Ramayana | బాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఫొటో తెగ వైరలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి రాముడిగా నటిస్తున్న రణబీర్‌తో పాటు సీతగా నటిస్తున్న సాయి పల్లవిల ఫొటోలు లీక్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం స్పందిస్తూ.. ఆ ఫొటోలు నకిలివని.. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో సృష్టించిన ఫేస్-స్వాప్ చిత్రాలని చిత్రబృందం తెలిపింది. 2015లో ప్రసారమైన ‘సియా కే రామ్’ సీరియల్లోని స్టిల్స్‌ను తీసుకుని, అందులోని నటీనటుల ముఖాలకు బదులుగా రణబీర్, సాయి పల్లవి ముఖాలను ఆకతాయిలు ఎడిట్ చేసినట్లు చిత్రబృందం తెలిపింది.
నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవితో పాటు రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో మొదటి భాగం 2026 దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండగా అధికారిక పోస్టర్లు త్వరలోనే విడుదల కానున్నాయి.