Mud Road | కొల్చారం: రోడ్డు బురదమయం కావడంతో తండాకు వెళ్లాలంటే తండ్లాట తప్పడం లేదని జనాభాయ్ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామపంచాయతీ పరిధిలోని జనాభాయ్ తండా పరిస్థితి ఇది. తండాకు వెళ్లే మట్టి రోడ్డు మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా బురదమయంమై నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓట్లు అడగటానికి వస్తారు కానీ సమస్యలు తీర్చడానికి రారా అటూ తండావాసులు నాయకులపై మండిపడుతున్నారు.
నాయకుల తీరును నిరసిస్తూ గురువారం ఉదయం రోడ్డుపై బురదలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ తండాకు గతంలో గిరిజన సంక్షేమ శాఖ నిధులతో ఆర్ అండ్ బీ రోడ్డు మంజూరైనప్పటికీ పనులు చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ తండాకు రోడ్డు వేయించాలని తండావాసులు కోరుతున్నారు.