Social Media | ఆమె చుట్టూ.. సైబర్ ఉచ్చు!
ఓ పదివేల ఏళ్లకు ముందు.. మనిషి ఇంకా సంచారజీవిగానే ఉన్నప్పుడు బాధ్యతలు సమష్టిగానే ఉండేవి. వేట అయినా, పిల్లల పెంపకమైనా ఆ బరువు తల్లిదండ్రులిద్దరిదీ. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే తెలివి వచ్చాక.. సాగు సాయంతో జీవనం ఓ చోట స్థిరంగా మారింది.
ఓ పదివేల ఏళ్లకు ముందు.. మనిషి ఇంకా సంచారజీవిగానే ఉన్నప్పుడు బాధ్యతలు సమష్టిగానే ఉండేవి. వేట అయినా, పిల్లల పెంపకమైనా ఆ బరువు తల్లిదండ్రులిద్దరిదీ. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే తెలివి వచ్చాక.. సాగు సాయంతో జీవనం ఓ చోట స్థిరంగా మారింది. అప్పుడు మొదలైంది విభజన. ఆడవారు పిల్లల్ని, ఇంటిని చూసుకోవాలనీ.. బయటికి వెళ్లే వెసులుబాటు ఉంది కాబట్టి పశువులను, బలిష్టమైన శరీర నిర్మాణం ఉంటుంది కాబట్టి వ్యవసాయాన్నీ మగవారు చూసుకోవాలనే ఏర్పాటు జరిగింది. క్రమంగా అది పెత్తనంగా మారింది. అతివను సైతం ఆస్తిగా భావించే రోజులు మొదలయ్యాయి. అది పక్షపాత ధోరణిని దాటి, అణచివేత స్థాయికి చేరుకుంది. ఇది ఇంతే అని అందరూ సర్దుకునేంతగా సామాజిక మద్దతు దొరికేసింది. కొన్ని వందల ఏళ్లుగా ఆ పరిమితులను దాటే పోరు చేస్తూనే ఉన్నారు మహిళలు. ఒక్కో అడుగు, ఒక్కో అణచివేత, ఒక్కో నిషేధాన్ని దాటుకుని చిట్టచివరకు సమాన స్థాయికి చేరుకునే సమయంలో మళ్లీ వేల సంవత్సరాలనాటి ఆటవికతను తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది కూడా నేరుగా కాదు.. డిజిటల్ జీవితంలో! అదే టీఎఫ్జీబీవీ (Technology-facilitated Gender-based Violence) సాంకేతికత సహాయంతో జరిగే లింగ వివక్షాత్మక హింస!!
జర్నలిస్ట్, నటి, యూట్యూబర్, యాత్రికురాలు, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు, రచయిత్రి… ఏ వృత్తి చేపడితేనేం! ప్రతి వివక్షకీ జవాబుగా నిలబడిన జీవితం తనది. కానీ, తన మాటను, భావాలను, స్వేచ్ఛను, పోరాటాన్ని.. ఇష్టపడనివారు దాడిచేయడం ఇప్పుడు సులవైపోయింది. దాని ఫలితం ఏంటన్నది పక్కన పెడితే ముందుగా ఆ అక్కసుకు అవకాశాలు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయి. రచ్చబండ మీద ఊరిపెద్దలను మించి.. సోషల్ మీడియాలో ఊరూపేరూ లేకుండానే సాగే దాడులే ఇప్పుడు భయపెడుతున్నాయి.

బజారులో నిలబెట్టి
‘అమ్మాయి ఓకే చెప్పేదాకా వెంటపడుతూనే ఉండాలి’ అనే మాటను సినిమాల్లో అలవోకగా అనేస్తాం. కానీ, దాన్ని నిజజీవితానికి అన్వయించుకుంటే మాత్రం ఒళ్లు జలదరిస్తుంది. ఆకతాయిలు ఇప్పుడు అదే మార్గంలో ఉన్నారు. ఒకవేళ ఎవరన్నా తన మాట కాదంటే ఆన్లైన్లో వెంటపడటం, వాళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేయడం ఇప్పుడు తేలికైపోయింది. అందుకు యాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. బంధంలో ఉన్న అమ్మాయి దూరమైతే.. ఇప్పుడు తనను బజారుకి ఈడ్చడం తేలికైపోయింది. నీతో కలిసి ఉన్న ఫొటోలను బయటపెడతా అని బెదిరించడం (sextortion), AI సాయంతో నగ్నంగా రూపొందించిన వీడియోలను పోస్ట్ చేయడం (Revenge Porn) ఇప్పుడు సర్వసాధారణం. CCRI అనే సంస్థ ప్రకారం సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒక్కరు ఈ అశ్లీల చిత్రాల బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.

ఆన్లైన్ నిఘా
ఎవరినన్నా వెంబడించడాన్ని స్టాకింగ్ (Stalking) అంటాం. కానీ ఇప్పుడు మన సామాజిక జీవనం అంతా ఆన్లైన్లోనే కదా. ఆ డిజిటల్ ప్రయాణాన్ని వెంబడిస్తుంటే… అదే సైబర్ స్టాకింగ్ (Cyber Stalking). వీరు ప్రతి పోస్టునీ, కామెంట్నీ, స్టేటస్నీ నిరంతరం గమనిస్తూ ఉంటారు. కొందరు కేవలం వ్యామోహంతో ఈ పని చేస్తే మరికొందరు మాత్రం ద్వేషంతో వెంటాడుతుంటారు. ట్రోల్ చేస్తూ, చంపేస్తామనో, సంగతి తేలుస్తామనో బెదిరిస్తూ, బూతులతో దాడిచేసి భయపెట్టే ప్రయత్నం చేస్తారు. Amnesty International ప్రకారం ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇవి కేవలం బెదిరింపులే కదా అనుకునో, ఇంట్లో చెబితే రచ్చ అవుతుందనో… చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. కానీ థాయ్‌లాండ్‌లో జరిగిన ఓ పరిశోధన ఆన్లైన్ వేధింపులు తర్వాత స్థాయిలో భౌతిక దాడులుగా మారతాయని చెబుతున్నది.

చొరబడే చొరవ కోసం
లెనన్ ఓ 13 ఏళ్ల అమ్మాయి. రియాలిటీ షోస్‌లో కూడా పాల్గొనేది. తన కెరీర్‌కి ఉపయోగపడుతుందని ఓ ఫోన్ ఇచ్చారు తల్లిదండ్రులు. దాంతోనే సామాజిక మాధ్యమాలూ అలవాటయ్యాయి. వాటిలో పరిచయం అయిన పెద్దలు క్రమంగా తనతో సంభాషణలు పెంచుకుని, వ్యక్తిగత చిత్రాలు పంపేస్థాయికి చేర్చారు. అది ఓ విష వలయంగా మారింది. లెనన్ నిజంగా పంచుకున్న కథ ఇది. ఆన్లైన్ ఓ అడవిలాంటిది. కటిక చీకటి రోజున, అందులో తోడేళ్లే నేస్తాల్లా పరిచయం పెంచుకుంటాయి. మారుపేర్లతోనో, ఫేక్ ఉద్యోగాలతోనో, తీయని మాటలతోనో దగ్గరవుతాయి. మైనర్లని, మరీ ముఖ్యంగా అమ్మాయిలే లక్ష్యంగా వీరి వేట ఉంటుంది. దీనికి ‘గ్రూమింగ్’ అని పేరు. ప్రతి అయిదుగురిలో ఇద్దరు పిల్లలు ఇలాంటివారిని ఎదుర్కొంటున్నారని తేలింది. టీనేజ్ దశలో గుర్తింపునీ, కుటుంబేతర స్నేహాలనీ కోరుకునే అమ్మాయిల పాలిట ఇది శాపమే.
దూరం పెట్టే దుందుడుకు
రాజ్యాంగం అందరికీ భావప్రకటన స్వేచ్ఛను ఇస్తుంది. కానీ, ఇలాంటి హక్కులను ఉపయోగించినప్పుడల్లా భయభ్రాంతులను గురిచేసి ప్రాథమిక హక్కులకు దూరంగా ఉంచడాన్ని ‘chilling effect’ అంటారు. మహిళా జర్నలిస్టుల పట్ల కనిపించే వేధింపే ఇందుకు ఉదాహరణ. ఇది నిరూపించేందుకు ఐక్యరాజ్య సమితి 2020లోనే The Chilling పేరుతో ఓ సర్వేను ప్రకటించింది. ఏడాది పాటు జరిగిన ఈ శోధనలో బాధాకరమైన నిజాలు వినిపించాయి. ఈ సర్వేలో పాల్గొన్న…
- 73 శాతం మంది మహిళలు ఏదో ఓ రూపంలో ఆన్లైన్ హింసను ఎదుర్కొన్నట్టు చెప్పారు.
- నాలుగోవంతు మందికి పైగా, ఆన్లైన్ వేధింపుల వల్ల కుంగుబాటుకు లోనయినట్టు వాపోయారు.
- పై అధికారులకు ఈ సందర్భాల గురించి చెప్పినప్పుడు స్పందించకపోవడమో, పట్టించుకోవద్దని సూచించడమో, ఇదంతా సహజమే అని కొట్టిపారేయడమో
జరిగింది.
ఫలితంగా ఉద్యోగం మానేయడం, దీర్ఘకాలిక సెలవు మీద వెళ్లడం, సామాజిక మాధ్యమాలకు దూరం కావడం లాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఫలితం! ఆకతాయిలు అనుకున్నది సాధిస్తున్నారు.
వేయితలల విషం
రావణుడికి పది తలలే కానీ మాధ్యమాల్లో ఉండే మృగాలకు వేలమార్గాలు. ఒక విషయంలో జాగ్రత్తపడగానే.. మరో దొడ్డిదారిలో దాడిచేస్తారు.
- ట్రోల్ చేయాలి అనుకున్న మహిళల ఫోన్ నెంబర్లు, ఇంటి చిరునామా లాంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో పెట్టడాన్ని Doxxing అంటారు. దాంతో ఇతరులు కూడా వారిని వేధించే అవకాశాన్ని ఇస్తుంటారు. ఉదాహరణకు రాణా అయూబ్ అనే జర్నలిస్ట్ ఫోన్ నెంబర్‌ను ఓ ట్రోలర్ బహిర్గతం చేయగానే.. నిమిషాల్లో ఆమెకు 200 బెదిరింపు కాల్స్ వచ్చాయి.
- ట్రోల్ చేయాలి అనుకున్న వ్యక్తి పేరు మీద ఏకంగా ఆ నకిలీ ఖాతాను సృష్టించి (Identity Theft) అశ్లీల, వివాదాస్పద కంటెంట్ పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.
- మహిళల ఫొటోలే పెట్టుకుని సాటి మహిళలను స్నేహంలోకి దింపి ఉచ్చులోకి లాగడం మరో పద్ధతి.
- సామాజిక మాధ్యమాల్లో అందమైన అమ్మాయిలు ఉంటే వారిని లైంగికంగా వేధిస్తారు. లోకం కొలతల ప్రకారం అందంగా లేకపోతే వారినీ ఎగతాళి చేస్తారు. రెండు రకాలుగానూ సమస్యే. లావుగా ఉండటం, ఛాయ తక్కువ కావడం లాంటి లక్షణాలు కనిపిస్తే చాలు ‘బాడీ షేమింగ్’ మొదలైపోతుంది.
