చుంచుపల్లి, జూలై 28 : చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ పంచాయతీలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మాస్టర్ ఈ.కె. (ఎక్కిరాల కృష్ణమాచార్య) జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 100 గ్రామాల్లో 100 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఎన్కే నగర్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన హోమియో ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణమూర్తి, రామారావు, రవికాంత్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రావు, కోటేశ్వరరావు, లక్ష్మి, ఎన్కే నగర్ సర్పంచ్ బాదావ శ్రీకాంత్, నవత రాజేశ్వరరావు పాల్గొన్నారు.