యాదాద్రి భువనగిరి, మార్చి 7 (నమస్తే తెలంగాణ): వంటగ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి. అదును చూసి కేంద్రం రేట్ల బండ బాదింది. కమర్షియల్‌తో పాటు డొమెస్టిక్ గ్యాస్‌పైనా వడ్డించింది. ఏకంగా ఒక్కో డొమెస్టిక్ బుడ్డిపై రూ. 60, కమర్షియల్‌పై రూ.115 దంచింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ సిలిండర్ గుదిబండగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా రూ.50 కోట్ల దాకా అదనపు భారం పడనుంది. దీని ప్రభావం పలు రంగాలపై పడనుంది. మధ్యప్రాశ్చ్య దేశాల్లో యుద్ధం నేపథ్యంలో ధరలు పెరిగినట్లు చెబుతున్నారు.
డొమెస్టిక్ బండ రూ.965కు పెంపు
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి గ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉంది. ఇప్పుడు రెండు రెట్లు దాటిపోయింది. శుక్రవారం వరకు యాదాద్రి జిల్లాలో ఇండెన్ గృహవినియోగ సిలిండర్(14.5 కేజీలు) ధర రూ.907.50 ఉంది. తాజాగా ఒక్కో సిలిండర్‌పై రూ.60 పెంచుతున్నట్లు ప్రకటించడంతో అది కాస్తా.. రూ. 967.50కి పెరిగింది. ఇక కమర్షియల్ సిలిండర్(19 కేజీలు)పై రూ.115 పెంచడంతో రూ. 2076కి చేరుకుంది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఉజ్వల పథకానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు.
ఏటా రూ.50 కోట్ల అదనపు భారం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 13 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో యాదాద్రి భువనగిరిలో 2.52 లక్షలు, నల్లగొండలో 6.20 లక్షలు, సూర్యాపేటలో 4.25 వరకు కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో కుటుంబం నెల నుంచి రెండు నెలలకు ఒక బుడ్డిని వినియోగిస్తుంటుంది. సగటున ఏడాదికి ఆరు సిలిండర్లు ఉపయోగిస్తున్నా ఒక్కో ఫ్యామిలీపై ఏడాదికి రూ.360 అదనంగా భారం పడుతుంది. అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలపై ఏటా అదనంగా రూ.50 కోట్ల వరకు భారం పడనుంది. భారీ పెరుగుదలతో బతుకు జీవుడా అని జనం ఆందోళన చెందుతున్నారు.
సర్కారు సబ్సిడీ అంతంతే!
అటు కేంద్రం ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని అంతంత మాత్రంగానే అమలు చేస్తున్నాయి. 2014 కంటే ముందు గ్యాస్ సబ్సిడీ విధానం లేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్యాస్‌పై అధికంగా వసూలు చేస్తూ.. అందులోంచి సబ్సిడీ పేరుతో తిరిగి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది. అదీ సక్కగా అమలు చేయడం లేదు. రానురాను సబ్సిడీని తగ్గిస్తూ పోతున్నది. ఇప్పుడు ఒక్కో సిలిండర్‌పై అతి తక్కువగా రూ.40 సబ్సిడీ ఇస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సైతం కొందరికే దక్కుతున్నది. మరికొందరి ఖాతాల్లో డబ్బులు వేయకుండా మొండి చెయ్యి చూపిస్తున్నది.
హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై ప్రభావం
గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. సామాన్యులు సిలిండర్ కొనలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు కట్టెల పొయ్యి పొగలతో అనారోగ్యంపాలైన గృహిణులు గ్యాస్ రాకతో ఆ బాధ నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు సిలిండర్ ధర పెంపుతో మళ్లీ కట్టెల పొయ్యి పెట్టాల్సి వస్తుందేమోనని పేదలు ఆందోళన చెందుతున్నారు. ధరల పెంపుతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ వెండర్లు తదితర చిరు వ్యాపారులపై తీవ్ర ఎఫెక్ట్ పడనుంది. దీంతో ఆయా ఉత్పత్తులపై భారం పడటంతో రేట్లు పెరగనున్నాయి. అంతిమంగా మళ్లీ సామాన్యుడి జేబులకే చిల్లు పడనుంది. నెలవారీ ఖర్చులు కూడా పెరిగిపోనున్నాయి.
గ్యాస్ ధరల పెంపు పేదలపై భారం
యుద్ధం ప్రభావంతో గ్యాస్ ధర పెంచడం పేదలకు భారంగా మారింది. వంట గ్యాస్ రూ.60, కమర్షియల్ సిలిండర్‌కు రూ. 115 పెం చడం అన్యాయం. రోజురోజుకు ధర లు పెంచడంతో రెకాడితేగాని డొకాడని పేదల బతుకులకు గుదిబండగా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పే నాయకులు పేదల బతుకుల గురించి ఆలోచించడం లేదు.
-కుడి కాల శారద, రాంనగర్, భూదాన్ పోచంపల్లి
సామాన్యులు ఎలా బతికేది?
గ్యాస్ ధరలు అడ్డగోలుగా పెంచితే సామాన్యులకు ఇల్లు గడవడం భారంగా మారుతుంది. ఇంట్లో వాడుకునే గ్యాస్‌పై రూ.60, వాణిజ్య గ్యాస్‌పై రూ.115 ధరలు అడ్డగోలుగా పెంచితే ఎలా బతకాలి. పేదోడి మీద భారం వేయకుండా పెంచిన ధరల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రూ.500 సిలిండర్ ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలి.
-మేడోజు వాణి, హోటల్ నిర్వహకురాలు, గుండాల