Planet 9 | ఖగోళంలో ఏం జరుగుతోంది.. వందేండ్ల క్రితం కనిపించిన ప్లానెట్ 9 ఏమైపోయింది?
ఈ నేల నాది, ఈ ఇల్లు నాది అనుకునే భావనల నుంచి కాస్త బయటకు వచ్చి... చీకటివేళ ఆకసాన్ని చూస్తే, పలకరిస్తున్నట్టుగా మిణుకుమిణుకుమనే తారలు. వాటి మధ్య సొట్టబుగ్గలతో జాబిలి, ఆ జాబిలికి కాస్త దూరంగా స్థిరంగా కాంతిని ప్రతిఫలించే గ్రహాలు.
Planet 9 | ఈ నేల నాది, ఈ ఇల్లు నాది అనుకునే భావనల నుంచి కాస్త బయటకు వచ్చి… చీకటివేళ ఆకసాన్ని చూస్తే, పలకరిస్తున్నట్టుగా మిణుకుమిణుకుమనే తారలు. వాటి మధ్య సొట్టబుగ్గలతో జాబిలి, ఆ జాబిలికి కాస్త దూరంగా స్థిరంగా కాంతిని ప్రతిఫలించే గ్రహాలు. ఇప్పుడంటే నేల మీద పరుగులు పెరిగి, నింగి వంక చూసే తీరిక, ఓపిక ఉండటం లేదు కానీ… ఒకప్పుడు ఆకాశం వంక చూడటం, గ్రహగతులను గమనించడం చాలామందికి తెలిసిన విద్యగానే ఉండేది. అలా చూస్తూనే గ్రహాలను, నక్షత్రాలను వేర్వేరుగా గుర్తించారు. మన సౌరకుటుంబంలో ఉన్న బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని గ్రహాలను కేవలం కంటి చూపుతోనే కనిపెట్టారు అంటే ఆశ్చర్యంగా ఉండ వచ్చు. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలను మాత్రమే టెలిస్కోప్ సాయంతో కనుగొన్నారు. వాటిలో ప్లూటో.. గ్రహం హోదాను కోల్పోయాక నవగ్రహాలు కాస్తా అష్టగ్రహ కూటమిగా మిగిలిపోయాయి. కథ ఇక్కడితో ఆగలేదు. నెప్ట్యూన్ ఆవల ఓ భారీ గ్రహం ఉందనే వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ గ్రహపు స్థితిగతుల మీద కచ్చితమైన సమాచారం లేకపోయినా… దాని ఉనికి మీద మాత్రం సందేహాలు వీడిపోతున్నాయి.
అంతరిక్షంలో ఏం జరుగుతున్నదో, ఆకాశంలో ఎక్కడ ఏముందో తెలుసుకునేందుకు ఇప్పుడు సవాలక్ష మార్గాలున్నాయి. కానీ ఒకప్పుడు కేవలం కంటిచూపు, మస్తిష్కంలో సాగే విశ్లేషణలు, తాళపత్రాల మీద లెక్కలే ఆధారంగా ఉండేవి. టెలిస్కోప్ వచ్చాక, ఆవిష్కరణల వేగం పుంజుకుంది. హాన్స్ లిపర్షే అనే డచ్ అద్దాల వ్యాపారి, 1608లో టెలిస్కోప్‌ను కనుగొన్నాడు. దాన్ని గెలీలియో ఖగోళ పరిశోధనకు అనువుగా మార్చాడు. అయినా ఓ కొత్త గ్రహాన్ని కనుగొనడానికి దాదాపు రెండు శతాబ్దాలు పట్టింది. విలియమ్ హర్షల్ అనే శాస్త్రవేత్త 1781లో యురేనస్ గ్రహాన్ని కనిపెట్టాడు. దాంతోపాటే కొన్నివేల ఖగోళ పదార్థాలనీ కనిపెట్టాడు హర్షల్. అప్పటిదాకా ఆరు గ్రహాల జాబితానే వల్లె వేస్తున్న పిల్లలు యురేనస్ పేరును బట్టీపట్టసాగారు.
సౌర కుటుంబంలోకి కొత్తగా చేరిన ఈ యురేనస్‌ను గమనించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలంతా తమ టెలిస్కోప్‌లను ఆ దిశగా ఎక్కుపెట్టారు. అయితే దాని భ్రమణాన్ని పరిశీలించినవారికి ఏదో తేడా కనిపించింది. దాని ఆవల ఉన్న మరో వస్తువేదో యురేనస్ గతిని ప్రభావితం చేస్తున్నట్టు అనిపించింది. ఆ లెక్కల ఆధారంగా యురేనస్ అవతల గమనించినప్పుడు నెప్ట్యూన్ బయటపడింది. గ్రహాల జాబితా పెరిగింది. నెప్ట్యూన్ తర్వాత కూడా మరో గ్రహం ఉంది అనే అనుమానానికి కూడా ఈ సిద్ధాంతమే కారణం. నెప్ట్యూన్ గతిని మరో గ్రహమేదో ప్రభావితం చేస్తున్నది అనుకున్నప్పుడు అది ప్లూటో ఏమో అనుకున్నారు. కానీ ప్లూటోకి అంత శక్తి లేదని తర్వాత అర్థమైపోవడంతో మరో గ్రహం కోసం అన్వేషిస్తున్నారు.

పేరు లేని గ్రహం కోసం…
వందేండ్ల క్రితమే లోవెల్ అనే శాస్త్రవేత్త నెప్ట్యూన్ ఆవలి గ్రహానికి, ప్లానెట్ X అని పేరు పెట్టాడు. అమెరికాకు చెందిన ఈ లోవెల్ చిత్రమైన మనిషి. రచయిత, వ్యాపారవేత్త, గణిత శాస్త్రవేత్త అయిన లోవెల్ కుజగ్రహం మీద కనిపించే చారలను ఆనకట్టలుగా భావించాడు. ఆధునిక నాగరికతకు చెందినవారు అక్కడ ఉంటూ, ఆ ఆనకట్టలను నిర్మించారని నమ్మాడు. తన నమ్మకాన్ని ప్రచారం చేస్తూ ఏకంగా మూడు పుస్తకాలు రాశాడు. నెప్ట్యూన్ ఆవల ఓ మార్మిక గ్రహం ఉందనీ, దాని పేరు ప్లానెట్ ఎక్స్ అనీ చెప్పుకొచ్చాడు. లోవెల్ మాటల్ని ఎవరూ ఖాతరు చేయలేదు కానీ, ప్లానెట్ ఎక్స్ అన్న పేరు మాత్రం స్థిరపడిపోయింది.
తర్వాత కాలంలో దీని గురించి విస్తృతమైన పరిశోధనలు చేసిన బ్రౌన్, బెటిజిన్ అనే శాస్త్రవేత్తలు ఈ గ్రహానికి పెర్ట్యుబర్, జార్జ్ లాంటి రకరకాల పేర్లు సూచించారు. నెప్ట్యూన్ ఆవల ఉన్న ఖగోళ వస్తువులన్నిటినీ కూడా ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ పేరుతో పిలుస్తున్నారు. వాటిలో ఈ గ్రహమూ ఒకటి. ఖగోళంలో ఓ వస్తువు ఉనికిని స్పష్టంగా నిరూపించేంతవరకు దానికి పేరు పెట్టేందుకు అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ఒప్పుకోదు. కాబట్టి ఈ గ్రహానికి ఇంతవరకు ఏ పేరూ స్థిరపడలేదు. ప్రస్తుతానికి ప్లానెట్ 9 పేరుతో శాస్త్రవేత్తలు దీని గురించిన సమాచారాన్ని పంచుకుంటున్నారు.
ప్లానెట్ 9 ఎలా ఆవిర్భవించింది
ప్లానెట్ 9 ఎలా ఏర్పడింది అనే విషయం మీద అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి.

1 ఓ అంచనా ప్రకారం మొదట్లో ఈ గ్రహం గురుడు, శని లాంటి భారీ గ్రహాలకు దగ్గర్లో ఉండేది. వాటి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏ ఇతర గ్రహం కూడా, ఆ మార్గంలోకి రాకుండా ఉంటాయి. అలా ప్లానెట్ 9, క్రమంగా పెద్ద గ్రహాల నుంచి తప్పుకొని, దూరంగా వెళ్లిపోయిందని అంటారు.
2 మరో సిద్ధాంతం ప్రకారం ప్లానెట్ 9, ఇతర నక్షత్రానికి చెందిన గ్రహం. కానీ సూర్యుడి ఆకర్షణ వల్ల, మన సౌర కుటుంబంలోకి వచ్చి చేరింది.
3 వాయువులు, ధూళికణాల కలయికతో అక్కడికక్కడే ఈ గ్రహం ఏర్పడిందని మరో ఊహ.
