యాచారం, జూన్ 8 : కూలీల స్టే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఫార్మా బాధిత రైతులు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మహిళా కూలీలు, రైతులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు ల పేర్లను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని.. ఎన్నికల ముందిచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేయాలని, భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
ఫార్మాకు ఇవ్వని 2,250 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి, వెంటనే ఆన్లైన్లో రైతుల పేర్లను ఎంట్రీ చేయాలన్నారు. అధికారులు స్పందించకపోవడంతో నాగార్జునసాగర్ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న సీఐ మధుకుమార్, ఎస్సైలు మధు, సత్యనారాయణ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని రైతులు భీష్మించుకు కూర్చున్నా రు. రైతుల రాస్తారోకోతో సాగర్ రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తహసీల్దార్ అయ్యప్ప కూడా రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు.
మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కూలీలకు పునరావా సం కల్పించకుండా భూములను స్వాధీనం చేసుకొని ఎలా చదును చేస్తారని మండిపడ్డా రు. ప్లాట్లు ఎప్పుడిస్తారని అడగ్గా ప్లాట్లలో కొందరు బినామీలు, నకిలీలు ఉన్నారని వారిని గుర్తించి అర్హులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ పొలాలకు కరెంట్ కట్ చేయడాన్ని నిరసిస్తూ విద్యు త్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. కోర్టు స్టే ఉన్న వ్యవసాయ పొలాలకు కరెంట్‌ను ఎలా కట్ చేస్తారని విద్యుత్తు ఏఈ శ్రీధర్‌ను ప్రశ్నించారు. కోర్టు స్టే ఉన్న పొలాలకు విద్యుత్తును నిలిపేస్తే సహించేదిలేదని ఏఈని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయ కర్త సరస్వతి మాట్లాడు తూ..కోర్టు స్టే ఉన్న భూముల్లో బలవంతంగా పనులు చేపట్టడం చట్ట వ్యతిరేకమన్నారు. ఫార్మాకు ఇవ్వని భూములను ఆన్లైన్లో టీజీఐఐసీ పేరును తొలగించి రైతుల పేర్లను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్లాట్ల డాక్యుమెంట్లను ఇవ్వాలని.. కూలీల స్టేఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేయొద్దన్నారు. కార్యక్రమంలో నాయకులు అచ్చిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, కుమార్, మహేందర్, శ్రీనాథ్, సందీప్‌రెడ్డి, అనసూయమ్మ, సత్యనారాయణ, రమే శ్, వినోద్‌కుమార్‌రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.