ఖమ్మం రూరల్, ఆగస్టు 7: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల నుంచి అధికారిక అవగాహన కార్యక్రమాల వరకు ఎన్నిక కాని వ్యక్తులు జోక్యం చేసుకుంటుండటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా, వాటిలో గణనీయమైన వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. చైర్పర్సన్ పదవి కూడా మహిళకే కేటాయించారు. అయితే కొద్దిమందిని మినహాయిస్తే పలువురు మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలు, తండ్రులు, సోదరులు వ్యవహారాలు చక్కబెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిలర్లకు హైదరాబాద్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబసభ్యులే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో అధికార హోదా లేకపోయినా కొందరు అధికారులు ప్రశ్నించడం, వార్డుల్లో అధికారుల పర్యటనల సమయంలో నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అధికార యంత్రాంగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికంగా చర్చ సాగుతోంది.
ప్రజలు ఎన్నుకున్న మహిళా కౌన్సిలర్లు నామమాత్రంగా మిగిలిపోకుండా, ప్రజాప్రతినిధులే తమ బాధ్యతలు నిర్వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ఎన్నిక కాని వ్యక్తుల జోక్యాన్ని నియంత్రించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.