యాదగిరిగుట్ట, మార్చి 7: యాదగిరిగుట్ట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా సుమారు 3 వేల ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టడంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తప్పుబడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలో నిషేధిత జాబితాలో ఉన్న యాదగిరిపల్లి, జంగాల కాలనీ, బీసీ కాలనీతో పాటు ఇతర ప్రాంతాలను శనివారం సందర్శించి, బాధితులకు అండగా నిలుస్తామని హామీనిచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే నిషేధిత జాబితాను తొలిగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయినా నిరుపేదలకు చేసిందేమీలేదన్నారు. హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చి స్థలాలను స్వాధీనం చేసుకున్నారన్నారు. పది రోజుల్లో నిషేధిత జాబితాలో ఉన్న 762 ఇళ్లకు పట్టాలను అందజేసి కాంగ్రెస్ తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. లేనిపక్షంలో ఆలేరు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ గణేశ్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి, ప్రధాన కార్యదర్శి ఆరె శ్రీదర్, యూత్ అధ్యక్షుడు ముక్యర్ల సతీశ్, నాయకులు సతీశ్ భట్, శారాజీ రాజేశ్, ర్యాకల రాజు, మాటూరి బాలయ్య, కంసాని స్వామి, చిరంజీవి, బాల నర్సింహ, మిట్ట వెంకటేశ్, ఇళ్ల బాధితులు పాల్గొన్నారు.
బాధితులకు అండగా నిలవాలి
యాదగిరిగుట్ట మండలంలో 3 వేల ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వెంటనే స్పందించి నిషేధిత జాబితాను తొలగించి వారికి అండగా నిలువాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య కోరారు. మాటలు చెప్పుకుని కాలం వెల్లదీస్తే ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేరన్నారు. శనివారం మండలంలోని వంగపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకున్న పేదలకు సర్వహక్కులను కల్పించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదలకు, వారి ఇండ్లకు కనీసం హక్కులేకుండా చేస్తోందన్నారు. కార్యక్రమంలో నార్మూల్ డైరక్టర్ కందాల అలివేలు రంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రేపాక మౌనిక మహేందర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చంద్రగోని జహంగీర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.