టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చటంపై చర్చ ఇంకా కొనసాగుతుండటం ఆసక్తికరమైన విషయం. చర్చ సందర్భంగా వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రశ్నలూ ముందుకొస్తున్నాయి. కానీ వాటన్నింటిని కలిపిన సమగ్రమైన విచారణ ఏదీ జరగటంలేదు. ఇది తెలంగాణవాదుల మేధోమథనంలో ఒక కొరతగా మిగులుతున్నది. కనుక, ఈ విషయమై ఒక అవగాహన కోసం ప్రయత్నించవలసిన అవసరం ఉన్నది. అందువల్ల ఇప్పుడు కొత్తగా జరిగేది ఏమున్నా లేకున్నా, చారిత్రక పరిణామాల క్రమంలో అది ఒక గమనించదగ్గ విషయమైనందున అవగాహన కోసం ప్రయత్నించాలి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల నేపథ్యంలో 1969లో తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ఏర్పడింది. తర్వాత, మలిదశ ఉద్యమం పుంజుకుంటుండగా 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని స్థాపించారు. ఆ ఉద్యమం సఫలమై 2014లో స్వరాష్ట్రం సిద్ధించింది. గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, వివిధ రంగాల్లో అనేక సత్ఫలితాలు సాధించింది. ఆ సాధించిన ఫలితాలకు స్వరాష్ట్రంలోనే గాక జాతీయ, అంతర్జాతీయస్థాయిలలో మంచి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర విభజన కారణంగా కేసీఆర్ను తీవ్రంగా విమర్శించిన ఆంధ్రప్రదేశ్లోనూ తనకు రెండు విధాలైన ప్రశంసలు లభించాయి. ఒకటి, సీమాంధ్రులు అనుమానించినట్టుగా వారికి ఎటువంటి హాని కలుగకపోవటమే గాక, పూర్తి భద్రత, మైత్రీ సంబంధాలు కొనసాగటం. రెండు, తెలంగాణలో అమలవుతుండిన అభివృద్ధి, సంక్షేమాలు వారిని మెప్పించటం.
ఆ పరిస్థితుల మధ్య 2018లో జరిగిన రెండవ ఎన్నికలలో కేసీఆర్ పార్టీకి 2014 కన్నా ఎక్కువ మెజారిటీ లభించింది. మరొకవైపు వేర్వేరు రాష్ర్టాల్లో అస్థిరతలు కనిపించాయి. అభివృద్ధి, సంక్షేమాలు పలుచోట్ల కుంటుపడసాగాయి. కేంద్రంలో అనేక వాగ్దానాలతో అధికారానికి వచ్చిన మోదీ ప్రభుత్వం పట్ల నెమ్మదిగా అసంతృప్తి మొదలైంది. 2022 మధ్య కాలానికి ఈ మూడు విధాలైన నేపథ్య పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఒకటి, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాల పట్ల ప్రశంస. రెండు, పలు రాష్ర్టాలలో అస్థిరతలతోపాటు అభివృద్ధి, సంక్షేమాలు సక్రమంగా సాగకపోవటం. మూడు, 2014 నుంచి ఎనిమిదేండ్ల పాలన తర్వాత కేంద్రంలోని మోదీ పరిపాలన పట్ల మొదలైన అసంతృప్తి. ఈ మూడింటికి అదనంగా, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని సృష్టించవలసిన ప్రతిపక్షాలు అందులో వరుసగా విఫలమవుతుండటం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నానాటికీ క్షీణిస్తుండటం. ప్రజల అంసతృప్తికి అది మరొక కారణం కావటం.
అనగా, అన్ని వైపులా ఒక విధమైన శూన్యస్థితి ఏర్పడుతుండటమన్నమాట. అదే కాలంలో ప్రపంచ పరిణామాలను గమనిస్తే, మిగిలిన ఖండాలను అట్లుంచి ఆసియాలో ఇండియా కన్న ఎంతో చిన్న దేశాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుండగా, భారతదేశపు అభివృద్ధి ర్యాంకులు దాదాపు అన్నీ క్రమంగా పడిపోవటం కొనసాగింది. ఎకానమీ సైజు పెరుగుతున్నా అభివృద్ధి సూచీల పతనంతో, ఇతరులతో పోల్చినప్పుడు ర్యాంకులు తగ్గుతుండటంతో ఎకానమీ సైజు అర్థంలేనిదయింది. అందుకు తోడు ధనిక-పేద తారతమ్యాలు వేగంగా పెరగసాగాయి.
ఇక్కడ గమనించవలసిందేమంటే, దేశంలో వనరులకు ఎంతమాత్రం కొరతలేదు. దేశ వైశాల్యం, సాగుకుయోగ్యమైన భూములు, వర్షపాతం, సానుకూలమైన వాతావరణాలు, నదులు, ఖనిజ సంపద, అడవుల విస్తీర్ణం, సుదీర్ఘమైన సముద్రతీరం, జనసంఖ్య, అందులో పలు విధాలైన నైపుణ్యాలు గలవారు, ఆ కారణంగానే ధనిక దేశాల్లో ఉన్నత స్థానాల్లో వెలుగొందుతున్న భారతీయులు ఇట్లా దేనికీ కొరతలేనిది భారతదేశం.
ఈ మొత్తం పరిస్థితులన్నింటిని దృష్టిలోకి తీసుకొని ఈ దేశం వెనుకబాటుతనం గురించి ఆలోచించే వారికి అనిపించేదేమిటి? కనిపించే ఒకే ఒక కొరత ఏమిటి? సరైన నాయకత్వపు కొరత. అవసరమైన దార్శనికతలు, విధానాలు, ప్రణాళికలు, వాటిని పట్టుదలగా, నిజాయితీగా అమలు పరిచే ధోరణి ఉన్నట్టయితే భారతదేశం అభివృద్ధి, సంక్షేమాలతోపాటు అన్ని విధాలుగా అగ్రస్థాయి దేశాలలో ఒకటిగా నిలిచి ఉండేది. సరిగా ఆ లక్షణాలు కొరవడటం వల్లనే ఉద్యమించి స్వాతంత్య్రం సాధించుకొని 75 ఏండ్లు గచిచిన తర్వాత కూడా, వేర్వేరు దశలలో అన్ని పార్టీలూ పరిపాలించిన మీదట కూడా, దేశం ఈ దుస్థితిలో ఉన్నది. సావధానంగా ఆలోచించే ఎవరికైనా ఎదురయ్యే బాధాకరమైన ప్రశ్న ఇది. ఇప్పుడున్న రాజకీయ పార్టీలను చూడగా, కనుచూపు మేరలో అవేవీ కూడా దేశాన్ని సరైన విధంగా చక్కదిద్దగల ఆశలు కనిపించటంలేదు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలన్న ఆలోచన కేసీఆర్కు కలగటం వెనుక ఈ వివిధ పరిస్థితులన్నీ ఉన్నాయనుకోవాలి. ఆ విధంగా, టీఆర్ఎస్ ఏర్పడిన (2001) 21 ఏండ్లకు (2022) ఆయన తన దృష్టిని మొత్తం దేశం వైపు మళ్లించినట్టు భావించాలి. అప్పటి నుంచి ఏడాది కాలం అంతా సజావుగా, అందుకు అనుగుణంగానే సాగింది. సమస్య ఆ మరుసటి సంవత్సరం (2023) ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోవటంతో మొదలైంది. కాలంలో వెనుకకు వెళ్లి అక్కడ నిలబడి ఆలోచించవలసిన విషయాలు కొన్నున్నా యి. వాటిలో అన్నింటి కన్నా ముఖ్యమైనవి రెం డు. తెలంగాణ కోసమంటూ ఏర్పడిన పార్టీని జా తీయ పార్టీగా మార్చటం సరైనదా కాదా అనేది ఒకటి. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చ టం వల్ల ఈ నేలతో పేగుబంధం తెగిపోయింద ని, అందువల్లనే పార్టీ ఓడిపోయిందనేది రెండు.
