం (Tirumanjanam) నిర్వహించి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా నిర్వహించారు.
తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలిరేకులు వంటి 11 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు 3 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు.
బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగంతో సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. పుష్పయాగం అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.