సుబేదారి, జూలై 26 : వరంగల్ పోలీసు కమిషనరేట్ క్యాంపు క్లర్క్ (సీసీ), పౌరసంబంధాల అధికారి (పీఆర్వో)నిబంధనలు ఉల్లంఘించి విధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిఘా వర్గాల విచారణలో తేలినా వారిద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషనరేట్ కార్యాలయ మినిస్టీరియల్ జూనియర్ అసిస్టెంట్ ఏళ్ల తరబడి పలువురు సీపీల వద్ద పనిచేస్తూ, సిబ్బంది బదిలీలు, పదోన్నతుల విషయంలో ఫైళ్లపై సంతకాలు చేయించి అవినీతికి పాల్పడినట్లు, నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు హోంగార్డులను వ్యక్తిగత పనులకు వినియోగించుకున్నట్లు, అలాగే పలుకుబడితో పలువురు పోలీసు అధికారులతో సొంత పనులు చేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి.
15 ఏళ్లకు పైగా పోలీసు కానిస్టేబుల్‌గా ఉండి, పీఆర్వోగా పనిచేస్తున్న సదరు వ్యక్తి ఏడాదిన్నర క్రితం హెడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగోన్నతి పొంది హనుమకొండ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్నట్లు 30 శాతం అలవెన్స్‌లు తీసుకుంటూ కూడా పాత విధులనే నిర్వర్తిస్తున్నాడు. అంతేకాకుండా ప్రైవేట్ డిజిటల్ మీడియాకు కుటుంబ సభ్యుడి పేరుతో జర్నలిస్టుగా కూడా పనిచేశాడు. ఈ నేపథ్యంలో ఇటీవల వారిద్దరిపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులు వారిద్దరిపై విచారణ చేపట్టగా వారిద్దరూ విధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. అయినా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు.
క్రమశిక్షణకు మారుపేరైనా పోలీసు శాఖలో సాధారణ సిబ్బంది చిన్నపాటి తప్పు చేస్తే వెంటనే బదిలీ వేటు వేసే ఉన్నతాధికారులు, ఈ ఇద్దరు అధికార దుర్వినియెగానికి పాల్పడినట్లు తేలినా చర్యలు తీసుకోకపోవడంపై కమిషనరేట్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ ఇద్దరు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం, పలుకుబడితోపాటు సీటును కాపాడుకోవడానికి ఇక్కడ పనిచేసి బదిలీ అయి, ఐజీ స్థాయిలోని అధికారులతో మేనేజ్ చేసుకున్నట్లు తెలిసింది. అలాగే వీరిద్దరికీ కమిషనరేట్‌లోని కొందరు ఉన్నతాధికారుల సపోర్ట్ కూడా ఉన్నందునే వారిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.