– విద్యార్థులు మై భారత్ పోర్టల్, నషా ముక్తే యువ వికసిత్ భారత్, రెడ్‌క్రాస్ సంస్థల్లో పేర్లు నమోదు చేసుకోవాలి
– ఎంజీయూ పరిదిలో ప్రతి కళాశాలలో ఎస్ఆర్ఎస్ అమలు చేయాల్సిందే
– ఉమ్మడి జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సమావేశంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, ఆగస్టు 06 : సమాజానికి ఉత్తమ మానవ వనరులను అందించేవి విద్య సంస్థలే, అయితే ఆ దిశగా విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంజీయూ, అనుబందంగా ఉన్న అన్ని కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించి భావి భారత పౌరులను తయారు చేయాల్సిన కర్తవ్యం అందరిపై ఉందని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలో ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం వర్సిటీ అనుబందంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పీజీ, యూజీ, బీఈడీ, బీపీఈడీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంబీఏ, లా ఇతర కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ‘మై- భారత్ పోర్టల్, ‘నషా ముక్తే యువ వికసిత్ భారత్’, ‘రెడ్ క్రాస్ సోసైటీ’లో విద్యార్థుల నమోదుపై అవగాహన, ఎంజీయూ పరిధిలో అధ్యాపకులు, విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరం నుండి అమలు చేసే ఎస్ఆర్ఎస్ హాజరుపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాఫ్ శుక్లా ఆదేశాల మేరకు అన్ని కళాశాలలో విధిగా ఆయా పోర్టల్స్ అందరు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునేలా చూడాలని కోరారు. సామాజిక సేవకు ఇలాంటి వేదికలు దోహదం చేస్తాయని, విద్యతో పాటు సేవ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవసరమని తెలిపారు.
ప్రభుత్వం సూచించిన జీవో ప్రకారం ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ఖచ్చితంగా అధ్యాపకులు, విద్యార్థులకు ఎస్ఆర్ఎస్ హాజరు నమోదు చేయాల్సిందేన్నారు. మిగిలిన యూనివర్సిటీలతో తమ యూనివర్సిటీకి సంబందం లేదని, విద్యార్థులు కళాశాలలకు వచ్చి నిత్యం తరగతులు వినేలా చూడాల్సిన కర్తవ్యం అధ్యాపకులపై ఉందన్నారు. దీంతో విద్యార్థులు మాదక ద్రవ్యాలతో పాటు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండటంతో పాటు మంచి మార్గంలో నడుస్తారని, పరీక్షల్లో సహితం ఉత్తమ ఫలితాలు సాదించి జీవిత లక్ష్యం చేరుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు అర్హుత సాధిస్తారని ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదన్నారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.వై. ప్రశాంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ డా.జయంతి, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమన్యాలు డా.రహắఖానం, డా.పవిత్రా కర్ష, డా.పావని, డా.పాలేబోయిన గంగాదర్రావు, డా.రజిని, డా.ఎండీ.జబ్బర్, తాటి శ్రీనివాస్, దొడ్డ ఏలియా, డా.సిద్ధిఖీ, డా, ప్రవీన్‌కుమార్, జె.పుష్పాంజలి, డా.కాకతీయ నరసింహ్మరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, డా.మమ్మద్ రఫీ, చిన్నశంకర్ పాల్గొన్నారు.