ఎవరెంత మందిని హీరోలుగా ఆరాధించినా, అందరి తొలి హీరో నాన్నే! నాన్న లాగానే చొక్కా తొడగకుండా.. కాదు కాదు నాన్న చొక్కా తొడక్కుండా, నాన్నలాగే తల దువ్వకుండా, నాన్న చెప్పుల్లో కాళ్లు పెట్టి నడవకుండా ఎవరి బాల్యమూ పూర్తవదు. ఖరీదైన వాచీలెన్ని పెట్టినా తొలిగా చుట్టుకున్న వదులైన నాన్న గడియారం పెట్టుకున్నప్పటి ఆనందాన్ని ఇవ్వలేవు. నాన్న అడుగుజాడలే జీవిత ప్రయాణానికి దిక్సూచి. నాన్న చిటికెన వేలు పట్టుకుని బజారుకు వెళ్లినప్పుడు అడిగింది ఏదైనా క్షణాల్లో చేతికందేది! అప్పుడు నాన్న ఒక సూపర్ మ్యాన్! నాన్న అడుగుజాడల్లో బుడి బుడి అడుగులు వేస్తూ మొదలైన ప్రయాణం వడివడిగా సాగిపోయేప్పుడు కూడా నాన్నే రోల్ మోడల్! అమ్మానాన్నలయ్యాక కూడా నాన్న నుంచి నేర్చుకుంటే పెద్దయ్యాకా జీవితం బాల్యమంత ఆనందంగా సాగిపోతుంది. వేలుపట్టి నడిపించిన నాన్నే వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నంత ధైర్యం వస్తుంది.
నిబద్ధతే బలం
గుండె ధైర్యమే నాన్న బలం. పని ఒత్తిడి ఎంత ఉన్నా, ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయానని విశ్రాంతి కోరడు. పిల్లల కోసం ఇంటి కోసం బరువు మోయడానికే సిద్ధపడతాడు. కష్టాలకు కుంగిపోకుండా ఇంట్లో అందరికీ ప్రేమను పంచడమే నాన్న బాధ్యతగా స్వీకరిస్తాడు. నిబద్ధతకు నాన్నే కొలమానం. పనిలో నిబద్ధతను, నాయకత్వంలో సమర్థతను నాన్న నుంచే నేర్చుకోవాలి. మాటపై నిలబడటం, ఎంచుకున్న పనిని బాధ్యతగా నిర్వర్తించడం నాయకత్వ లక్షణాలు. నాయకత్వానికి తొలి పాఠం, తొలి గురువు నాన్నే!

గుండె నిండా సహనం
ఎంతటి తుఫానైనా మనసు అనే సముద్రంలో కలుపుకొనే సహనం నాన్న. ఇంటా బయటా ఎన్ని ఇబ్బందులున్నా గంభీరంగా నిలబడతాడు తప్ప కుంగిపోయి పిల్లల కంటపడడు. ఆ నిశ్శబ్దంలోనే ఒక అద్భుతమైన స్థిరత్వం ఉంటుంది. ఇప్పటి ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. వాటికి కుంగిపోకుండా, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని సహనంతో ఎలా గెలవాలో నాన్నను చూసి నేర్చుకోవాలి. నిజానికి ఈతరం కన్నా ఎక్కువ ఒడుదొడుకులు వాళ్లే చూశారు. ఆ సందర్భాలలో నాన్నను గుర్తు చేసుకుంటే సరి. మనసుకు బలం వస్తుంది. క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన నుంచే మనకు అలవడుతుంది.
కఠిన శ్రమకు చిరునామా
నాన్న డిక్షనరీలో సలహాల కంటే చేతలే ఎక్కువ. జీవితాన్ని మాటలతో కాకుండా ఆచరణతో పరిచయం చేస్తారు. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు భవిష్యత్తు కోసమే ఆయన తపన. ఎంత స్మార్ట్ వర్క్ యుగంలో ఉన్నప్పటికీ, హార్డ్ వర్క్‌కి ప్రత్యామ్నాయం లేదని నాన్న జీవితం చెబుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం శ్రమ, అంకితభావమే సాధనమని చెప్పే స్ఫూర్తిని ఆయన నుంచి స్వీకరించాలి.

