ఖిల్లాఘణపురం, జూలై 23 : సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తిరుమలాయపల్లి, కమాలుద్దీన్‌పూర్, ఆగారం , వెంకటాంపల్లి, మానాజీపేట గ్రామాల్లో జరుగుతున్న సర్‌పై ప్రత్యేక కార్యక్రమాన్ని మాజీ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో పేరు లేకుండా ఉం డకూడదన్నారు. ఓటరు నమోదు ప్రక్రియను అత్యంత బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరును నమోదు చేయించాలని సూచించారు. అదేవిధంగా తిరుమలాయపల్లి ఆగారం గ్రామా ల్లో సర్ కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేయడం అభినందనీయమన్నారు.
సర్పంచ్, బీఎల్వోల కృషిని ప్రశంసిస్తూ ఆయన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మండలంలోని మిగతా గ్రామాలు కూడా వందశాతం సర్ ప్రక్రియ పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉపాధి, ఉద్యోగాలు, విద్య తదితర కారణాలతో ఇతర వలస వెళ్లిన గ్రామస్తులను గుర్తించి వారి అర్హతను పరిశీలించి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో కొత్తగా 18 ఏండ్లు నిండిన యువత , పెండ్లితో చిరునామా మారిన మహిళలు, ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు నమోదు కాని అర్హులందరిని గుర్తించి నమోదు చేయాలని కోరారు. బీఎల్వోలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని , ఆయా బూతులలో కొంతమేరకు దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని పూర్తిగా తొలగించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు అవగాహన కల్పిస్తూ ఓటరు నమోదు ప్రక్రియ విజయవంతం అయ్యేలా కృషి చే యాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బాలీశ్వర్‌రెడ్డి, పార్టీ నాయకులు పురేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ఆదికేశవరెడ్డి, శేఖర్‌రెడ్డి, ఆది కేశవరెడ్డి, తిరుమలేశ్, వెంకటరెడ్డి, చెన్న య్య, మన్యం, నర్సింహులు, కేశవరెడ్డి, అంజన్‌రెడ్డి, కుమార్, నాగయ్య పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, జూలై 23 : నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ నెల రోజులుగా ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థి, యువతపై కేంద్ర ప్రభు త్వం అణచివేతను, దాష్టికాన్ని, దౌర్జన్యంను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ అణచివేతను నిరసిస్తూ రేపు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి విద్యార్థి, యువత భారీగా తరలివెళ్లాలని మాజీ మంత్రి తన స్వగృహంలో జరిగిన విద్యార్థి, యువత విభాగం ముఖ్య నాయకుల సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారా దేశవ్యాప్తంగా 7కోట్ల 50లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని దీనికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యమించడం హక్కు అని అటువంటి హక్కులను హరి స్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణిచివేతను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు.