హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా స్వదేశీ సాంకేతికతతో తయారుచేసిన అత్యంత అధునాతన రైలుప్రమాద నివారణ వ్యవస్థ ‘కవచ్ 4.0’ తొలిసారిగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ డివిజన్లోని మలాజిగిరి-కామారెడ్డి రైల్వే సెక్షన్ మధ్య ఉన్న 108 కిలోమీటర్ల మేర ఈ ఆధునిక వ్యవస్థను విజయవంతంగా అమర్చారు.
పాత ‘కవచ్ 3.2’ వెర్షన్తో పోలిస్తే మరిన్ని టెక్నికల్ అప్డేట్స్, అత్యంత వేగంగా స్పందించేలా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ‘కవచ్ 4.0’ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం రైలు ప్రమాదాలను ముందస్తుగానే అరికట్టడం. ఒకవేళ లోకోపైలట్ గమనించక పొరపాటున సిగ్నల్ దాటి ముందుకు వెళ్లినా(ఎస్పీఏడీ) లేదా నిర్ణీత వేగాన్ని మించినా ఈ సిస్టమ్ వెంటనే స్పందిస్తుంది.