హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఆగస్టు 17 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు సమావేశాలు జరుగలేదు. సాధారణంగా సమావేశానికి, సమావేశానికి మధ్య ఆరు నెలలు మించవద్దు. ఈ లెక్కన సెప్టెంబర్‌లోపు శాసనసభ సమావేశాలు జరుగాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆగస్టులో కనీసం వారం రోజులపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 17 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూతురు పెండ్లి ఆగస్టు 20న లండన్‌లో జరుగనున్నది. దీంతో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లండన్ వెళ్లే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో 17న మొదలుపెట్టి మూడు రోజుల్లోనే ముగిస్తారా? లేక ఆగస్టు 24 నుంచి మొదలుపెడ్తారా? అనేది చూడాలి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఆదివారం కొన్ని జాతీయ మీడియా చానళ్లతో మాట్లాడుతూ.. ఆగస్టులో శాసనసభ సమావేశాలు పెడ్తామని, ఈ సమావేశాల్లో.. ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీచేసే వారి కనీస వయోపరిమితిని 25 ఏండ్ల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం పంపిస్తామని తెలిపారు. ఈ సమావేశాల్లో మరికొన్ని తీర్మానాలు, బిల్లులు పెట్టే అవకాశం ఉన్నది. శాసనసభ, శాసనమండలిలో ఆధునీకరించిన భవన సముదాయాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టులో ప్రారంభించనున్నారు. ఇటీవల శాసనసభకు వచ్చిన రేవంత్‌రెడ్డి.. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సెంట్రల్ హాల్ సహా మంత్రుల చాంబర్ల పునర్నిర్మాణ పనులను ఆగస్టు 10లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.