వేల సంవత్సరాలుగా స్వేచ్ఛా విహంగమై
సాహిత్య గగనంలో విరాజిల్లిన జ్యోతి,
కేవలం అక్షరాల సమాహారం కాదు,
భారత సంస్కృతి సజీవ వారధి, హిందీ!
రామచరితకై తులసీదాస్‌ను ప్రేరేపించిన భాష,
పదావళిలో మీరాబాయి గానమై నిలిచిన భాష,
కబీర్, రహీం, రసఖాన్ జ్ఞానజ్యోతుల్ని
ప్రజలకు చేరువ చేసిన భాష, హిందీ!
ప్రతి భాషను సస్వరూపంలో గౌరవిస్తూ,
మాధుర్యంతో అందరితో కరచాలనం చేస్తూ
ఉత్తరాన్నీ, దక్షిణాన్నీ, తూర్పును, పడమరనూ
ఒక్కటిగా నిలిపిన భాషల సమన్వయం, హిందీ!
కలహించుకునే అడ్డుగోడలను కాదు,
అనుబంధాల ప్రవాహాలను సృష్టించే
అశేష జన సంపర్క స్వరమై,
అపూర్వ స్నేహహస్తమైన భాష హిందీ!
మన జాతీయ భాష మాత్రమే కాదు,
ఇది మన జన హృదయ భావ నాదం,
విశ్వంలో మన అస్తిత్వ స్వరూపమై,
భారతావని అమృత భాష హిందీ!
(ఈనెల 14 నుంచి 28 వరకు జాతీయ భాష హిందీ పక్షోత్సవాల సందర్భంగా)
డా. వాసాల వరప్రసాద్
9490189847