నిరహంకార త్యాగం
పిల్లల ఆనందం చూసి ఆనందపడే తత్వం నాన్నది. తనకు నచ్చినవి వాయిదా వేసుకుంటూ పిల్లలకు నచ్చినవి ఎంపిక చేసుకుంటూ పోయిన ప్రతి సందర్భంలో నాన్న సంతోషాన్ని చూడని వాళ్లుండరు. తన ఆశలు అణచుకుని, పిల్లల ఆశయాలకు రెక్కలు తొడుగుతాడు. స్వార్థం తెలియని నాన్నకు తెలిసింది త్యాగమే. అహం అతని శత్రవు. నాన్న నీడలో పెరిగి పెద్దయ్యాక సాటివారి కోసం కొంత త్యాగం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి. సహానుభూతి గొప్ప లక్షణం. విజయం తలకెక్కినప్పుడు అహంకారం దరిచేరనివ్వకుండా, ఒదిగి ఉండడం ఎలాగో నాన్నను చూసి నేర్చుకోవాలి.
క్రమ శిక్షణ – విలువలు
నాన్న కోపం వెనుక క్రమశిక్షణ ఉంటుంది. సమయపాలన, ఇతరులపట్ల గౌరవం, నిజాయతీ నాన్న నేర్పే ప్రాథమిక పాఠాలు. తన ప్రవర్తన పిల్లలకు ఈ పాఠాలు నేర్పుతుంది. ఆయన చిన్నప్పుడు కోప్పడిన సందర్భాలను గుర్తు చేసుకుంటే వేళకి స్కూల్‌కి వెళ్లకపోవడమో, నీళ్లు, కరెంట్ లాంటి ప్రకృతి వనరుల్ని వృథా చేయడమో, చేయాల్సిన పని సక్రమంగా పూర్తి చేయకపోవడమో అయి ఉంటుంది. ఇవన్నీ విలువలతో కూడిన జీవితానికి పునాది వేసేవే. నాన్న చెప్పులు సరిపోకపోయినా కష్టపడి నడవాలని ఎలా ప్రయత్నం చేస్తామో, విలువల బాటలో అంతే ఓర్పుతో నాన్న వెనుకే అడుగులేయాలి. సమాజంలో సాంకేతికత ఎంత పెరిగినా ‘మానవ విలువలు’ మారవు. నాన్న నేర్పిన క్రమశిక్షణ, నిజాయతీ అనే పునాదిపైనే కెరీర్
నిర్మితమవుతుంది. అవినీతికి లొంగకుండా నీతిగా బతకడమే ఎవరైనా నాన్నకు ఇచ్చే నిజమైన గౌరవం.
నమ్మకమైన అండ
బిడ్డలు ఎంత ఎదిగినా నాన్న దృష్టిలో చిన్న పిల్లలే. చిన్న తప్పు చేసినా పెద్దగా మందలిస్తాడు నాన్న. ఎంతమంది క్షమించినా తప్పును మాత్రం సహించడు. కానీ, ప్రపంచం మొత్తం తన బిడ్డకు ఎదురు తిరిగితే ‘నేనున్నాను‘ అని మద్దతు పలికే మొదటివ వ్యక్తీ నాన్నే. బిడ్డ జీవితానికి ఆయన ఒక భద్రతా వలయం. ఒకరి మనసులో ‘నేను సురక్షితం’ అనే భావన కల్పించడం ఎలాగో నాన్న నుంచి నేర్చుకోవాలి. లీడర్‌గా లేదా ఒక కుటుంబ సభ్యుడిగా ఇతరులకు భరోసా ఇవ్వడం, వారి కష్టాలను పంచుకోవడంలో నాన్ననే రోల్ మోడల్‌గా స్వీకరించాలి.

అసలైన ఆర్థిక పాఠం
ఈఎంఐల ఒత్తిడి ఉండనే ఉంది. స్కూల్ ఫీజుల భారం మోయలేనంతగా పెరిగిపోతున్నది. అన్నిటికీ డబ్బులు సమకూర్చుకోవడం తలకు మించిన భారమే. ధరల సముద్రంలో జీవితం దిక్కుతోచని నావ. ఇలాంటప్పుడు నాన్నని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. చేతిలో రూపాయి లేనప్పుడూ పుట్టిన రోజున పిల్లల్ని నిరాశ పరిచిన దాఖలాలు ఉండవు. ఒక్కటే జీతం. ఇల్లాలు, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతలు, బంధువులు. అయినా సరే వెలితి లేకుండా ఇల్లు నడిపారంటే తప్పకుండా ఆయనో ఆర్థిక పాఠం. పొదుపు సూత్రాలు పాటించారో, అడగగానే అప్పిచ్చే స్నేహితులను సంపాదించుకున్నారో, అండగా ఉండే నలుగురు ఆత్మీయుల్ని పోగు చేసుకున్నారో, తనకు తాను కొన్ని కోరికల్ని త్యాగం చేసుకున్నారో…ఏదైతేనేం సంసార నౌకను సజావుగా నడిపి ముందుతరాన్ని ఒడ్డుకు చేర్చారు. ఇవన్నీ ఆయన నుంచి మనం తప్పక నేర్చుకోవలసిన పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్. ఇక్కడ మనం గమనించాల్సింది, నేర్చుకోవాల్సింది డబ్బుతో పాటు అనుబంధాలూ గొప్ప సంపాదనే! అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు నాన్నను తలుచుకుంటే కొండంత ధైర్యం వస్తుంది.
ఈ ఫాదర్స్ డే రోజున ఆయనకు కేవలం ఒక గిఫ్ట్ ఇచ్చి సరిపెట్టుకోకుండా.. నాన్న నేర్పిన విలువలను మన జీవితంలో అన్వయించుకుందాం. నాన్న అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన గర్వపడేలా జీవించడమే మనం ఆయనకు ఇచ్చే అత్యుత్తమ కానుక. ప్రపంచంలోని తండ్రులందరికీ ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు!
-లక్ష్మీహరిత ఇంద్రగంటి