అబిడ్స్, సుల్తాన్‌బజార్, జూన్ 8: మృగశిరకార్తె రోజు ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఎన్నో ఏండ్ల నుంచి బత్తిని కుటుంబీకులు ఇస్తున్న చేప ప్రసాదాన్ని తీసుకొనేందుకు వివిధ రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్యలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి తరలివచ్చారు. దీంతో ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశాల మేరకు.. ఆర్డీవో రామకృష్ణ నేతృత్వంలో పలువురు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన వారికి పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. చేప ప్రసాదాన్ని మంగళవారం వరకు నిరంతరాయంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు.