Kajal Aggarwal | నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ల ప్రభావం మనుషుల మధ్య బంధాలపై కూడా పడుతోందని నటి కాజల్ అగర్వాల్ అభిప్రాయపడింది. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు కూడా తగినంత సమయం కేటాయించకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆమె పేర్కొంది. కలిసి బయటకు వెళ్లిన సమయంలోనూ ఫోన్లలో మునిగిపోవడం వల్ల బంధాల్లో కమ్యూనికేషన్ తగ్గిపోతోందని చెప్పింది. కాజల్ అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఈ సందర్భంగా పంచుకుంది. తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ప్రతి వారం కనీసం ఒకరోజు డిన్నర్‌కు బయటకు వెళ్తామని ఆమె తెలిపింది. ఆ సమయంలో ఇద్దరం ఫోన్లను పక్కన పెట్టి కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, కలిసి సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది.
ప్రస్తుతం చాలా మంది జంటలు కలిసి ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం కేటాయించడం లేదని కాజల్ పేర్కొంది. డిన్నర్ డేట్‌కు వెళ్లినా చేతిలో ఫోన్ పట్టుకుని సోషల్ మీడియా చూస్తూ ఉండటం వల్ల పక్కనే ఉన్న వ్యక్తితోనే దూరం పెరుగుతోందని ఆమె అభిప్రాయపడింది. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం కొనసాగాలంటే ఒకరి అభిప్రాయాలను మరొకరు వినడం, మాట్లాడుకోవడం చాలా ముఖ్యమని కాజల్ సూచించింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ భాగస్వామితో కొంత సమయం గడపడం, తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడం అవసరమని చెప్పింది. తన వివాహ బంధంలో తాము పాటిస్తున్న ఈ విధానం గురించి చెబుతూ.. వారానికి ఒకరోజు ఫోన్లకు దూరంగా కలిసి సమయం గడపడం తమకు ఉపయోగపడుతోందని కాజల్ వెల్లడించింది. డిజిటల్ ప్రపంచంలో నిరంతరం గడపడం కంటే నిజ జీవితంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మాట్లాడటం, వారి మాటలు వినడం ముఖ్యమనే సందేశాన్ని ఆమె ఇచ్చింది.
కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో పాటు సాధారణ కుటుంబాల్లోనూ స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆమె చెప్పిన మాటలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.ఇదిలా ఉంటే.. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన ‘ది ఇండియా స్టోరీ’ చిత్రం ఇటీవల ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో కాజల్ న్యాయవాది పాత్రలో కనిపించింది. ఆహార కల్తీ, వ్యవసాయంలో పురుగుమందుల వినియోగం వంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది.