మాతృభాషకు పట్టం కట్టింది
తిండి గింజలకోసం రెక్కలు ముక్కలు చేసుకునే కుటుంబమది. చదివిస్తే మాత్రం రాజ్యాలు ఏలేది ఉందా అని ప్రశ్నించే ముఖాలే చుట్టూ! కానీ, చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఆ మహిళ. తండా నుంచి విశ్వవిద్యాలయాల బాట పట్టి తన మాతృభాషపైనే పరిశోధన చేసిన బంజారా బిడ్డ మేగావత్ ప్రమీల విజయగాథ ఇది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించిన ఈ మట్టిబిడ్డ.
తిండి గింజలకోసం రెక్కలు ముక్కలు చేసుకునే కుటుంబమది. చదివిస్తే మాత్రం రాజ్యాలు ఏలేది ఉందా అని ప్రశ్నించే ముఖాలే చుట్టూ! కానీ, చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఆ మహిళ. తండా నుంచి విశ్వవిద్యాలయాల బాట పట్టి తన మాతృభాషపైనే పరిశోధన చేసిన బంజారా బిడ్డ మేగావత్ ప్రమీల విజయగాథ ఇది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించిన ఈ మట్టిబిడ్డ. ‘బంజారా భాషకు తెలుగులో వర్ణనాత్మక వ్యాకరణం’పై పరిశోధన చేసిన తొలి బంజారా మహిళగా రికార్డు సృష్టించింది. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టాను పొందిన ప్రమీల.. జిందగీతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
మా తండాలో ఆడపిల్ల పెరగడమే ఆలస్యం పెండ్లిచేసి ఓ అయ్య చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకుంటారు. నా కుటుంబం అందుకు మినహాయింపేం కాదు. మా అక్కలకూ అలానే జరిగింది. మాది నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని ధన్సింగ్ తండా. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్న. అమ్మానాన్నలిద్దరూ ఉన్న ఎకరం పొలంలో ఒకవైపు వ్యవసాయం చేస్తూ మరోవైపు కూలీపనులకు పోయి మమ్మల్ని పోషించారు. ముగ్గురక్కలూ చిన్నప్పటినుంచే కూలీపనులకు వెళ్లేది. మా మేనమామ పశువైద్యుడు కావడంతో చదువు విలువ మాకు చెబుతుండేవాడు. ఇంట్లో కనీసం ఒక్కరైనా చదువుకోవాలని చెప్పేవాడు.
అలా మా అన్న బడి బాటపట్టిండు, ఆయనను చూసి నేనూ బడికి వెళ్లాను. ఒకవైపు బడికి వెళ్తూనే సెలవు రోజుల్లో పొలం పనులకు పొయ్యేది. అన్న పదో తరగతి పూర్తి చేసి పై చదువుల కోసమని మిర్యాలగూడకు వెళ్లాడు. నేను ఎనిమిదో తరగతి వరకు ఊర్లో చదువుకొని పదో తరగతి వరకు మిర్యాలగూడలోని వసతిగృహంలో ఉంటూ చదువుకున్నాను. ఆ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియట్లో 84 శాతం మార్కులు తెచ్చుకున్నాను. ఆ మార్కులతో హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీలో ప్రవేశం దొరికింది. అందులోనే హాస్టల్ సౌకర్యం కూడా ఉండటంతో డబ్బు సమస్య నుంచి కాస్త ఉపశమనం దొరికింది. దాంతో పాటు డిగ్రీలో మూడేండ్లపాటు ఏడాదికి పదివేల చొప్పున మెరిట్ స్కాలర్షిప్ విడుదలయ్యేది. ఆ డబ్బుతో నా ఖర్చులు ఎల్లదీసుకునేదాన్ని.

