కామారెడ్డి, జూన్ 26 : లండన్‌లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లి, అతడి గదిలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా, ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు.. రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి (25) ఉన్నత చదువుల కోసం గతేడాది లండన్ వెళ్లాడు.
లండన్‌లోని లీసెస్టర్ పట్టణంలో ఉన్న ఓ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 23వ తేదీన రాత్రి తన స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఆ రోజు అక్కడే నిద్రించాడు. తెల్లారేసరికి విగతజీవిగా కనిపించడంతో స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీనాథ్ రెడ్డి ఎలా మృతిచెందాడనే విషయమై వివరాలు తెలియాల్సి ఉన్నది.
రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి-మంజుల దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన కుమారుడు మృతిచెందడంతో కుటుంబీకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. శ్రీనాథ్‌రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎలాగైనా త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబీకులు, బంధువులు కోరారు.