నల్లగొండ ప్రతినిధి, మార్చి7(నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సన్నాహక సమావేశం సమస్యల ఏకరువుకు వేదికగా మారడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను ఎత్తిచూపుతూ మంత్రు లు, అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. కార్యక్రమ ఉద్దేశం కంటే సమస్యల ప్రస్తావనే ఇందులో కీలకంగా మారింది. మైక్ పట్టుకున్న మండలి చైర్మన్ గుత్తాతో సహా ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమస్యల ప్రస్తావనకే ప్రాధాన్యతనిచ్చారు. నల్లగొండ కలెక్టరేట్ ఆవరణలోని ఉదయాధిత్య భవన్లో ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన సన్నాహాక సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కలెక్టర్లు కార్యక్రమ రోడ్‌మ్యాప్‌ను జిల్లాల వారీగా వివరించారు.
యూరియా యాప్‌తో తీవ్ర ఇబ్బందులు
‘గత ప్రభుత్వంలో గ్రామాలకు ఇచ్చిన ట్రాక్టర్లు పని చేస్తున్నాయా లేదా రిపేర్‌లో ఉన్నాయా ముందు పరిశీలించాలి. వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తే గ్రామాల్లో పరిశుభ్ర కార్యక్రమం ఈజీ అవుతుంది’ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హితువు పలికారు. మార్చి మొదటివారంలోనే ఎండలు విపతరీతంగా ఉన్నాయని, మంచినీటి సమస్య పొంచి ఉంది. మిషన్ భగీరథతో పాటు ఇతర నీటి వనరులపైనా దృష్టి పెట్టాలన్నారు. యూరియా యాప్‌తో బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, బుక్ చేసుకున్న రైతులకు ఎక్కడో సుదూరప్రాంతాల్లో ఇస్తుండటంతో రవాణా ఖర్చు ఎక్కువ అవుతోందన్నారు. తక్షణమే యూరియాను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. మునుగోడు ప్రాంతంలో బోర్లు ఎండిపోతున్నాయని, గ్రామాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు నుంచి మునుగోడు నియోజకవర్గంలోని చెర్వుల్లో నీరు నింపాలని మంత్రి కోమటిరెడ్డిని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో అనేక కొర్రీలు పెడుతున్నారన్నారు.
ఇల్లు మంజూరు చేశాక మధ్యలో బిల్లులు నిలిపివేయడం దారుణమన్నారు. మంజూరు చేసిన ప్రతి ఇంటికి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరెంటు లోవోల్టేజీపై చర్యలు తీసుకోవాలన్నారు. కరెంటు కోతలను అర్ధరాత్రి 12 గంటల వరకు కాకుండా 9 గంటల వరకే కుదించాలన్నారు. యూరియా యాప్‌తో రైతులు పడిగాపులు కాస్తున్నా… అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. యాప్‌పై పునరాలోచన చేయాలని కోరారు. దశాబ్ధాల తరబడి నీళ్లు లేక తల్లడిల్లుతున్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు కీలకమైన డిండి ఎత్తిపోతలపై కుట్రలు జరుగుతున్నాయని, ఏదుళ్ల నుంచి నీళ్లు తరలించే కాల్వల ఎత్తు విషయంలో అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఆరోపించారు. ఏదుళ్ల నుంచి డిండికి నీళ్లు డ్రా చేయడానికి డిండికి 440 అడుగుల ఎత్తులో, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని వట్టెంకు 436 అడుగుల లెవల్లో ప్రధాన కాల్వల నిర్మాణం చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎక్కువ ఎత్తుతో చేపట్టే కాల్వ వల్ల డిండి ఎత్తిపోతల కాల్వలకు నీళ్లు ఎక్కడం గగనం అవుతుందన్నారు. దీంతో ప్రాజెక్టు నిష్ప్రయోజనంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కాల్వల ఎత్తు సమానంగా ఉండేలా తక్షణమే జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌తో పాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి : కోమటిరెడ్డి
చివర్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అందులో చిత్తశుద్ధతో పాల్గొనాలన్నారు. రెండేండ్ల పాటు సర్పంచ్‌లు లేక ఏడాది పాటు మున్సిపల్ పాలకవర్గాలు లేక క్షేత్రస్థాయిలో సమస్యలు పెండింగ్‌లో పడ్డాయని, వాటిపై దృష్టి పెట్టడమే కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఎల్ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేయడానికి తిరిగి పనులు పునప్రారంభించామన్నారు. 2028 జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. డిండి ఎత్తిపోతల సమస్యపైనా సీఎంతో చర్చిస్తానంటూ వరల్డ్ బ్యాంకు నిధులతో మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయర్, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య పాల్గొన్నారు.
రోడ్లన్నీ గుంతలే
‘ఇన్చార్జి మంత్రి గారికి మనవి. మన ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోంది. మా దగ్గర రోడ్లన్నీ గుంతలు పడి అట్లనే ఉన్నాయ్. రోడ్ల మీద పోయే పరిస్థితి లేదు’ అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేల్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే వేదికపై ఉన్న ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వైపు చూస్తూ ‘మా దగ్గర మూడు రోడ్లు సాంక్షన్ చేసిండ్రు. ఏడాదిన్నర కిందట టెండర్లు అయ్యాయి. కాంట్రాక్టర్లు తట్టడు మట్టి తీసి అవుతల పడ్డరు. ఈ పనులు కొనసాగేలా మంత్రి చర్యల తీసుకోవాలి. ఇంకా మా దగ్గర చాల సమస్యలున్నయ్. ఇప్పుడు సమయం లేదు’ అంటూ ఆయన ముగించేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ‘బ్రాహ్మాణవెల్లంల ప్రాజెక్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టారు. ఇక్కడ కాల్వలు తవ్వేందుకు భూసేకరణ చేయాల్సి ఉంది. దీనికి నిధులు ఇచ్చి సకాలంలో పూర్తయ్యేలా చొరవ చూపాలి. ఐటిపాముల ఎత్తిపోతల పథకంలోనూ పలు సమస్యలు ఉన్నాయి. అలైన్మెంట్ మార్పు ఫైల్ పెడింగ్‌లో ఉంది. దీని గురించి ఎన్నిసార్లు అడినా స్పందన లేదు. తక్షణమే దీన్ని పరిష్కరించాలి’ అని విజ్ఞప్తి చేశారు. బస్వాపుర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మంత్రులకు విజ్ఙప్తి చేశారు.