పీహెచ్‌డీలో ప్రవేశం
డిగ్రీ చేస్తున్న సమయంలోనే ప్రభుత్వ కొలువు సాధించాలని గట్టిగా అనుకున్నాను. ఆ కసితోనే నిరంతరం చదవడం ప్రారంభించాను. పీజీ ఎంట్రన్స్ టెస్ట్‌లో మంచి ర్యాంక్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలనుకున్న నా కలను సాకారం చేసుకున్నాను. ఎంఏ తెలుగులో ప్రవేశం పొందాను. క్యాంపస్‌లో మా సీనియర్లంతా నెట్, సెట్ అంటూ మాట్లాడుకుంటుంటే ఆ పదాలు కొత్తగా అనిపించేవి. వాళ్లను అడిగి తెలుసుకొని యూజీసీ నెట్, టీజీసెట్‌కు ప్రిపేరయ్యాను. అలా 2017లో యూజీసీ నెట్, జేఆర్ఎఫ్లో అర్హత సాధించడంతో పాటు సెట్లోనూ క్వాలిఫై అయ్యాను. జేఆర్ఎఫ్లో అర్హత సాధించిన తొలి బంజారా అమ్మాయిగా నేను నిలవడం విశేషం.
ఆ ఆనందంతో ఊరికి వెళ్తే చదువెందుకు అని ఒకప్పుడు అన్నవాళ్లే నాకు శుభాకాంక్షలు చెప్పారు. మరికొంతమంది సన్మానాలు చేశారు. ఆ సమయంలో మా ఊరికే చెందిన ముని నాయక్, తన కుటుంబంతో మా ఇంటికొచ్చి కట్నం లేకుండా నన్ను పెండ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అనుకున్నట్టుగానే నన్ను వివాహం చేసుకున్నాడు. ఓయూలోనే పీహెచ్డీ అడ్మిషన్ వేశాను. ఫెలోషిప్ రావడంతో కాస్త ఆర్థిక భరోసా దొరికినట్టయింది. పరిశోధన ఏ అంశంపై చేయాలన్న విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాను. నాకు తెలుగు వ్యాకరణమంటే చాలా ఇష్టం. తెలుగులాగా బంజార భాషకు వ్యాకరణం ఉంటే బాగుంటదని భావించి మా గైడ్‌కు నా ఆలోచన చెప్పాను. ఆవిడ సపోర్ట్ చేయడంతో ‘బంజారా భాషకు తెలుగులో వర్ణనాత్మక వ్యాకరణం’పై పరిశోధన మొదలు పెట్టాను.

మార్పులు పరిశోధించాను
ఇదివరకు బంజార భాషపై ఇతర కోణాల్లో పరిశోధనలు చేసిన వారున్నారు కానీ, వ్యాకరణంపై పరిశోధన చేసింది నేను మాత్రమే. ఇందుకోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని బంజారాలను కలిశాను. నాతో చదువుకున్న మిత్రుల భాషను, తండాల్లో జనాలు మాట్లాడుకునే తీరును గమనించాను. ఈ పరిశోధనలో చాలా విషయాలను కనుగొన్నాను. అందరూ మాట్లాడేది బంజారా భాషే అయినా జిల్లాను బట్టి కొన్ని పదాల్లో వ్యత్యాసం కనిపించింది. వాఖ్య నిర్మాణంలోనూ తేడా స్పష్టంగా కనిపించింది. నల్లగొండలో ఒకలా, వరంగల్‌లో మరోలా మాట్లాడతారు.
ఈ ప్రయాణంలో మా ఆయన నాతోపాటు ప్రతి జిల్లాకు వచ్చాడు. నేను గర్భం దాల్చడంతో ఒకవైపు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు పరిశోధన కొనసాగించాను. పిల్లలు పుట్టాక తల్లిగా వాళ్లను చూసుకుంటూనే అర్ధరాత్రి వరకు చదువుకునేదాన్ని. కరోనా కారణంగా పరిశోధన పత్ర సమర్పణకు రెండేండ్ల గడువు పొడిగించారు. ఏడాదిలో నా పరిశోధనను పూర్తిచేశాను. ఇటీవలే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టా అందుకున్నాను.
ఇంకా అయిపోలేదు
ఓ మారుమూల తండా నుంచి ఈ స్థాయిలో నిలిచానంటే అందుకు ప్రధాన కారణం నా కుటుంబ పరిస్థితులే. ఆ పరిస్థితులే నాలో చదవాలనే కసిని పెంచాయి. ఈ ప్రయాణంలో నేను సక్సెస్ అయ్యానంటే అందుకు ప్రధానంగా మా మేనమామ, మా అన్నతోపాటు మా ఆయనే కారణం. వాళ్ల ప్రోత్సాహమే లేకుంటే నేను వంటింటికే పరిమితమయ్యేదాన్ని. నేను పరిశోధన చేస్తున్న సమయంలో తెలిసిన కొంతమంది మిత్రులు ఇదేం భాష, దీనికి వ్యాకరణం ఎందుకని ఎగతాళి చేశారు. పీహెచ్డీ పట్టాతో నా భాషకు పట్టం కట్టాను. తండాలో పుట్టిన ప్రతి ఆడబిడ్డా ఉన్నత చదవులు చదివేందుకు నా ప్రయాణం ఒక ఉదాహరణ కావాలి. నా సక్సెస్ ఇంకా అయిపోలేదు. ప్రొఫెసర్‌గా విశ్యవిద్యాలయాల్లో పాఠాలు బోధించాలన్నది నా కల. నాలాంటి తండా బిడ్డలకు నేను స్ఫూర్తిగా నిలిచేలా నిరంతరం పరిశ్రమిస్తాను.
– రాజు పిల్లనగోయిన

Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

