సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్/మణికొండ: నగరంలో లోక్ సభ ఎన్నికల వాతావరణం సందడిగా సాగింది. ఓటు హక్కును సినీ, రాజకీయ, విద్యా, వైద్య రంగ ప్రముఖులు వినియోగించుకున్నారు. ప్రముఖులంతా ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూలో నిల్చొని తమ బాధ్యతను నిర్వర్తించారు. ఎస్సార్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కుటుంబ సభ్యులు, బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్‌లో అల్లు అర్జున్, షేక్‌పేట ఇంటర్నేషనల్ స్కూల్లో దర్శకుడు రాజమౌళి దంపతులు, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేష్ బాబు కుటుంబ సమేతం, జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో జానియర్ ఎన్టీఆర్ దంపతులు, గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాలలో హీరో నాని దంపతులు, జూబ్లీహిల్స్ రోడ్ నం.45లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నాగచైతన్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా, ఫిల్మ్‌నగర్ కల్చరల్ కేంద్రంలో మంచు మోహన్‌బాబు, రాజేంద్ర ప్రసాద్, విష్ణు, మనోజ్, లక్ష్మీ మంచు, రాఘవేంద్రరావు, కళ్యాణ్ రామ్, దిల్‌రాజు, విజయశాంతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలువురు అధికారులు, విశ్రాంత అధికారులతో పాటు రాజకీయ ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో సెరికల్చర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఓటు వేయగా, డీజీపీ రవిగుప్తా ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో ఓటు వేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎన్బీటీనగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ బంజారాహిల్స్ రోడ్ నం.14లోని శ్రీ వెంకటేశ్వరనగర్ బస్తీలో ఓటు వేశారు.

పలువురు సినీ నటీ, నటులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ హైదరాబాద్ పీజీ కళాశాల ప్రాంగణంలోని పోలింగ్ కేంద్రంలో ప్రముఖ సినీనటుడు జగపతి బాబు, మణికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి దంపతులు, బలగం సినీ దర్శకుడు వేణు, శివబాలాజీ దంపతులు, గ్రేటర్ మాజీ కమిషనర్ సోమేశ్ కుమార్ తన ఓటు హక్కును రాజేంద్రనగర్ డివిజన్లో దంపతులు ఇద్దరు వినియోగించుకోగా, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తన ఓటుహక్కును మైలార్దేవపల్లి డివిజన్లో వినియోగించుకున్నారు. వివిధ పార్టీల నుంచి కార్పొరేటర్ అభ్యర్థులు ఆయా డివిజన్లలో వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భార్య శైలిమ, కొడుకు హిమాంశుతో కలిసి సోమవారం మధ్యాహ్నం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని, ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నప్పుడే సరైన నాయకులు ఎన్నికవుతారని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తాను ఓటేశానని పేర్కొన్నారు.