CRPF Chief : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ (Gyanendra Pratap Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సిబ్బందికి సన్మానం చేసిన కార్యక్రమంలో ఆయన ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఎలాంటి భయం లేకుండా పనిచేయాలని బలగాలకు పిలుపునిచ్చారు. ‘సీఆర్పీఎఫ్ డైరెక్టర్ (CRPF Director) గా ఇక్కడ నేను మీకో హామీ ఇస్తున్నా. విధులు నిజాయతీగా నిర్వర్తించడంలో మీరు తీసుకునే నిర్ణయాలు, చర్యలకు నేను బాధ్యత వహిస్తా. ప్రజాప్రయోజనం కోసం తీసుకునే చర్యలకు జవాబుదారీగా వ్యవహరించాల్సి వస్తే దానిని నేను పూర్తిగా స్వీకరిస్తా’ అని జ్ఞానేంద్ర తన సిబ్బందిని ఉద్దేశించి అన్నారు.
ఈ నెల 20న ‘చలో పార్లమెంటు’ నిరసనల సమయంలో భద్రతా విధులు నిర్వర్తించిన సీఆర్పీఎఫ్-ఆర్ఏఎఫ్ బలగాలు, పోలీసులు.. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ జ్ఞానేంద్ర ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆరోపణలపై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ అంతకుముందు కూడా స్పందించారు. ఏదైనా భారీ ఆపరేషన్ తర్వాత తాము వృత్తిపరమైన మూల్యాంకనం చేపడతామని చెప్పారు. నిరసనకారులపై ఆర్ఏఎఫ్ సిబ్బంది తీసుకున్న చర్యల విషయంలోనూ ఆ పరిశీలన చేస్తామని తెలిపారు.
అది తమ నిబంధనల్లో భాగమేనని జ్ఞానేంద్ర చెప్పారు. సీఆర్పీఎఫ్ బలగాలు దేశవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర పోలీసులతో సహకరిస్తూ వైవిధ్య పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా స్పందించగల సామర్థ్యం వారి సొంతం. ఇక ఏదైనా ప్రాంతంలో ఘర్షణలు, రద్దీ, అశాంతియుత పరిస్థితులను నెలకొన్నప్పుడు వాటిని నియంత్రించేందుకు సీఆర్పీఎఫ్లోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపుతారు.