శుక యోగి- పరీక్షిన్మహారాజా! ఆలోచనామృతమైన బాలకృష్ణుని ‘ఉలూఖల బంధన’లీలలో చాలా పరమార్థాలు దాగి ఉన్నాయి. ‘ఈ లీల ఐశ్వర్యశక్తికి, వాత్సల్యరక్తి- ఆసక్తికి మధురమైన కలహం’ అన్నారు భావుకులైన భాగవతులు. ప్రేమకు వశుడై శ్యామబ్రహ్మ బంధింపబడుట ఆయనకు భూషణమే కాని దూషణం కాదు. అలంకారమే కాని కళంకం ఏ మాత్రం కాదు. ఆ బంధనం అచ్యుతుని ‘సచ్చిదానంద’ స్వరూపస్థితికి ఎటువంటి విచ్యుతి- విఘాతం (పతనం) కలిగించదు. ‘బుల్లికృష్ణుడు భగవంతుడే- శ్రీహరియే ఐతే తల్లి ఈ తరహాగా రోటికి కట్టగలదా?’ అని సంశయించాడు కంసుడు. నందగోపాలుని ఐశ్వర్యశక్తిని అంత గోపనీయం- రహస్యంగా ఉంచింది వాత్సల్య మూర్తి గోపకాంత యశోద. ‘నిగమాలు- వేదాలనే అరణ్యాలలో వెదికి వెదికి కనుగొనలేక ఖిన్నులై- విసిగి వేసరి ఉన్న ఓ సూరి జనులారా! విద్వాంసులారా! మీరు కోరే అగమ్యమైన ‘ఉపనిషదర్థములూఖలే నిబద్ధమ్’ ఉపనిషత్తుల ఆ పరమార్థం బాలముకుందుని రూపంలో నంద ప్రభువుల వారి గృహంలో దేవేరి (నందరాణి) యశోదచే ఉలూఖలాని (రోటి)కి నిబద్ధమై- కట్టబడి ఉండటాన్ని అవలీలగా కనుగొనవచ్చు’ అంటాడు లీలాశుకుడు.
ఆధ్యాత్మిక సాధనలో అత్యంత బాధకాలైన కామ క్రోధ లోభాలకు లోనైన వాడెంతవాడైనా- అవతార పురుషుడైనా భయానికి, పలాయనానికి, బంధనానికి గురి కావాల్సిందే! కాన, సాధకులు ఎంతో సావధానంగా ఉండాలి. పెచ్చరిల్లిన కామాదులు హచ్చున దేవుణ్నే (కృష్ణుని) వదలకపోతే లొచ్చైన జీవులను ఎలా వదలుతాయి? అని సున్నితమైన, లోతైన హెచ్చరిక! ‘అహోచిత్ర మహోచిత్రం’- ఆహా! కొందరు నిర్గుణ, నిరాకార, నిర్వికార బ్రహ్మను, మరెందరో సగుణ, సాకార బ్రహ్మను ఉపాసింతురు గాక! అయితే, ఏ ప్రేమ బంధానికి బద్ధుడై అనంత ప్రాణులకు ముక్తి ప్రదాత, స్వయం నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వభావం కలిగిన ఆ పరబ్రహ్మ భక్తులకు ‘క్రీడామృగీకృతమ్’- ఆటబొమ్మ అవుతున్నాడో, ‘వందేతత్ప్రేమ బంధనమ్’- ఆ ప్రేమ బంధానికి ‘మా వందనం’ అంటారు భాగవత వ్యాఖ్యాతృ చక్రవర్తి ఆచార్య శ్రీధరులు.
శుకుడు- రాజా! శ్రీరమాలోలుని- బాలకృష్ణుని రోల- రోటికి కట్టిన నందబాల చాల గొప్పపని చేశానని అనుకొని సంతసించి ఇంటిపనిలో మునిగిపోయింది. కన్నయ్య తన ఇంటి పెరట్లో ఎప్పటినుంచో ఉన్న రెండు పెద్ద మద్ది (అర్జున) చెట్లను కన్నాడు. నలకూబర మణిగ్రీవులనే ఇద్దరు యక్షులు- కుబేర పుత్రులు నారద మహర్షి శాపం వలన మద్ది వృక్షాలుగా పడి ఉన్నారు. వారిద్దరినీ చూచి వారిజాక్షుడు హరి రోలు ఈడ్చుకొంటూ ఆ చెట్ల దరికి చేరాడు.’ ఇలా బాదరాయణి- శుకముని అనగానే విని అవనీపతి పరీక్షిత్తు, ఆ శాపం పొందడానికి వారు చేసిన పాపం- అపచారం ఏమిటో తెలపమని ఆదరపూర్వకంగా అడిగాడు.
శుకుడు- రాజా! నలకూబర మణిగ్రీవులు నీలకంఠ భగవానుని సేవకులు. ‘కుబేరుని కుమారులం, పరమశివుని పరిచారకులం కదా!’ అన్న అహంకారంతో సదా సంచరిస్తూ ఉండేవారు. ఒకనాడు వారు కైలాసగిరిపై గంధర్వకాంతలతో జలక్రీడలు సాగిస్తున్నారు. ఇంతలో ఆ మార్గాన యతివరుడు నారదుడు విచ్చేశాడు. ఆయన్ని చూసి అతివలు గబగబా వలువలు ధరించారు. మద్యం మత్తులో చిత్తై ఉన్న యక్షపుత్రులు మహర్షి సమక్షంలో కూడా పొగరు కొద్దీ దిగంబరంగానే ఉండిపోయారు. అదిచూచి నారదుడు వారిని శపించబోతూ విజ్ఞతతో ఒక చక్కని సత్యాన్ని లోకానికి వక్కాణించాడు. గొప్ప సంగీతజ్ఞుడైన ఆ మహర్షి నోట వెలువడిన ఆ మాట ఇలా ప్రసిద్ధమైన ఓ పాటగా రూపొందింది..
శా॥ ‘సంపన్నుండొరు గానఁలేడు తనువున్ సంసారమున్ నమ్మి హిం
సింపం జూచు దరిద్రుఁడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హిం
సింపండన్యుల నాత్మకున్ సములగాఁ జింతించు నట్టేటఁ ద
త్సంపన్నాంధున కంజనంబు విను మీ దారిద్య్ర మూహింపగన్’
‘ధనవంతుడు ఎంత గుణవంతుని కూడా గణుతింపడు- లెక్క చెయ్యడు. తన సంపదను, శరీరాన్ని, సంసారాన్నీ నమ్ముకొని తన హితానికి, స్వార్థానికి ఇతరులను హింసించాలనే, వెత (బాధ)లకు గురి చేయాలనే చూస్తాడు. దరిద్రుడు దారిద్య్రానికి చిక్కి పెక్కు బాధలు పడుతూ కూడా పరులను బాధించడు. వారూ తనవంటి వారే కదా అని భావిస్తాడు. ఇది లోకరీతి. కాన, ఆలోచించగా ధనమదంతో అంధులైన వారికి దారిద్య్రమే సరైన అంజనం (కాటుక)గా తోస్తున్నది’. ఇలా నీతి విశారదుడు నారదుడు గీతం ఆలపించి, ‘కలవాని- కుబేరుని కొడుకులమని మదంతో కదం తొక్కుతున్నారు కాన, ఇల (భూమిపై)లో మద్ది వృక్షాలుగా వంద దివ్య సంవత్సరాలు పడి ఉండండి. చెట్లుగా పుట్టినా మీ మదిలో ఆదిదేవుని- విష్ణుని పట్ల భక్తి భావం పదిలంగా ప్రవర్తిల్లుతుంది. అదికూడా నా అనుగ్రహ ఫలంగానే. ఆపై ముకుందుడైన నందనందనుని దివ్య పాదారవింద స్పర్శతో మీరు హరిభక్తులై సుర(దేవ) లోకానికి మరల గలరు’. ఇలా పలికి నారదుడు నారాయణాశ్రమానికి వెళ్లిపోయాడు. ఇది శాపమా లేక వరమా? ఉద్ధవుని వంటి సిద్ధ పురుషులు- మహాత్ములు మునీశ్వరులు కూడా బృందావనంలో వృక్షరూపంగా జన్మించినా చాలని కోరతారు! ఆ యక్షులిద్దరూ వెంటనే మద్ది చెట్ల జంటగా నందుని ఇంట పెరట్లో పుట్టారు. ఇప్పుడు పరమ భాగవతుడైన నారదుని పలుకులను పాటించ దలచాడు యదుకుల తిలకుడు.