4 సౌర కుటుంబం ఏర్పడే సమయంలో ఇతర గ్రహాల్లాగానే ఈ ప్లానెట్ 9 ఏర్పడిందనీ, అయితే ఓ గ్రహంగా రూపాంతరం చెందకుండానే అసంపూర్ణంగా మిగిలిపోయిందనీ ఇంకో మాట.
వలయంలో కలవరం
సౌర కుటుంబంలో గ్రహాలన్నీ ఏర్పడిపోయాక మిగిలిన శకలాలన్నీ ఒక వలయంలా ఏర్పడి తిరుగుతున్నాయి. వాటిని కనుగొన్న శాస్త్రవేత్త పేరుమీదుగా, దానికి కైపర్ బెల్ట్ అని పేరు పెట్టారు. వీటిలో కొన్ని రాతితో, కొన్ని లోహాలతో, మరికొన్ని గడ్డకట్టిన వాయువులతో ఉంటాయి. యురేనస్ గ్రహాన్నీ, అలాగే కైపర్ బెల్టులో ఉన్న సెడ్నా లాంటి పదార్థాలను ఒక భారీ గ్రహమేదో ప్రభావితం చేస్తున్నదని గ్రహించారు.
ఓ 11 ఖగోళ పదార్థాలు ఒకే దిశలో, ఒకే వేగంతో కదులుతుండటం ఈ సిద్ధాంతానికి బలాన్నిచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన మైక్ బ్రౌన్, కాన్స్టాంటిన్ బెటిజిన్ ఈ గ్రహపు పరిణామాన్ని కూడా అంచనా వేసే ప్రయత్నం చేశారు. మన భూమి కంటే ఈ గ్రహం 5-6 రెట్లు బరువుగా ఉంటుందని, 2-4 రెట్లు అధిక పరిమాణంతో ఉండవచ్చనీ తేల్చారు. అది మొదలు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ గ్రహం గురించి మరిన్ని వివరాలను ఊహిస్తున్నారు. వీటి విషయంలో వేర్వేరు శాస్త్రవేత్తల లెక్కలు వేర్వేరుగా ఉన్నాయి కానీ ఊహ కోసం ఓసారి వాటిలో ముఖ్యమైనవాటిని చూద్దాం.
- ఈ గ్రహం, సూర్యుడి చుట్టూ తిరిగేందుకు పది నుంచి 20 వేల సంవత్సరాలు పడుతుందని ఓ అంచనా.
- భూమి నుంచి సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని ఆస్ట్రనామికల్ యూనిట్‌గా (AU) పేర్కొంటారు. ఖగోళ దూరాలను ఈ AU లెక్కతో పోలుస్తారు. మన భూమి నుంచి ఈ తొమ్మిదో గ్రహం 400-800 AU ల దూరంలో ఉందని అంటున్నారు.
- భూమి లాగానే ఈ తొమ్మిదో గ్రహం కూడా సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరుగుతున్నది.
- రాతి చుట్టూ గడ్డకట్టుకున్న మంచుతో ఈ గ్రహం కప్పబడి ఉందని ఊహిస్తున్నారు.
అతుకుల వెతుకులాట
సాంకేతికత ఇంతలా అభివృద్ధి చెందిన సమయంలో ఓ పెద్ద గ్రహం మన కళ్లు కప్పి తిరగడం ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ ఈ అనంత విశ్వంలో మన ఉనికి పిపీలికమే అని చెప్పేందుకు, ఈ గ్రహాన్ని కనిపెట్టలేకపోవడమే ఓ పెద్ద ఉదాహరణ. నెప్ట్యూన్‌కు సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉందో… నెప్ట్యూన్ నుంచి అంతకు 13-26 రెట్ల దూరంలో ఈ తొమ్మిదో గ్రహం ఉంది. అల్లంత దూరంలో ఉన్న గ్రహం నుంచి ప్రతిఫలించే కాంతి చాలా చాలా తక్కువగా ఉంటుంది. ప్లూటో కంటే 600 రెట్లు కాంతిహీనంగా ఈ గ్రహం ఉంటుందని అనుమానం. పైగా ఇది సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది కాబట్టి, బాగా దూరంగా వెళ్లినప్పుడు దాన్ని కనిపెట్టడం కష్టం! అయినా పట్టు విడవకుండా వేర్వేరు మార్గాలలో ప్లానెట్ 9 ఉనికిని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
- సూపర్ కంప్యూటర్, ప్రత్యేక సాఫ్ట్వేర్ల ద్వారా ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న ఖగోళ చిత్రాలన్నిటినీ పరిశీలిస్తూ… ప్లానెట్ 9 కక్ష్య అని ఊహించే ప్రాంతంలో ఏదైనా వస్తువు కనిపిస్తుందేమో చూస్తున్నారు.