ఇక్కడొక సందేహం. భారతదేశానికి చెందిన ఒక నాయకుడు, తను మౌలికంగా ఒక ప్రాంతానికి చెందిన వాడైనప్పటికీ, పైన వివరించుకున్న తీరుగా దేశ పరిస్థితులు ఉన్నప్పుడు, దేశం గురించి ఆలోచించటం గాని, ఆ పరిస్థితులు మారేందుకు ప్రయత్నించాలనుకోవటం గాని, బాధ్యతాయుతమైన ఆలోచన అవుతుందా, కాదా? సరైన ఆదర్శమా, కాదా? ఇది ప్రాథమిక ప్రశ్న. అవే పరిస్థితుల మధ్య, అప్పటికి కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో కేసీఆర్ పాలనను గమనిస్తుండిన కొన్ని ఇతర రాష్ర్టాల నాయకులతోపాటు సామాన్య ప్రజలు, కొందరు జాతీయ స్థాయి ప్రముఖులు స్వయంగా ముందుకు వచ్చి ఆహ్వానిస్తుండినప్పుడు, ఆ దిశలో కేసీఆర్ ఆలోచించటం సరైనదా, కాదా? అన్నది మరొక ప్రాథమిక ప్రశ్న.
ఒక ప్రాంతపు నాయకుడు ఎట్టి పరిస్థితులలోనూ ఆ ప్రాంతానికే పరిమితమై ఉండాలా, లేక తన విస్తృత ఆలోచనల ప్రకారం విస్తృత బాధ్యతలు కూడా నిర్వర్తించబూనవచ్చునా? అన్నది మూడవ ప్రాథమిక ప్రశ్న. తను ఆ లక్ష్యాలను సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. కానీ అసలు ఆ దిశగా ఆలోచించటం సరైనదా, కాదా? ఈ ప్రాథమిక ప్రశ్నలపై ఎవరి అభిప్రాయాలకు వారు రావచ్చు. వాటిని ఇక్కడ చర్చించటంలేదు. ఎవరి చర్చలను వారికి వదిలివేసి, గుర్తుచేసుకోవలసింది ఒకటున్నది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణలో, మహారాష్ట్రలో కొన్ని ప్రసంగాలు చేశారు. వాటిలో ఆద్యంతం కనిపించింది దేశ వర్తమాన పరిస్థితుల గురించి, భవిష్యత్తు గురించి ఆయన చెందుతుండిన ఆందోళన, చూపిన దార్శనికత.
దేశ వనరుల స్వయం సమృద్ధత, దేశ సర్వతోముఖాభివృద్ధికి గల అవకాశాల గురించి కానీ అవి ఇంతకాలం వినియోగానికి రాలేకపోవటం గురించి, గణాంకాలతోపాటు తను చేసిన ప్రసంగాలు సామాన్య గ్రామీణుల నుంచి, యువత నుంచి ప్రముఖుల వరకు అందరినీ ఆలోచింపజేశాయి. నెహ్రూ తరం తర్వాత ఇంత వరకు ఎవరూ ఆ విధమైన దార్శనికతతో సామాన్యులను ఉద్దేశించి ప్రసంగించినట్టు గుర్తుకురావటంలేదు. తమతమ రాష్ర్టాల గురించి మాట్లాడి ఉండవచ్చు. కానీ మొత్తం దేశం గురించి?
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో పరిస్థితి మారిపోయింది. గెలిచి ఉంటే జాతీయ ప్రణాళిక యోచన ముందుకు సాగి ఉండేది. ఏ విధంగా సాగి ఏ లక్ష్యాలు సాధించేదీ చెప్పలేము. కానీ తన లక్ష్యాల వైపు ప్రయాణం చేసి ఉండేదని మాత్రం చెప్పగలం. చరిత్ర ఒక్కోసారి అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. 2023 ఎన్నికల తర్వాత దేశం ఇప్పటికి మరొక రెండున్నర సంవత్సరాలను చూసింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రం కూడా. ఈ కాలంలో ఇక్కడ గాని, దేశస్థాయిలో గానీ జరిగిందేమిటో, జరగనిదేమిటో కనిపిస్తున్నదే. కేవలం రెండు వారాల్లో రెండున్నర కోట్లకు చేరిన కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్ల సంఖ్య ఇందుకొక వళ్లుగగుర్పొడిచే దృష్టాంతం మాత్రమే. దేశం ఒక సరైన ప్రత్యామ్నాయాన్ని కోరుకోవటం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నది. 2022లో బీఆర్ఎ స్ ప్రకటన తర్వాత ఎంత పెరిగి ఉంటుందన్న సర్వేలు, లెక్కలైతే మన వద్దలేవు గాని, పెరిగి ఉంటుందన్నది కామన్సెన్స్కు కనిపిస్తున్న స్థితి.
చివరగా మాట్లాడుకోవలసినవి రెండున్నాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చితే ఆ పార్టీకి తెలంగాణతో పేగుబంధం తెగిందా? 2023లో ఓటమికి అట్లా పేరు మార్పు కారణమైందా? బహుశా రెండు మాటలు చెప్పుకొంటే ఇందుకు సమాధానాలు లభిస్తాయి. ఒకటి, ఈ రెండు మాటలు అంటున్న వారు నగరాల్లో నివసిస్తూ, బాగా చదువుకొని, సుఖంగా జీవిస్తూ, బుద్ధిజీవుల వలె ఆలోచిస్తూ, క్షేత్రస్థాయితో సంబంధంలేని భద్రలోక్ జనులు. వారితోపాటు ప్రతిపక్షాలు, బుద్ధిపూర్వక విమర్శకులు, వీరందరి ప్రభావానికి లోనయ్యే మీడియా. ఈ అందరిలో ఎవరికీ గ్రామీణులు గాని, పట్టణాల్లోని సామాన్యులు గాని పై రెండు ప్రశ్నల గురించి ఆలోచిస్తున్నదేమిటో తెలియదు. అసలు ఆ తరగతుల దృష్టిలో ఇదొక ప్రశ్నేనా అన్నది కూడా తెలియదు. కృత్రిమ ప్రపంచంలో నివసిస్తూ కృత్రిమ ఊహాగానాలు చేస్తుంటారు.
మరొకటి, ఒకవేళ పార్టీ పేరు మారకపోతే అప్పుడు పేగు బంధం తెగదు గనుక బీఆర్ఎస్ 2023లో గెలిచేదా? అప్పుడు ప్రజలు గాని, ఈ విమర్శకులు గాని, ఆ పార్టీకి ఓటు వేసే వారా? పై తరహా ఊహాజనిత సూత్రీకరణలు మనకు గ్రామాలలో గాని, పట్టణ ప్రాంతపు సామాన్యుల నుంచి గాని వినిపించవు. 2023లో హైదరాబాద్ వాసులు, గ్రామీణులు తమ తమ పద్ధతుల్లో ఓటు చేయటానికి ఎవరి జీవిత సంబంధమైన ఆలోచనలు వారికున్నాయి. వారందరికీ, పార్టీ పేరు ఏదైనా, ఎట్లా మారినా మారకున్నా, కనిపించేది కేసీఆర్ మాత్రమే. అది సత్యం, మిగిలినదంతా మిథ్య. ఆయన నాయకత్వాన జరిగేదేమిటి, జరగనిది ఏమిటన్నది వారి లెక్కలోకి వస్తుంది. కానట్టయితే, అదే బీఆర్ఎస్ పేరిట హైదరాబాద్నంతా ఎట్లా వశపరుచుకోగలిగేవారు. ఇప్పుడు రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత, తిరిగి కేసీఆర్ వైపు, ఆయనకు చెందిన అదే బీఆర్ఎస్ వైపు గ్రామీణులు మరొకమారు చూస్తున్నట్టు ఎందుకు వింటున్నాము? కనుక, మిథ్యావాదాలకు నిజమైన విలువ ఎప్పుడూ ఉండదు.
– టంకశాల అశోక్