– రేమిడిచర్ల ఉన్నత పాఠశాలలో టీచర్ స్రవంతి బోధన కొనసాగింపునకు ఆదేశాలు
ఎర్రుపాలెం, ఆగస్టు 06 : ‘మా టీచర్ మాకే కావాలి’ అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు గురువారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేసి చేపట్టిన ఆందోళనకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఆందోళన విషయం తెలుసుకున్న ఎంఈఓ మురళీమోహన్రావు పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో జరిగిన పరిణామాలపై చర్చించిన ఎంఈఓ పొరపాటు జరిగిందని అంగీకరించినట్లు ఆందోళనకారులు తెలిపారు. అనంతరం సోషల్ ఉపాధ్యాయురాలు స్రవంతిని తిరిగి రేమిడిచర్ల ఉన్నత పాఠశాలకు పిలిపించి, అక్కడే విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు బోధన కొనసాగించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. స్రవంతి రేమిడిచర్ల పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు బోధిస్తున్నారని, ఆమెను ఇతర పాఠశాలకు కేటాయించడంతో విద్యార్థుల చదువుకు ఇబ్బందులు ఏర్పడతాయని తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్‌పై అధికారులు సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై అంతా హర్షం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించిన ఎంఈఓకు వారు కృతజ్ఞతలు తెలిపారు.