- హవాయి ద్వీపంలో మౌనాకి అనే నిద్రాణ అగ్నిపర్వతం మీద సుబారు టెలిస్కోప్ ఉంది. ప్రపంచంలో అతి పెద్ద దూరదర్శినులలో ఇదీ ఒకటి. ఇక్కడినుంచి తరచూ ప్లానెట్ 9 ఉనికిని గుర్తించే ప్రయత్నం జరుగుతున్నది.
- చిలీలో వేరా రూబిన్ నక్షత్రశాల… భూమి నుంచి కనిపించే ఆకాశం మొత్తాన్నీ దశలవారీగా చిత్రీకరించింది. ఆ డేటాను ఉపయోగించుకుని ప్లానెట్ 9 ఆనవాళ్లను గమనిస్తున్నారు.
- ఈ గ్రహం ప్రయాణిస్తున్నది అని ఊహిస్తున్న కక్ష్యలోని గ్రహశకలాలు, తోకచుక్కల్ని నిశితంగా గమనిస్తే… వాటి మీద కచ్చితంగా ప్లానెట్ 9 ప్రభావం కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు అదే చేస్తున్నారు.
- తక్కువ కాంతి ఉన్న ఖగోళ వస్తువులను కనుగొనేందుకు రేడియేషన్‌తో పనిచేసే టెలిస్కోపులను ఉపయోగిస్తారు. వెలుతురు లేకున్నా చల్లదనమో, వేడో ఉంటుంది కదా! ఇన్ఫ్రారెడ్ కిరణాల ద్వారా ఈ ఉష్ణోగ్రతలను పసిగట్టి, అక్కడ ఓ గ్రహమో, గ్రహశకలమో ఉన్నట్టు నిర్ధారించవచ్చు. ఈ సాంకేతికతతో పనిచేసే అధునాతన టెలిస్కోపులతో ప్లానెట్ నైన్ ఉనికిని గమనించే ప్రయత్నం జరుగుతున్నది
గ్రహరాజు సూర్యుడు
వేద వాఙ్మయంలో గ్రహగతుల గురించి విస్తారమైన విశ్లేషణలు కనిపిస్తాయి. ఖగోళ శాస్త్రం నక్షత్రంగా తేల్చిన సూర్యుణ్ని జ్యోతిశ్శాస్త్రం గ్రహంగా పేర్కొన్నది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఏడు గ్రహాలతోపాటు రాహువు, కేతువును ఛాయా గ్రహాలుగా చెబుతున్నది. ఈ గ్రహాలన్నిటికీ రవిని రాజుగా నిర్ణయించింది. ఆయా గ్రహాలకు భావాలను నిర్దేశించింది. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని బట్టి.. ఫలితాలు నిర్దేశించింది. రవి కాంతి ఛత్రంలోకి వెళ్లిన గ్రహాలు తమ శక్తిని కోల్పోతాయని.. గ్రహరాజు ప్రభావం అలాంటిదని పలు జ్యోతిష గ్రంథాలు పేర్కొన్నాయి.
ముందే కనుగొన్న భారతీయుడు?

నెప్ట్యూన్ ఆవలి గ్రహం గురించి ఇంతలా చర్చ జరుగుతున్న సమయంలో వందేండ్ల క్రితం ఓ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతం తెర మీదకు వచ్చింది. 1911లోనే వెంకటేశ్ కేటకర్ అనే శాస్త్రవేత్త, నెప్ట్యూన్కి ఆవల మరో రెండు గ్రహాలు ఉన్నాయని చెప్పడమే కాకుండా వాటికి బ్రహ్మ, విష్ణు అని పేర్లు కూడా పెట్టాడు. ఫ్రెంచ్ ఖగోళ పత్రికలో ఈ సిద్ధాంతాన్ని ప్రచురించారు కూడా! ఈ వ్యాసం వెలుగులోకి వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత ప్లూటో గ్రహాన్ని కనుగొన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే – సూర్యుడి నుంచి ప్లూటో వరకు ఉన్న దూరం, సూర్యుడి చుట్టూ అది తిరిగే సమయం… వెంకటేశ్ సూచించిన లెక్కలకు చాలా దగ్గరగా ఉండటం. మరి రెండో గ్రహం గురించి వెంకటేశ్ అంచనా నిజమో కాదో తెలియాలంటే, దాని ఉనికి గురించి పూర్తి సమాచారం రావాల్సిందే. దురదృష్టం ఏమిటంటే ఈ శాస్త్రవేత్త గురించి ఇటు ప్రజలకు కానీ, అటు వైజ్ఞానిక లోకానికి కానీ తెలియకపోవడం.
పాపం ప్లూటో

నెప్ట్యూన్ గతిలో మార్పులకు కారణం ప్లూటోనే అని నిర్ధారించుకుంటే, మరో గ్రహం గురించిన ఆలోచన వచ్చేదే కాదు. కానీ ప్లూటోకి అంత శక్తి లేదని గ్రహించారు శాస్త్రవేత్తలు. ఓ గ్రహానికి ఉండాల్సిన- గుండ్రంగా ఉండటం, సూర్యుని చుట్టూ తిరగడం అనే లక్షణాలు ప్లూటోకి ఉన్నప్పటికీ… దాని దారిలో ఎలాంటి అడ్డంకులూ లేకుండా చేసుకునేంత శక్తి లేదు. ఓ గ్రహానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఇదే. ఒకవేళ ప్లూటోను కనుక గ్రహంగా గుర్తిస్తే… కైపర్ బెల్టులోని సెడ్నా, ఎరిల్ లాంటి ఇతర మరుగుజ్జు గ్రహాలను కూడా గుర్తించాల్సి ఉంటుంది!
రోచ్ లిమిట్

రెండు ఖగోళ వస్తువుల మధ్య కనీస దూరానికి సంబంధించిన పరిమితిని రోచ్ లిమిట్ సూచిస్తుంది. ఒక చిన్న ఖగోళ వస్తువు మరో పెద్ద వస్తువు గురుత్వాకర్షణకు లోను కావద్దొంటే… పెద్ద వస్తువు వ్యాసార్ధంతో పోలిస్తే చిన్న వస్తువు కనీసం రెండున్నర రెట్లు ఎక్కువ దూరంలో ఉండాలి. లేకుంటే చిన్న వస్తువు పెద్దదాని ఆకర్షణకు లోనవుతుంది. ఉదాహరణకు శని గ్రహం చుట్టూ ఉండే వలయాలు. శని గ్రహానికి చెందిన ఓ ఉపగ్రహం మధ్య దూరం శని గ్రహం వ్యాసంతో పోలిస్తే రెండున్నర రెట్ల కంటే తక్కువగా ఉండటంతో అది కాస్తా విచ్ఛిన్నమైపోయింది. ఆ భాగాలే శని గ్రహం చుట్టూ వలయాలుగా తిరుగుతున్నాయేమో అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సిద్ధాంతాన్ని పందొమ్మిదో శతాబ్దానికి చెందిన ఫ్రెంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎడ్వర్డ్ రోచ్ ప్రతిపాదించాడు. అయితే ఇది భూమి చుట్టూ తిరిగే చాలా చిన్న పరిమాణంలో ఉండే కృత్రిమ ఉపగ్రహాలకు వర్తించదు.
ఉన్నట్టా లేనట్టా!
ఖగోళాన్ని దుర్భిణి వేసి గాలిస్తున్నా ప్లానెట్ 9 కనిపించడం లేదు. నెప్ట్యూన్ దాటి వెళ్ల్లిన వాయేజర్ 2, న్యూ హొరైజాన్స్ అనే వ్యోమనౌకలకు… అక్కడ ఓ భారీ గ్రహం ఉన్న ఆనవాళ్లు కనిపించలేదు. అలాగని దాని ఉనికిని కొట్టిపారేద్దామంటే… కైపర్ బెల్టులో ఉన్న వస్తువుల వింత ప్రవర్తనకు కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు ప్లానెట్ 9 కాకుండా ఇతర కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు.
- కైపర్ బెల్టులో లెక్కలేనన్ని మరుగుజ్జు గ్రహాలు, శకలాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటి కక్ష్య ఒకేలా సాగడం యాదృచ్ఛికం కావచ్చు.
- వలయాకారంలో ఎన్నో వస్తువులు ప్రయాణిస్తున్నప్పుడు, వాటిలోని కొన్ని భాగాలు ఆ వలయంతోపాటు సాగుతాయి. అదేమీ అసాధారణం కాదు.
- కైపర్ బెల్టులో నెలకొన్న పరిస్థితులకు కారణం ప్లానెట్ 9 మాత్రమే కాకపోవచ్చు అంటారు కొందరు శాస్త్రవేత్తలు. ఇది ఫలానా చోట ఉంది, ఇంత వైశాల్యంతో ఉంది అని వేసే అంచనాలు నిజం కాకపోవచ్చు అన్నది వారి వాదన. దానికి కారణం మరో గ్రహం కావచ్చు. అది మరింత దగ్గరగానో, చాలా దూరంలోనో ఉండవచ్చు.
- కోజొయ్ మెకానిజం అనే సిద్ధాంతం చెప్పేదేంటంటే… కొన్ని ఖగోళ వస్తువులు పరస్పర ఆకర్షణతో కలిసి తిరిగే అవకాశం ఉంది. దీనికి ప్లానెట్ 9 ప్రభావమే కారణం కానవసరం లేదు.
- ఈ కైపర్ బెల్టులోని వస్తువులను ఆకర్షిస్తున్న ప్లానెట్ 9 అసలు ఓ గ్రహమే కాకపోతే ఇంకేమిటి? అనే ప్రశ్న కూడా వస్తోంది. కృష్ణబిలాలు కూడా తమ చుట్టూ ఉన్న వాతావరణం మీద ఇలాంటి ప్రభావమే చూపిస్తాయి. కృష్ణబిలాలు కాంతిని సైతం మింగేస్తాయి కాబట్టి, వాటిని కనిపెట్టడం అంత తేలిక కాదు. ఎంత ప్రయత్నిస్తున్నా ప్లానెట్ 9 కనిపించకపోవడానికి కారణం ఇదేనేమో అని ఓ అనుమానం!
ప్లానెట్ 10 కూడా ఉంటుందా!
- ప్లానెట్ 9 కైపర్ బెల్టులో భాగంగానో, దానికి సమీపంగానో ఉండవచ్చు. కానీ అక్కడితో సౌర కుటుంబం అంతమవదు. ఈ వలయానికి ఆవల మరో గ్రహం ఉందని కొందరు శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. కైపర్ బెల్ట్ ఒక్కసారిగా అంతమైపోయి, తర్వాత అంతా నిర్మానుష్యంగా ఉండటానికి కారణం… ఆ గ్రహమే అంటున్నారు.
- సౌర కుటుంబం చుట్టూ కైపర్ బెల్ట్ ఉంటే, మరింత దూరంలో ఊర్ట్ క్లౌడ్ అనే మరో వలయం ఉంటుంది. గడ్డకట్టిన వాయువులు, గ్రహశకలాలతో నిండి ఉండే ప్రదేశమిది. కొన్ని తోకచుక్కలు ఆవిర్భవించేది ఇక్కడే. ఇందులో టైకీ అనే ఓ భారీ గ్రహం ఉందని కొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.
- Backyard Worlds పేరుతో నాసా ఖగోళ శాస్త్రం పట్ల ఆసక్తి ఉన్నవారితో రకరకాల ప్రాజెక్టులు చేపడుతున్నది. నెప్ట్యూన్ ఆవల గ్రహాల ఉనికిని కనుక్కోవడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా రకరకాల గ్రహాల
ఉనికి బయటపడుతున్నది కానీ వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ తోచడం లేదు. - మొత్తానికి ప్లానెట్ 9 ఉందనే అనుమానం చాలా బలంగానే ఉంది. అందుకు అనుకూలంగా, ప్రతికూలంగా ఎన్నో సాక్ష్యాలూ ఉన్నాయి. మనిషి అల్పసంతోషి. ఓ కొత్త గ్రహం ఉందని తెలిసినప్పుడు… దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకున్నా ఓ తెలియని సంతోషానికి గురవుతాడు. అందుకే అందరూ ప్లానెట్ 9 ఉనికి పట్ల ఆశగా ఉన్నారు. ఒకవేళ మనం చెప్పుకొన్న చోట, ఊహించిన పరిమాణంలో ప్లానెట్ 9 లేకున్నా… సౌర కుటుంబపు అంచుల లోపల ఏదో ఒక కొత్త గ్రహం దొరికేందుకు మాత్రం చాలా అవకాశాలే ఉన్నాయి. విశ్వానికి ఉన్న ప్రత్యేకతే అది. అందులో రాశికి కొదవ లేదు. రహస్యాలకు అంతం ఉండదు. అంతేకాదు… బ్రహ్మాండాన్ని గమనించినప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు మనం ఎంత సామాన్యులమో కూడా తెలిసొస్తుంది!
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

