ఏసీబీపై అవినీతి మరక!
అవినీతిని అంతమొందించాల్సిన సంస్థలోనే అవినీతి రాజ్యమేలుతున్నదా? ఏండ్ల తరబడి ఒకేచోట అధికారులు ఉండటంతో అవినీతికి ఆస్కారం ఏర్పడుతున్నదా? బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేసిన వెంటనే, కొందరు అధికారులు ఏకంగా నిందితులతోనే బేరసారాలు సాగిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
- విశ్వసనీయత కోల్పోతున్న ఏసీబీ
- నిజాయితీపరులు కొందరే.. అవినీతిపరులెందరో!
- ఏసీబీకి కాల్ చేస్తే సెటిల్మెంట్లకు దిగుతున్న అధికారులు
- రైడ్స్ కాకుండా ముందస్తుగా సమాచారం చేరవేత
- కొన్నేండ్ల తరబడి ఒకేచోట విచారణాధికారులు, సిబ్బంది!
- తప్పుడు కేసులకు బలవుతున్న పలువురు అధికారులు
- ఏసీబీపై ఏడీఈ అంబేద్కర్ ఫిర్యాదుతో కలకలం
- నిష్పక్షపాతంగా ఉంటామని చెప్తున్న ఏసీబీ డీజీ
- ఏసీబీలో అవినీతిపై ‘స్పెషల్ సిట్’ వేయాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): అవినీతిని అంతమొందించాల్సిన సంస్థలోనే అవినీతి రాజ్యమేలుతున్నదా? ఏండ్ల తరబడి ఒకేచోట అధికారులు ఉండటంతో అవినీతికి ఆస్కారం ఏర్పడుతున్నదా? బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేసిన వెంటనే, కొందరు అధికారులు ఏకంగా నిందితులతోనే బేరసారాలు సాగిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాల్సిన ఏసీబీ.. ఇప్పుడు తన సొంత అధికారులపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. అవినీతి కేసుల్లో నిష్పక్షపాతంగా ఉండాల్సిన చోటనే అవినీతి చోటుచేసుకుంటే బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలి? అక్రమాలను అరికట్టాల్సిన సంస్థే ఆరోపణల బోనులో నిలబడితే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఎలా కలుగుతుంది? అంటూ విద్యుత్తు శాఖ మాజీ ఏడీఈ అంబేదర్ చేసిన ఆరోపణలు ఈ ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చాయి.
రైడ్స్‌కు ముందే సమాచారం చేరుతున్నదా?
సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులు అందినప్పుడు ఏసీబీ అధికారులు పకడ్బందీగా ట్రాప్ చేసి, నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఫిర్యాదుదారుడి వాంగ్మూలం, ప్రాథమిక ఆధారాలు, నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ట్రాప్ చర్యలకు ముందే సమాచారం లీక్ అవుతున్నదని, ఫిర్యాదులు అందుకున్న అధికారులు నిందితులతో సెటిల్మెంట్లకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరుగకపోగా, అవినీతిపరులతో కుమ్మకై వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. కొందరు అధికారులను ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారనే ఆరోపణలు ఆ శాఖ పనితీరుపై మరింత అనుమానాలకు తావిస్తున్నాయి. ఏసీబీలో నిజాయితీగా పనిచేసే అధికారులు కొందరు ఉన్నా.. దొంగలకు సద్దిమోస్తూ అవినీతికి పాల్పడుతున్నవారు ఎకువగా ఉన్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే అది సంస్థకే ప్రమాదకరం.
ఏండ్ల తరబడి ఒకేచోట?
ఏసీబీలో పనిచేసే కొందరు విచారణాధికారులు ఏండ్ల తరబడి ఒకే ప్రాంతం, ఒకే పరిధిలో కొనసాగుతున్నారు. దీంతో స్థానిక అధికారులతో పరిచయాలు, సంబంధాలు ఏర్పడి, విచారణలపై ప్రభావం పడే అవకాశం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఫినాల్ఫతెలేన్ (కెమికల్ టెస్ట్)లో పట్టుబడిన ఓ అధికారిని తప్పించి, మరొకరిని ఆ స్థానంలో కూర్చోబెట్టారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అందుకే అవినీతి నిరోధక శాఖలో పారదర్శకతను పెంచాలంటే విచారణాధికారుల బదిలీలు, కేసుల కేటాయింపులు, దర్యాప్తు పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన కేసుల్లో అధికారుల పాత్రను నిరంతరం సమీక్షించాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఒకే అధికారి చేతిలో కేసు మొత్తం ఉండకుండా, స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏండ్ల తరబడి ఏసీబీలో పనిచేస్తున్న అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఎక్కువగానే ఉన్నారని సమాచారం.