- మనలో ఐకమత్యత తక్కువ అని అంటుంటారు. కానీ, ఓ మహిళ మాట ఎవరినన్నా నొప్పించగానే ట్రోలర్స్ అంతా ఒకటైపోతారు. కలిసికట్టుగా వేట మొదలుపెడతారు. ఇప్పుడు ఎవరో ఒకరిని కాదు తను నేరుగా ఓ ట్రోలింగ్ వ్యవస్థనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- ట్రోలింగ్ దుర్గుణాలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఇక చెప్పనక్కర్లేదు. రకరకాల హ్యాకింగ్ పద్ధతుల ద్వారా బాధితుల లొకేషన్, వ్యక్తిగత చాట్లను సైతం తెలుసుకుని వేటాడతారు.
జాగ్రత్తలు పాటించాల్సిందే!
సామాజిక మాధ్యమాలు సత్యంగా తలుచుకుంటే.. మహిళ మీద జరిగే ఆన్లైన్ ట్రోలింగ్, బెదిరింపులు, వేధింపులు, వ్యక్తిత్వ హననం లాంటి వాటిని చాలావరకు ఆపగలవు. కానీ, సదరు కంపెనీలు అలా చేయవు అన్నది కఠినవాస్తవం. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఎంతలా నియంత్రించాలని చూసినా వ్యాపారమే ధ్యేయంగా సాగే ఆ సంస్థలు వీటి మీద ఉక్కుపాదం మోపవు సరికదా… మరింతగా జనాల దృష్టిని ఎంతలా కట్టిపడేయాలనే ఆలోచిస్తాయి. అందుకని మనమే కొంత జాగ్రత్తగా ఉండాలి.
- అందరికీ తెలియకూడదు అనుకుంటే ప్రొఫైల్స్‌ని, పోస్టులను ప్రైవేట్‌గా ఉంచాలి. ప్రొఫైల్స్‌లో మన ఫోన్ నెంబర్, చిరునామా, బంధాలు, కుటుంబ ఫొటోలు లాంటి వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించకపోవడం మేలు.
- లొకేషన్ ట్యాగ్ చేయడం, లేదా ఉన్నచోటు స్పష్టంగా కనిపించే పోస్టులు పెట్టడం తగదు. ఈమధ్యే వనస్థలిపురంలో జరిగిన ఓ హత్య ఇందుకు హెచ్చరిక. ఇన్‌స్టా పోస్టుతో తన మాజీ భార్య ఉన్న చోటును కనిపెట్టి… ఆ ప్రాంతంలో రెక్కీ చేసి మరీ దారుణంగా చంపాడు ఆ హంతకుడు.
- యాప్ పర్మిషన్లను జాగ్రత్తగా అనుమతించాలి. మైక్, కెమెరా, కాంటాక్టులకు అనుమతి ఇవ్వకూడదు.
- నెట్ వాడకం మొదలుపెట్టినప్పటి నుంచీ మనం తెలియకుండానే కొంత సమాచారాన్ని వెల్లడిస్తూ ఉంటాం. దీన్నే డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటారు. అవసరం లేని ఈ ముద్రల్ని చెరిపేయడం మేలు. దీనికోసం రకరకాల టూల్స్ అందుబాటులో ఉన్నాయి.
- ఖాతాలను హ్యాక్ చేయడానికి వీల్లేకుండా కఠినమైన పాస్ వర్డులతోపాటు multi-factor authentication, password manager లాంటి అడ్డుగోడలు ఉండాలి.
- మన పేరును మనం గూగుల్ చేసుకోవడం ద్వారా ఎక్కడెక్కడ మన సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉందో తెలుసుకుని, అవసరం లేనిచోట ఆ ముద్రలు చెరిపేయాలి.
- ప్రైవేట్, పబ్లిక్ జీవితాలకు వేర్వేరు ఖాతాలు ఉపయోగించడం; ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలన్నీ ఒకేచోట కలపకపోవడం లాంటి జాగ్రత్తలు అవసరం.
- జర్నలిజం, రాజకీయాలు లాంటి రంగాల్లో ఉంటూ రిస్క్ ఎక్కువగా ఉందని భావించినప్పుడు VPN, Incognito Mode లాంటివి ఉపయోగించాలి. మొబైళ్లలో సైతం యాంటి మాల్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవడం చేయాలి. వినడానికి ఇవి కాస్త సాంకేతికంగానే ఉండవచ్చు. కానీ చాలా తేలికగానే వాడవచ్చు.
దాడి మొదలవగానే అప్రమత్తత!
ఎవరో ఊరూపేరూ పెట్టుకోవడానికి కూడా భయపడేవాడు బెదిరిస్తున్నాడులే… అని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఓ ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆన్లైన్ వేధింపులకు గురైన మహిళలలో ఓ 41 శాతం మంది అది క్రమంగా భౌతిక దాడులకు దారితీస్తున్నదని పేర్కొన్నారు. అందుకే…
- ఆన్లైన్ వాదన కాస్తా బెదిరింపు స్థాయికి చేరుకుంటే… వెంటనే ఆ వ్యక్తిని బ్లాక్ చేసి సదరు మాధ్యమానికి రిపోర్ట్ కొట్టాలి.
- వేధింపులకు సంబంధించి స్క్రీన్ షాట్లు, చాట్స్, ఫొటోస్ జాగ్రత్త చేయాలి.
- ఐటీ చట్టం ఇప్పుడు చాలా పకడ్బందీగా మారింది. పైన చెప్పుకొన్న Cyberstalking నుంచి Identity Theft వరకు ప్రతీ నేరానికి కచ్చితమైన శిక్షలు ఉన్నాయి.
- నేరాన్ని అప్పటికప్పుడు రిపోర్ట్ చేసేందుకు 1930 (cybercrime helpline), 1091 (women helpline), 14490 (National Commission for Women Helpline) లాంటి హెల్ప్లైన్లకి కాల్ చేయవచ్చు.
- వీటితో పాటు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ల మొదలుకొని, సఖి కేంద్రాల వరకూ చర్యల కోసం చాలా అవకాశాలే అందుబాటులో ఉన్నాయి.
ఆన్లైన్ వేధింపులను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. దానికంటే చిమ్మచీకట్లో ఓ దట్టమైన అడవిలో మోపే అడుగే మరింత తేలిక. శత్రువు ఎవరో తెలియదు. ఎందుకు దాడి చేస్తున్నాడో అర్థం కాదు. ఆడపిల్లగా అప్పటిదాకా దాటిన పరిమితుల్ని మించి.. ఈ కొత్త పోకడ ఓ విభ్రాంతి. కానీ తప్పదు. చీకటి యుద్ధం చేసేవారిలో విచక్షణ వచ్చేవరకూ, సామాజిక మాధ్యమాలు వాటిని వ్యాపారంగా కాకుండా బాధ్యతగా చూసేవరకు, న్యాయవ్యవస్థ మరింత కఠినంగా మారేవరకు.. ప్రమాదాన్ని తట్టుకుని నిలబడాల్సిందే. వాటి గురించి అవగాహన పెంచుకుని పదిమందికీ చెప్పాల్సిందే!
ఠారెత్తించిన ఇన్ స్టా!
X మనం తనను రేప్ చేసేయగలం
Y సరే చేసేద్దాం.
X ఓ పని చేద్దాం. తనను పిలిచుకురా. నేను ఇంకో ఇద్దరు కుర్రాళ్లని కూడా తెస్తాను. అందరం కలిసి గ్యాంగ్ రేప్ చేద్దాం.
