ఆలోచనలు ఎప్పుడూ కాలాన్ని కొలుస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల్లో మెరుపులా కొత్తవి, వింతవి పుట్టుకొస్తాయి. వాటిని సాకారం చేసేందుకు సంవత్సరాలు శ్రమిస్తాడు మనిషి. అది విజయవంతమైతే ఇంకో ఆవిష్కరణ కోసం సిద్ధమవుతాడు. ఎప్పుడూ విశ్రమించడు. అలాంటి వ్యక్తే పున్న మల్లేశం. కాలంతో పరుగులు తీస్తూ.. కాలాన్ని కొలిచే ఆవిష్కరణలు ఎన్నో చేశాడాయన. తాజాగా ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించిన మల్లేశం కాలం కథ ఇది..
బిగ్ బి అమితాబ్ భార్య జయా బచ్చన్ ఒకప్పుడు చేతికి రెండు వాచీలు పెట్టుకునేది. ఒకటి తను ఉన్న చోట సమయం తెలుసుకోవడానికి. ఇంకోటి తన కొడుకు చదువుకోసం ఉంటున్న దేశంలో సమయం కనుక్కోవడానికి. తను పొద్దున్నే లేవగానే ఫోన్లో మాట్లాడాలి. కాలేజీ అయిపోయాక, నిద్రకు ముందు మరోసారి మాట్లాడాలని ఆమె కోరిక. అప్పట్లో విదేశీ చదువులు సంపన్నుల వ్యవహారం. ఇప్పుడది మధ్య తరగతికీ అందివచ్చింది. కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరూ విదేశాల్లో ఉండే ఇళ్లు కూడా అనేకం ఉన్నాయి. చదువు, ఉద్యోగం చేసేవాళ్లు విదేశాల్లో ఉంటే అక్కడి సమయం తెలుసుకుని ఫోన్ చేయాలి. నిద్రకు భంగా కలగకుండా, పనికి చేటు లేకుండా, చదువుకునే వాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఫోన్ చేయాలనుకునేవాళ్లకు ఇంకో గడియారం అవసరం ఏర్పడింది. ఇలా ఏ దేశంలో ఉన్నవాళ్లతో మాట్లాడాలంటే ఆ టైమ్ జోన్ సమయం తెలుసుకుని మాట్లాడాలి. ఒక వాచీ ఒక టైమ్ జోన్ మాత్రమే చూపిస్తుంది. ప్రపంచంలోని అన్ని టైమ్ జోన్లను ఒకే వాచీలో చూసుకునే అవకాశం ఉంటే ఎంత బాగుండని పున్న మల్లేశం ఆలోచించాడు.

ప్రపంచంలో ఎవరూ రూపొందించని ప్రపంచ గడియారాన్ని రూపొందించిన పున్న మల్లేశం స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని సిరిపురం గ్రామం. స్థానికంగా డిగ్రీ వరకు చదుకువున్న మల్లేశం నల్లగొండలో బీఈడీ చదివాడు. ఆ తర్వాత ఐఎంహెచ్ఎస్ (కోయంబత్తూర్)లో న్యూట్రిషన్ అండ్ డైటటిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివాడు. ప్రస్తుతం హయత్‌నగర్‌లో మెడికల్ షాపు నిర్వహిస్తున్న మల్లేశం కొత్తగా ఆలోచిస్తుంటాడు. సమస్యలకు పరిష్కారం చూపాలన్నది అతని ఆశ. దేశ దేశాల్లో నివస్తున్న ప్రజల మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడెక్కడి వాళ్లతోనో మాట్లాడుకునే కమ్యూనికేషన్ వ్యవస్థలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఏ దేశంలోని వాళ్లతో ఏ సమయంలో మాట్లాడాలో అందరి సమస్య. ఈ సమస్యకు ఒకే ఒక్క గడియారంలో పరిష్కారం చూపించాలనుకున్నాడు మల్లేశం. ప్రపంచ గడియారం రూపకల్పన కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన ప్రయత్నాలు ఫలించి ఈ ఏడాది జనవరి 26న ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించాడు. దీంతో ప్రపంచంలోని అన్ని ప్రాంతాల కచ్చిత సమయాలను తెలుసుకోవచ్చు. సమయాన్ని ఎ.ఎం. లేదా పి.ఎం.లో కూడా తెలుసుకోవచ్చు. పగలు, రాత్రి వేళలను గుర్తించేందుకు అంకెలను నీలం, ఎరుపు వలయాల్లో ముద్రించాడు.
మల్లేశం ఈ ప్రపంచ గడియారం రూపొందించక ముందు ఐరిష్ క్యాలెండర్ ఆవిష్కరించాడు. కంటిలోని నల్లగుడ్డుని ఐరిష్ అని పిలుస్తారు. కనుగుడ్డు ఆకారంలో క్యాలెండర్ రూపొందించడం వల్ల దానికి ఐరిస్ క్యాలెండర్ అని పేరు పెట్టాడు. మూడేండ్ల పాటు కష్టపడి 2020లో దీనిని ఆవిష్కరించాడు. ఈ క్యాలెండర్ క్రీ.శ. 1500 నుంచి క్రీ.శ. 2600 సంవత్సరాల మధ్య కాలంలోని తేదీలు, వారాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ క్యాలెండర్ రూపకల్పనకు 21 సెం.మీ. పొడవుతో రెండు అద్దాలను ఉపయోగించాడు. ఒక అద్దం కింది పేపర్‌పై తేదీలు, వారాల పేర్లు ఉంటాయి. ఈ అద్దాలను జరుపుతూ కావల్సిన తేదీ, వారాలను గుర్తించవచ్చు. లీఫ్ సంవత్సరాన్ని గుర్తించడానికి ప్రత్యేకమైన గుర్తు ఉంది. ఈ ఐరిస్ క్యాలెండర్‌ని 2020లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది.
ఐరిస్ క్యాలెండర్‌ని కొన్నాళ్ల తర్వాత దానిని మరింత అభివృద్ధి చేసి కలియుగ క్యాలెండర్ రూపొందించాడు. ఇందులోనూ అద్దాలు, కాగితం ఉపయోగించి, వృత్త్తాకారంలో కలియుగ గోడ పంచాంగం రూపొందించాడు. దీని సహాయంతో నాలుగున్నర లక్షల సంవత్సరాల పంచాంగం తెలుసుకోవచ్చు. అద్దాలు జరుపుతూ తేదీ, వారం, నెల, సంవత్సరంతోపాటు తెలుగు సంవత్సరాలు, తిథి, వార, నక్షత్ర, రాహు, గుళిక, యమగండం, దుర్ముహూర్తం, పండుగలు అన్నీ తెలుసుకోవచ్చు. కలియుగ క్యాలెండర్ 2024లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్‌ల్లోకి ఎక్కింది.
ప్రపంచంలో ఎవరూ రూపొందించని వరల్డ్ క్లాక్ తయారు చేయడం గర్వంగా ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ ఆవిష్కరణలు చేయగలిగాను. భవిష్యత్‌లో ఇంకొన్ని ఆవిష్కరణలు చేయాలని నా అభిలాష. నీటితో సమయం తెలుసుకునేందుకు ప్రస్తుతం వాటర్ క్లాక్ రూపొందిస్తున్నాను. త్వరలోనే నీటి గడియారం విజయవంతంగా రూపొందిస్తాను.
– పున్న మల్లేశం, ఆవిష్కర్త
-పున్న శ్రీకాంత్