కం॥ ‘ముద్దుల తక్కరి బిడ్డఁడు
మద్దులఁ గూల్పంగ దలచి మసలక తా నా
మద్ది కవ యున్న చోటికి
గ్రద్దన రోలీడ్చుకొనుచుఁ గడకం జనియెన్’
మాయదారి ముద్దుకృష్ణునికి, మద్ది మానులకు మధ్య ఉన్న లోకానికి తెలియని జన్మాంతర అనుబంధపు పద్దు (పంతం, ప్రతిజ్ఞ)ను (కౌంతేయ ప్రతి జానీహి నమే భక్తః ప్రణశ్యతి- అర్జునా! నా భక్తుడెన్నడును నష్టానికి గురికాడు- గీతావాక్యం) పోతన తన సొంతమైన ఈ కంద పద్యంలో ముద్దుగా ఎంతో ఒద్దిక (పొందిక)తో దిద్దాడు. మాయలమారి ముద్దుకృష్ణుడు మద్ది మ్రాకులను కూల్చి ఆ ఇద్దరు భక్తులను ఉద్ధరించాలన్న ఉద్దేశంతో వెంటనే ఆ చోటికి, గ్రద్దన- అమాంతంగా రోటిని ఈడ్చుకుంటూ వెళ్లి, తన ధాటికి అడ్డం తిరిగిన బరువైన ఆ రోటిని తరువుల మధ్య ఉంచి సూటిగా లాగాడు. ఆ చెట్లు రెండూ వ్రేళ్లతో సహా భయంకరమైన శబ్దంతో నేల కూలిపోగా, చాలాకాలం తర్వాత వాటికి శాపం తొలగిపోయింది. యక్షులు నిజరూపంలో వెలిగిపోతూ ప్రత్యక్షమయ్యారు. భక్తలోక పాలకుడైన గోప బాలకునకు తలవంచి నతించి- నమస్కరించి, నుదుట చేతులు జోడించి ఇలా నుతించారు..
కం॥ ‘భువనములు సేయఁగావఁగ
నవతీర్ణుడవైతి కాదె యఖిలేశ్వర! యో
గి వరేణ్య! విశ్వమంగళ!
కవి సన్నుత! వాసుదేవ! కల్యాణనిధీ!’
‘వాసుదేవా! నీవు సర్వేశ్వరుడవు. మహాయోగివి. ఈ సృష్టికి సర్వశుభాలు చేకూర్చే వాడవు. వాల్మీకి వ్యాస, కాళిదాస, భాసాది విద్వత్కవులచే- దివ్యజ్ఞాన సంపన్నులచే వినుతింపబడువాడవు. నిగనిగలాడే కల్యాణ గుణరత్నాలకు నిధివి- తరగని గనివి. లోకాలను సృష్టించి, రక్షించుటకై అవతరించువాడా! నీకు అనేక నమోవాకాలు. నీ కృప వలన మేము తరించాము’. కల్యాణ నామం ఫలాత్మకం. మంగళ నామం సాధనాత్మకం. ‘సిద్ధిదః సిద్ధి సాధనః’ (విష్ణు సహస్ర నామాలు)- సాధన, సిద్ధి (ఫలం) రెండూ సిద్ధ సంకల్పుడైన భగవంతుడే!
శుకుడు- రాజా! నలకూబర మణిగ్రీవులు తమ ప్రతి ఇంద్రియానికి భక్తిరస పానం చేసే భాగ్యం ప్రసాదించమని అర్థించారు…
శా॥ ‘నీ పద్యావళు లాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్
నీ పేరంబని సేయు హస్త యుగముల్, నీ మూర్తి పైఁ జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపైఁ జిత్తముల్
నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజ పత్రేక్షణా!’
.. ‘అరవింద దళాక్షా! సత్కవులు రచించే శ్రవణీయమైన నీ స్తుతులను వినే చెవులను, నీ నామ, రూప, గుణ, లీలా, ధామ, కీర్తుల వైభవాన్ని ప్రస్తుతించగల వాక్పటిమను, నీకు సమర్పితంగా మంచి చేతలు ఆచరించు చేతులను, నీ దివ్యమంగళ రూపాల- అర్చావిగ్రహాల యందే నిగ్రహంతో నిలిచి ఉండే చూపులును, నీ పాద పద్మాలను ఆదరంగా మొక్కే ఔదలలు- శిరస్సులను, నీ సేవలోనే తరించాలనే యావ (తపన) కలిగి ఉన్న మనస్సులను, కుంటుపడక నీతోనే అంటగలిగి ఉండు బుద్ధులను (పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి- భాగవతం) వెనువెంటనే మాకు ప్రసాదించు’. నీ, నీ, నీ.. అంటూ అంతా నీవే, నీదే. నేను, నాది అనేది ఏది లేనే లేదు, ‘త్వమేవ సర్వం మమ దేవదేవ’ అన్న ‘సర్వ సమర్పణ’ భావాన్ని ఈ పద్యంలో అఖర్వం (నిండు)గా పండించాడు భక్త కవి పోతన. ఇది భావుక భక్తులందరికి ఆదర్శ ప్రాయమైన నిత్యప్రార్థన. (సశేషం)