ఈ సంభాషణ ఎవరో కరుడుగట్టిన నేరస్తుల మధ్య జరిగింది కాదు. దిల్లీలోని ప్రతిష్ఠాత్మక స్కూళ్లలో 11, 12 తరగతులు చదువుతున్న కుర్రాళ్లవి. ఆ గ్రూప్ పేరు ‘బాయ్స్ లాకర్ రూం’. కేవలం వాళ్లలో వాళ్లు విచ్చలవిడి కబుర్లు చెప్పుకోలేదు. తమ క్లాస్మేట్స్ నగ్న చిత్రాలను ప్రచారం చేశారు. మరికొంతమందిని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయం తెలిసి వారి మీద కంప్లయింట్ ఇవ్వడానికి ప్రయత్నించిన అమ్మాయిలను బెదిరించేందుకు ప్రత్యేకంగా మరో ఖాతాను కూడా తెరిచారు. ఆ స్క్రీన్ షాట్స్ బయటికి రాగానే ఖాతాలను మూసేసి అజ్ఞాతంగా ఉండిపోయారు. కానీ ఆ స్క్రీన్ షాట్స్ జాతీయ మీడియాలో చర్చకు రావడంతో పోలీసులు, మహిళా కమిషన్ అంతా చర్యలకు సిద్ధపడ్డారు. కొన్ని అరెస్టులైతే జరిగాయి కానీ.. భయం మాత్రం పోలేదు. ఆకతాయితనమూ ఆగలేదు. 2020లో జరిగిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాలు మనలో ఆటవికతను ఎంతలా పెంచి పోషిస్తున్నాయి, దాన్ని బయటపెట్టే దారి చూపిస్తున్నాయో చెబుతున్నది.

అడపాదడపా.. మగవారి మీదా!
ట్రోలింగ్ చేయడానికి ఆడామగా భేదం లేదు నిజమే. కాకపోతే మగవారిని వేటాడటంలో వివక్ష చాలా అరుదు. అందుకు మినహాయింపులు లేకపోలేదు. అవి ఒక్కోసారి ప్రాణాలు తీసిన సందర్భాలూ ఉన్నాయి.
2015, ఆగస్టు 23. జస్లీన్ కౌర్ అనే మహిళ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగిన ఓ వాదనలో.. సర్వజీత్ అనే వ్యక్తి తన మీద అశ్లీలమైన కామెంట్స్ చేశాడనీ, అతన్ని సమాజం ముందు నిలబెడుతున్నానంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. క్షణాల్లో అది వైరల్ అయ్యింది. అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం జస్లీన్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. నిజానిజాలు గమనించకుండానే లక్షలమంది ఆ పోస్టుకు మద్దతు పలికారు. అందులో పేర్కొన్న వ్యక్తిని దిల్లీకే మచ్చ అనీ, తనో మృగం అనీ నానామాటలన్నారు. ఇదంతా తట్టుకోలేక అతను వేసిన కేస్‌కు జస్లీన్ బదులివ్వలేదు. పైగా ఘటన జరిగిన సమయంలో ఉన్న సాక్షులు.. సర్వజీత్ హద్దులు మీరలేదని కోర్టుకు చెప్పారు. కానీ, కేసు ముగిసేనాటికి అతని వ్యక్తిత్వ హననం జరిగిపోయింది.
2014లో ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు (Rohtak sisters), తమను వేధించిన ముగ్గురు యువకుల మీద తిరగబడి వాళ్లను కొడుతున్న వీడియో సంచలనంగా మారింది. కేంద్ర మంత్రులు సైతం దీన్ని సమర్థించారు. ఘటన జరిగిన హరియాణాలో నాటి ముఖ్యమంత్రి వాళ్లకు ఘనమైన నగదు బహుమతి కూడా ప్రకటించారు. ఆధునిక మహిళలకు ప్రతినిధులుగా అందరూ వాళ్లను పొగుడుతున్న సమయంలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈసారి ఆ అక్కాచెల్లెళ్లు మరో వ్యక్తిని కొడుతున్నారు. దాంతో వారి ప్రవర్తన మీద సందేహం కలిగి వాస్తవాలను తవ్వగానే నాటి సంఘటన ఈవ్ టీజింగ్ కాదు. బస్సులో సీటు కోసం జరిగిన గొడవ అని తేలింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ ముగ్గురు యువకులలో ఇద్దరు సైన్యంలో చేరబోతుండగా… వారిని సదరు ఉద్యోగాలకు అనర్హులుగా తేల్చేశారు.
