జీవితంలో వైఫల్యాలు అందరికీ ఉంటాయి. పెద్దదో, చిన్నదో అవి ఎదుర్కొంటారు. కానీ ఒక అఖండ విజయాన్ని పొందినప్పుడే సంయమనం అవసరం. జంతర్ మంతర్‌లో యువ బొద్దింకలది ఒక రకంగా అఖండ విజయమే. గత 12 ఏండ్ల నుంచి వ్యవస్థలను, వార్తా మాధ్యమాలను చేజిక్కించుకుని ప్రజలతో, వారి సంక్షేమంతో సంబంధం లేకుండా పరస్పర సంబంధాలు తుడిచేసి, ఏకాంకిక (ఏకపాత్రాభినయంలా) కేంద్రం పరిపాలన చేస్తున్న సమయంలో ప్రజల వ్యతిరేకతను ఇంత బాగా చూపించిన ఘనత మన వారసులదే! అయితే పైకి ఇది ‘కంస సంహారం’లాగా కనిపించినా ఇక్కడ వైరిబలం తెలుసుకోవటం చాలా ముఖ్యం.
జంతర్ మంతర్ వద్ద ఉద్యమించిన కాక్రోచ్ పార్టీ ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మేకులు బిగించిన లాఠీలతో దాడి చేశారు. అక్కడ మోహరించిన బీజేపీ అనుకూల గుంపులు, గూండాలు నిరసనకారులను చితకబాదారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున కనిపించాయి. పశుబలంతో, భయభ్రాంతులను చేసి, ప్రజలను పీడించిన వాళ్లు దేశభక్తులా? వీరి నాయకుడు విశ్వగురువా? మణిపూర్ మారణహోమం, క్రీడాకారిణులు చేసిన నిరసన ఎట్లా ముగిసింది? ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌కు పదవులు, అధికారం, సత్కారాలా? పూర్తి ఏడాదిపాటు రోడ్ల మీదే బతికి వ్యవసాయ నల్ల చట్టాలు వద్దని నిరసన తెలిపిన అన్నదాతలను బీజేపీ ఎట్లా పీడించింది? అన్నం తినేటప్పుడైనా రైతు విలువ గుర్తురావాలి కదా! ఇవన్నీ పైకి కనిపించిన ఘటనలు. చాపకింద నీరులా దేశ సంపద సంపన్నుల వైపు ప్రవహిస్తుంటే, నిరసన తెలిపేవారి గతి రోజూ చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అరాచకాలను ఏ స్థాయి వరకూ తీసుకెళ్తున్నదో అర్థం చేసుకోవడానికి. అందుకే ప్రస్తుతం ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలుస్తున్న యువతకు వైరిబలం, వారి ప్రవర్తన అర్థం చేసుకోవడం చాలా అవసరం. యువత ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. ఏ ఉద్యమంలోనైనా ఒకే రకమైన ప్రణాళిక పాటించడం శ్రేయస్కరం కాదు. కష్టనష్టాలకోర్చి మొన్నటి నిరసనలాంటిది మళ్లీ చేస్తే దానిని చూడటం ప్రజలకు అలవాటయిపోతుంది.
ఏదైనా అలవాటయిపోయిన దాన్ని ప్రజలు పట్టించుకోరు. కాబట్టి జెన్-జీ సమయం, ధనం వెచ్చించాల్సింది కేంద్రానికి బలమున్న ఢిల్లీలో కాదు. ఎవరి రాష్ట్రంలో వారు ఆ రాష్ట్ర ప్రభుత్వ nపాలనను ఎండగట్టాలి. అన్ని ఆన్లైన్ వేదికల మీద కూడా చర్చించుకోవచ్చు. రాష్ట్ర రాజధానులు, వివిధ నగరాల్లోనూఆందోళన కార్యక్రమాలు సాగించాలని యువతకు సూచన. ముఖ్యంగా అక్కడి సామాన్య ప్రజలను చైతన్యపర్చండి.
