Heart Attack | ఏపీలోని మంగళగిరిలో విషాదం నెలకొంది. పీపీటీ ట్రైనింగ్‌లో భాగంగా నిర్వహించిన రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న ఓ హెడ్ కానిస్టేబుల్.. కాసేపటికే గుండెపోటుతో మృతిచెందాడు. మంగళగిరి ఆరో బెటాలియన్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని రామవరప్పాడుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పీపీటీ ట్రైనింగ్‌లో భాగంగా మంగళగిరి ఆరో బెటాలియన్‌కు వచ్చాడు. ఇక్కడ మంగళవారం నిర్వహించిన 3.2 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. అయితే రన్నింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే వెంకటేశ్వరరావు అస్వస్థతతకు గురయ్యాడు. ఛాతి పట్టుకుని మధ్యలోనే కుప్పకూలాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే.. అతన్ని సమీపంలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ వెంకటేశ్వరరావును పరీక్షించిన వైద్యులు.. గుండెపోటుతో మరణించాడని ధ్రువీకరించారు.
ఈ ఘటనతో మంగళగిరి బెటాలియన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడు వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేశ్వరరావు మృతి పట్ల పోలీసులు సంతాపం తెలిపారు.