KTR | రాజన్న సిరిసిల్ల : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా గులాబీ సైన్యంలో గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనబడుతోంది కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
శాసనసభ ఎన్నికల్లో పరాభవం పాలైనప్పటికీ, రకరకాల కుట్రలు, కుతంత్రాలతో పార్టీలో నుంచి నాయకులు తీసుకోని పోయినప్పటికీ, గ్రామగ్రామనా, ప్రతి పట్టణంలో మొక్కవోని దీక్షతో గులాబీ సైనికులు పని చేశారు. ఒక వైపు క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తలు బలంగా పని చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో ప్రత్యర్థుల దుష్ర్పచారాలు, విమర్శలను తిప్పికొడుతూ అద్భుతంగా పని చేసిన సోషల్ మీడియా వారియర్స్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా చురుకుగా పని చేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవశ్యకతను వివరించారు అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేపట్టిన కేసీఆర్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పింది. 17 రోజుల బస్సు యాత్రతో జాతీయ పార్టీల నాయకత్వాలు దిగివచ్చాయి. ఏ జిల్లాకు పోయినా, నియోజకవర్గం, పట్టణం పోయినా కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా గులాబీ సైన్యంలో గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనబడుతోంది. గులాబీ సైనికులు రెండు జాతీయ పార్టీలకు ముచ్చెటమలు పట్టించారు. కేసీఆర్ పోరు బాటకు జనం నుంచి వచ్చిన స్పందనతో కార్యకర్తల్లో ఉత్సాహం జోష్ వచ్చింది అని కేటీఆర్ తెలిపారు.