ఇంకా ముఖ్యమైన విషయం. మీ రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు ప్రభుత్వంలో రిటైరైనవారు, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంకెవరైనా రాజకీయ అవగాహన ఉండి, ప్రజాహితం కోరే ఒక పదిమంది పెద్దవయసు వారిని మీ గ్రూపులకు ప్రత్యేక అతిథులుగా నియమించుకోండి. ఎందుకంటే, ఏ ఉద్యమానికైనా మీకున్న శక్తి, చైతన్యం, ఉత్సాహం, ధైర్యం ఎంత ముఖ్యమో, పెద్ద వయసువారికున్న జీవితానుభవం, రాజకీయ అవగాహన, పూర్వచరిత్ర జ్ఞానం, సంయమనం, సంతులత అంతే అవసరం. అయితే ముఖ్యంగా అందరూ పాటించవలసినది పరస్పర గౌరవం, అభిమానం, సమానత. అప్పుడు అది నిజమైన ప్రజాస్వామ్య సంస్థ అవుతుంది. ఎవరికి వారు తమ రాష్ర్టాల్లో నిరసన కార్యక్రమాలు చేయండి. ప్రతీ రాష్ట్రంలో తప్పక జరిగేటట్టు చూడండి.
ఇప్పుడు మీ ముందున్నది ఒక్క అంశం కాదు. ప్రతీ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, చర్యలను ఎండగట్టండి. ముఖ్యమైన రంగాలు విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యోగ, ఉపాధి కల్పన రంగాల గురించి క్షుణ్నంగా అర్థం చేసుకోండి. వీలైనంత వరకు కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలను విసర్జించండి. దేశంలో అన్ని రాష్ర్టాల్లో అలజడి వస్తే అన్నింటినీ నియంత్రించటం కేంద్రానికి కష్టమవుతుంది. ప్రభుత్వాలను, పార్టీలను దేశమంతా వ్యతిరేకిస్తున్నట్టు ఇతర దేశాలకు తెలుస్తుందనే భయముంటుంది. ఈ నిరసన కార్యక్రమాలు అంతర్జాతీయ పత్రికల్లో రిపోర్టు చేయండి. ఎనభై ఏండ్ల అవినీతి పాలనలో ఈ దేశానికి ఈ గతి పట్టించిన రెండు జాతీయ పార్టీలను దగ్గరకు రానియ్యవద్దు. అక్కడ నాయకులు లేరు, అవినీతి మార్గంలో లక్షల కోట్ల రూపాయలు వెనుకేసుకున్నవాళ్లు తప్ప.
ఈ చివరి విషయం అతి ముఖ్యమైనది. ముఖ్యంగా యువత పోరాడవలసినది భవిష్యత్తుకు సంబంధించినది. విదేశీయులు, ముఖ్యంగా మొఘల్ రాజులు, బ్రిటిష్ వారు పాలించినప్పుడే భారతదేశం ఒక దేశమయింది. రామాయణ, భారత కాలం నుంచీ ఆర్యావర్తమంతా చిన్న చిన్న దేశాలుగా వివిధ వంశాల రాజులతో పాలనలో ఉన్నాయి. అందుకే యూరప్ ఖండంలో వివిధ దేశాలలాగా భాషలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, అన్నీ వైవిధ్యం కలిగి ఉంటాయి.
ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే విశ్వగురు ఈ దేశానికి పనికిరాని సిద్ధాంతాలు. అమెరికా లాగ ఏ రాష్ట్ర పరిస్థితిని బట్టి ఆ రాష్ట్ర వ్యవహారాలు ఉండాలి. రాష్ర్టాలకు పూర్తి స్వేచ్ఛ, స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి.
రాష్ర్టాల ఆదాయంలో కేవలం 10 శాతం మాత్రమే కేంద్రానికి పంపి, ఏ రాష్ట్ర అభివృద్ధి ఆ రాష్ట్రమే చూసుకోవాలి. సైన్యం గురించి, రాష్ర్టాల మధ్య ఏవైనా సమస్యలు వస్తే అవి మాత్రం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఒక్క నీట్ పేపర్ మాత్రమే కాదు, డిగ్రీ వరకు విద్యారంగం కేవలం రాష్ట్రం చేతుల్లోనే ఉండాలి. రాష్ర్టాలు ఒక సంయుక్త సమాఖ్య (ఫెడరల్) లాగ ఉండాలి. వైవిధ్యభరితమైన ఇటువంటి దేశానికి ఏకీకరణ కాదు, వికేంద్రీకరణ కావాలి. యువత దీనికోసం ఉద్యమం చేసి సాధించాలి. మీ ప్రయత్నాలన్నింటికీ మా తరం మద్దతు, ఆశీర్వచనాలు ఇస్తుంది. విజయోస్తు.