బాధితుడి ఫిర్యాదే ఒక సంచలనం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారిపైనే విద్యుత్తు శాఖ మాజీ ఏడీఈ అంబేదర్ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఏసీబీ అధికారుల అవినీతిపై తాను కేవలం ఆరోపణలు చేయడం లేదని, అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించానని ఆయన చెప్తున్నారు. అన్యాయంగా తనపై ఒక కేసును బనాయించి, దానిని మాఫీ చేయడానికి తనను లంచం డిమాండ్ చేస్తున్నట్టుగా ఉన్న ఆడియో రికార్డింగులను స్పష్టంగా చూపించానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 17న విచారణకు రావాలని చెప్పి.. 19వ తేదీన సమాచారం ఇచ్చారని, ఈ విషయంలో ప్రశ్నించినా ఇప్పటివరకు సరైన సమాధానం ఇవ్వలేదని అంబేదర్ ఆరోపిస్తున్నారు. తన ఫిర్యాదుపై ముందుగా సంబంధిత అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏసీబీ తన అధికారులను కాపాడుకునేందుకే కేసు నమోదు చేయకుండా శాఖాపరమైన విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు.
అవినీతికి చోటు లేదు: డీజీ చారుసిన్హా
తమ శాఖలోని అధికారులపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలంగాణ ఏసీబీ ప్రకటించింది. ఏసీబీలో అవినీతి విషయంలో జీరో టాలరెన్స్ విధానం అమల్లో ఉన్నదని, చట్టానికి ఎవరూ అతీతులు కారని ఏసీబీ డీజీ చారుసిన్హా స్పష్టం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఏసీబీ నమోదుచేసిన కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిపై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా శాఖాపరమైన విచారణలో పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఫిర్యాదుదారుడిని ఇప్పటికే మూడుసార్లు విచారణకు పిలిచినా.. ఒకసారి కూడా హాజరుకాలేదని పేరొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఏసీబీ వేచి చూస్తున్నదని, ఆరోపణలు నిరూపితమైతే సంబంధిత అధికారిని ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టాన్ని అమలు చేసే సంస్థగా తమ అధికారులు మరింత ఉన్నత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని పేరొన్నారు. ఏసీబీ అధికారుల అక్రమాలపై సమాచారం ఉన్న పౌరులు తమకు ఫిర్యాదు చేయవచ్చని, అటువంటి ఫిర్యాదులను గోప్యతతో, తీవ్రంగా పరిశీలిస్తామని తెలిపారు.
ఏసీబీలో అవినీతిపై స్పెషల్ సిట్ వేయగలరా?
ఏసీబీ అధికారిపై వచ్చిన ఆరోపణలను శాఖాపరమైన విచారణ ద్వారా పరిశీలిస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే, ఆరోపణల్లో క్రిమినల్ నేరానికి సంబంధించిన అంశాలు ఉంటే వాటిని కేవలం శాఖా విచారణకే పరిమితం చేయాలా? లేక చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిర్యాదులో పేరొన్న అంశాలు, సమర్పించిన ఆధారాలు, ఆరోపణల స్వభావాన్ని బట్టి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాఖాపరమైన విచారణతోపాటు అవసరమైతే స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి. ఆరోపణలు ఎదురొంటున్న అధికారి పనిచేస్తున్న అదే వ్యవస్థ విచారణ జరిపితే.. దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతుందా? అనే సందేహాలు సహజంగానే వ్యక్తమవుతాయి.
ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థలో మునుపెన్నడూలేనంతగా వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సిట్ ఏర్పాటు చేయగలదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏసీబీని ప్రజలు నమ్మాలంటే కచ్చితంగా ఒక సిట్ ఏర్పాటు చేసి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అరెస్టయిన, ట్రాప్ కేసుల్లో అరెస్టయిన అధికారులను విచారించడంతోపాటు.. ఏసీబీకి వస్తున్న ఫిర్యాదులు, వాటిల్లో చర్యలు తీసుకున్న కేసులు ఎన్ని? మిగిలిన ఫిర్యాదులు ఎన్ని? వాటిల్లో ఉన్నతాధికారులు ఎవరు? వారి పాత్ర ఏంది? అనే విషయాలు సిట్ ద్వారా తేల్చాలనే డిమాండ్ వినిపిస్తున్నది. హోం శాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అవినీతిపై పోరాటం చేసే సంస్థకు ప్రజల విశ్వాసమే ప్రధాన బలం. ఆ విశ్వాసం దెబ్బతింటే.. ఎంతటి దాడులు నిర్వహించినా, ఎన్ని కేసులు నమోదు చేసినా సంస్థ ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టుకోవడం కష్టమే. అందుకే ఏసీబీ తన సొంత వ్యవస్థలోని లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

