Bomb scare | దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చిందని పోలీసు అధికారులు చెప్పారు. దీంతో తీహార్ జైలు అధికారులను ఢిల్లీ పోలీసులు అప్రమత్తం చేశారు. తీహార్ జైలుకు చేరుకున్న బాంబు స్క్వాడ్, కీలక నేతలతోపాటు ముఖ్యమైన ఖైదీలు ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు సమాచారం.
నెలలో ఢిల్లీలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఇది నాలుగోసారి. దీంతో ఢిల్లీ వాసుల్లో భయాందోళన నెలకొంది. ఇంతకు ముందు ఢిల్లీలోని 20 దవాఖానలతోపాటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి, 150కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాలలకు ఒకే ఐపీ అడ్రస్ నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.