మానవ్ సింగ్ ఓ పదిహేడేళ్ల కుర్రాడు. బాగా చదువుతాడు. కానీ, అకస్మాత్తుగా ఓ రోజు భవ్లీన్ కౌర్ అనే అమ్మాయి అతను తనని వేధించాడంటూ ఇన్‌స్టా పోస్టులు పెట్టింది. పోస్ట్ అయిన క్షణాల్లోనే మానవ్‌ను తిడుతూ కాల్స్ రావడం మొదలైంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక అతను తన అపార్ట్మెంట్ మీద నుంచి దూకి చనిపోయాడు. చనిపోయాక కూడా భవ్లీన్ తనను ఎగతాళి చేస్తూ అతని చావు సంతోషం కలిగించిందని ఇంకో పోస్ట్ పెట్టింది. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని మానవ్ తండ్రి ఎంతగా మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. చివరికి జాతీయ మానవహక్కుల కమీషన్ పరిశోధన వేగం పుంజుకుంది. మానవ్ తప్పులేదని తేలింది.
ఈ ఉదాహరణలు చెప్పుకోవడానికి రెండు కారణాలు. ఒకటి అరుదుగా మగవారు కూడా ఆన్లైన్ వేధింపులకు గురవుతారు. రెండు! ఓ నాలుగైదు ఉదాహరణలే ఇంత హృదయ విదారకంగా ఉంటే.. అడుగడుగునా వెతలు పడుతున్న లక్షలాది మహిళల సంగతేంటి.
పెళ్లి పేరుతోనూ మోసమే!
అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేయాలంటారు. అలా చేసిన పెళ్లిళ్లు భద్రంగా ఉంటాయన్నది చాలామంది నమ్మకం. అన్లైన్ దానికీ తూట్లు పొడిచేస్తున్నది. ఈ వెబ్సైట్లలో దాదాపు 88 శాతం నకిలీ ప్రొఫైల్సే అని ఓ సర్వే చెబుతుండటం గమనార్హం.
సవాలక్ష మ్యాట్రిమోనియల్ సైట్లలో కనిపించే ప్రొఫైల్స్‌ని ఎవరూ నిర్ధరించలేకపోతున్నారు. దాంతో విజయవంతమైన జీవితాలను చూపించి ఉచ్చులోకి దించుతున్నారు. ఇక పెళ్లి జరిగిపోతుంది అనే భ్రమలో చనవుగా అడిగిన డబ్బులు ఇస్తున్నారు. మరి కొందరైతే మరో అడుగు ముందుకేసి శారీరికంగానూ లోబర్చుకుంటున్నారు. తర్వాత ఆ ఫొటోలను పబ్లిక్ చేస్తామని బెదిరిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిశ్చితార్థం జరిగిన తర్వాత సగం పెళ్లి అయిపోయినట్టే అన్న భావనతో పెరిగే చనువు, మోసగాళ్లకు మరింత అవకాశాన్నిస్తుంది. ఆన్లైన్ మ్యాట్రిమొని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ ప్రొఫైల్ ఫేక్ అని తేలితే ఇతరులు మోసపోకుండా రిపోర్ట్ చేయాలి; ఆర్థిక లావాదేవీల జోలికి పోకూడదు; పూర్తి నమ్మకం లేకుండా నిశ్చితార్థానికి సిద్ధపడకూడదు.
– కె.ఎల్.సూర్య
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

