హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఘనతే తమదేనంటూ తరచూ ఊదరగొట్టే రాష్ట్ర బీజేపీ నేతలు మరోసారి గొప్పలకు పోయారు. తాజాగా ఎంబీబీఎస్ సీట్ల పెంపు మోదీ ఘనతగా చెప్పుకొన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలో కొత్తగా 1,060 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడంతో 66 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 10,500కి పెరిగిందని.. మోదీ నాయకత్వంలో వైద్య విద్యకు మహర్దశ పట్టిందని కిషన్‌రెడ్డి సెలవిచ్చారు.
156 మెడికల్ కాలేజీల్లో ఒక్కటైనా ఇచ్చారా?
కిషన్‌రెడ్డి ట్వీట్‌పై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ‘రాష్ట్రంలో 36 ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేంద్రం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా?’ అంటూ చురకలంటిస్తున్నారు. ‘మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత కేసీఆర్‌దే, మీరు ఏమైనా నిధులు తెచ్చారా?’ అని కిషన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ‘కేసీఆర్ తెచ్చిన మెడికల్ సీట్లకు మీరు ప్రచారం చేసుకోవడమేంది?’ అంటూ నిలదీస్తున్నారు. ‘కేంద్ర నుంచి ఒక్క రూపాయి తీసుకురాకుండా పీఆర్ స్టంట్లు ఏమిటో?’ అని సెటైర్లు వేస్తున్నారు. ‘దేశవ్యాప్తంగా 156 మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేస్తే.. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చొరవతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో సీట్లు పెరిగాయి’ అని వరుస ట్వీట్లు పెడుతున్నారు.
విభజన హామీలు ఏమయ్యాయి?
ఎంబీబీఎస్ సీట్ల ఘనత తమదేనని చెప్పుకొంటున్న కిషన్‌రెడ్డి.. విభజన హామీల విషయంలో మాత్రం ఏనాడూ నోరు మెదపకపోవడం గమనార్హం. విభజన హామీ మేరకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును విస్మరించిన కేంద్రం.. మరోవైపు రూ.20వేల కోట్లతో గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించడం బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టం చేస్తున్నది. నవోదయ, సైనిక్ స్కూళ్లు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు హామీ తీరని కలగానే మిగిలిపోయాయి. రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటించాల్సి ఉంది. కాగా ఇటీవల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని కేంద్రం రాజ్యసభలో కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి గాను తెలంగాణకు చెల్లించాల్సిన రూ.900 కోట్లను వెంటనే విడుదల చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బీజేపీది సవతి తల్లి ప్రేమ అని నిరూపితమైంది.