Maharashtra : మహారాష్ట్రలో మహిళల మిస్సింగ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో 93,000 మంది మహిళలు (18 ఏళ్లు దాటిన వారు) కనిపించకుండా పోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తాజా నివేదికను అసెంబ్లీలో మంగళవారం వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రతి రోజూ సగటున 129 మంది మహిళలు కనిపించకుండా పోతున్నారు. వీరిలో 72 శాతం మంది మహిళల్ని తర్వాత గుర్తిస్తున్నారు.
వీటికి సంబంధించిన కేసులు పరిష్కారమవుతున్నాయి. అయితే, ఇంకా వేలల్లోనే మహిళల ఆచూకీ తెలియడం లేదు. 2024లో 45,662 మంది మహిళలు కనిపించకుండాపోగా, వారిలో 30,877 మందిని గుర్తించారు. మైనర్లకు సంబంధించి 2024లో 11,316 మంది మిస్సైతే, వారిలో 8,475 మందిని గుర్తించారు. 2025లో మిస్సైన మహిళల సంఖ్య ఇంకా పెరిగింది. ఈ ఏడాది 48,278 మంది మహిళలు కనిపించకుండా పోతే వారిలో 36,581 (75.8 శాతం) మందిని గుర్తించారు. మహిళలు, అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో తప్పిపోతుండటంపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. 2015లో ‘ఆపరేషన్ ముస్కాన్’ను ప్రారంభించింది. మిస్సింగ్ కేసులను త్వరగా చేధించడం, మహిళలు, బాలికల్ని, బాలురను కూడా త్వరగా గుర్తించడం, వారికి కుటుంబ సభ్యులకు అందజేయడం ‘ఆపరేషన్ ముస్కాన్’ ముఖ్య ఉద్దేశం.
2024లో 13వ దశ ‘ఆపరేషన్ ముస్కాన్’ నిర్వహించారు. ఈ ఏడాది 14వ దశ ‘ఆపరేషన్ ముస్కాన్’లో భాగంగా ఫిబ్రవరి 16 వరకు 454 మంది బాలురను, 947 మంది బాలికల్ని గుర్తించారు. 15-18 ఏళ్లలోపు టీనేజర్లకు సంబంధించిన డాటాను కూడా ప్రభుత్వం వెల్లడించింది. 2024, 2025లలో 4,989 మంది తప్పిపోగా, వారిలో 4,813 మందిని గుర్తించారు.