నాగర్‌కర్నూల్, జూలై 23 : కాంగ్రెస్ అంటేనే కరువని, వారు సృష్టించిన ఎరువుల కొరతతో రాష్ట్రంలో రైతులు విలవిల్లాడుతున్నారని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చిన గన్నీ బ్యాగులను రైతులకు ఇవ్వకుండా వారి నుంచి బస్తాకు రూ.50 చొప్పున వసూలు చేసిన వారు నీపక్కనే తిరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
మొక్కజొన్న కొనుగోలు విషయంలో జరిగిన అక్రమాలపై అన్ని ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇంత వరకు స్పందన లేదన్నారు. రైతు నుంచి 140 బస్తాల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు ట్రక్ షీట్లు ఇచ్చి కేవలం130 బస్తాల డబ్బులు రైతులకు చెల్లించారంటే మిగతా పది బస్తాల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఈ విషయంపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడించి వంటావార్పు పెడతామని హెచ్చరించారు. రైతును మోసగిస్తే ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీలకు పుట్టగతులుండవని హెచ్చరించారు. నకిలీ డీఏపీ కొనుగోలు చేసి మోసపోయిన రైతులకు న్యాయం చేయాలని, నకిలీ డీఏపీని విక్రయించిన వారందరిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు.
174 టీఎంసీల కృష్ణాజలాలను సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు రావాల్సిన 34శాతం వాటాలో కేవలం 22శాతం మాత్రమే నీటిని వినియోగించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కృష్ణా జలాల వినియోగం చరిత్రలోనే అత్యంత కనిష్టస్థాయికి పడిపోయిందన్నారు. కర్ణాటకలో ఆల్మట్టి జలాశయం నుంచి రోజుకు 64వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుందని, మరో నాలుగు రోజుల్లో ఆల్మట్టి నిండి జూరాలకు వరద వస్తుందన్నారు.
సీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం మరో వారం రోజుల్లో శ్రీశైలానికి వరదలు చేరనున్నాయని, కల్వకుర్తి ఆయకట్టు కింద రైతులు ఇప్పటికే నార్లు పోసుకున్నారని, ఏమాత్రం వరద వచ్చినా ప్రభుత్వం నార్లాపూర్తోపాటు కల్వకుర్తి లిఫ్ట్ పంప్‌ను ప్రారంభించి రిజర్వాయర్లను నింపాలని మర్రి డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ రైతాంగం తరుఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, గ్రంథాలయ మాజీ చైర్మన్ హన్మంతురావు, చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటయ్య, పులేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సమద్‌పాషా పాల్గొన్నారు.