రంగారెడ్డి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో 22ఏ నిషేధిత జాబితా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా పైసాపైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వం రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చిందని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ జాబితా నుంచి తొలగిస్తే తమ అవసరాలకు అమ్ముకుంటామని యజమానులు అధికారుల చుట్టూ తిరుగుతుంటే.. తమ పరిధిలో లేదని చేతులెతేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు ఆగాల్సిందేనని ఉచిత సలహాలిస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. బాధితులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకెళ్తే ఎన్వోసీలు తీసుకొస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తుండటంతో వాటికోసం అధికారుల చుట్టూ పైరవీకారులతో ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో తమ వ్యక్తిగత అవసరాల కోసం తమ స్తిరాస్తులు అమ్ముకోలేక అనేకమంది బాధితులు తీవ్ర ఆర్థిక, మానసిక సంక్షోభాన్ని అనుభవిస్తున్నారు.
22ఏ నిషేధిత జాబితా నుంచి ప్లాట్లు, ఇండ్లను తొలగించుకునేందుకు ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు ఇస్తామని చెబుతున్నా అవి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్లు, ఇండ్లు పట్టా భూములేనని పొరపాటుగా నిషేధిత జాబితాలో పడ్డాయని రికార్డులు పరిశీలించి ఎన్వోసీలు ఇవ్వాలని బాధితులు కోరుతుండగా అధికారులు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ఎన్వోసీలు ఇప్పిస్తామంటూ పైరవీకారులు రంగంలోకి రావడంతో బాధితులు చేసేదేమీలేక వారినని ఆశ్రయిస్తున్నారు. ఎన్వో సీలు రాక ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్లు స్తంబించిపోవటంతో భూబాధితులు తీవ్ర ఆర్థిక, మానసిక క్షోభకు గురవుతున్నారు. అవసరానికి ఆస్తులను అమ్ముకోలేక ఇబ్బందిపడుతున్నారు.
జిల్లాలోని తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట, ఆదిబట్ల, శంషాబాద్, తుక్కుగూడ, రాజేంద్రనగర్, గండిపేట వంటి సర్కిళ్లతోపాటు మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్లలోని వందలాది కాలనీల్లో వేలాది ప్లాట్లు, ఇండ్లు 22ఏ నిషేధిత జాబితాలో చేరాయి. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో సుమారు 250పైగా కాలనీలున్నాయి. అందులో రాగన్నగూడ గ్రామంలోని సర్వేనంబర్ 323లో ఎన్నో ఏండ్ల కిందట కాలనీ ఏర్పడింది.
ఈ సర్వేనంబర్‌పై గతంలో ఎన్వోసీ తీసుకుని రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుచేసి విక్రయించి వెళ్లిపోయారు. కాగా, ప్రస్తుతం ఈ సర్వేనంబర్ పూర్తిగా 22ఏలో చేరటంతో ఈ కాలనీలోని వందలాది ఇండ్లు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. ఇక్కడ ప్లాట్లు కొన్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగే, ఇంజాపూర్ గ్రామంలోని సర్వేనంబర్ 66, 126లోనూ అనేక కాలనీలు వెలిశాయి. ఈ కాలనీల్లోనూ ప్రభుత్వ భూములున్నాయంటూ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ఈ కాలనీల్లో ఇండ్లు, ప్లాట్లు కొన్న వారు అవసరానికి అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఏవీనగర్, సాయిగణేశ్‌నగర్, ఎంఎంకుంట వంటి ప్రాంతాల్లో అనేక ఇండ్లు, ప్లాట్లు మొన్నటి వరకు రిజిస్ట్రేషన్లు కాగా, ఇప్పుడు వారి ప్లాట్లు నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అలాగే, ఎంఎంకుంట సమీపంలోని శ్రీమిత్ర రియల్ఎస్టేట్ ఆధ్వర్యంలో వెంచర్లు ఏర్పాటు కావడంతో అందులో వేలాదిమంది ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ వెంచర్లు ఉన్న ప్రాంతం హార్డ్‌వేర్ పార్కుకు సంబంధించిన భూమి అని సర్కార్ నిషేధిత జాబితాలో చేర్చింది.దీంతో కొనుగోలుదారులు ప్లాట్లు విక్రయించిన వారు లబోదిబోమంటున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న సబ్‌రిజిస్ట్రార్(ఎస్ఆర్వో), తహసీల్దార్ కార్యాలయాల్లో గుట్టుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. కొంతమంది ఎస్ఆర్వోలు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. అలాగే, వక్ఫ్ బోర్డు, భూదాన్ వంటి భూములను రిజిస్ట్రేషన్లు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మరికొన్నిచోట్ల పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేసి ఆ తర్వాత డాక్యు మెంట్లను రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.