చరిత్ర పుటలను కొంచెం వెనక్కి తిప్పి పరికిస్తే… మెతుకుసీమలోని ఓ కుగ్రామం పేరు కొలిచలమ.
ఆ ఊళ్లో ఒక సాధారణ గూనపెంకుల ఇల్లు. ఆ ఇంట్లో ఆ రోజు ఏదో పండుగ జరుగుతున్నది. ఇల్లంతా
బంధువులతో కోలాహలంగా ఉన్నది. ఇక పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఆ ఇంటి కుటుంబసభ్యుడైన
ఒక యువకుడిని సంబోధిస్తూ ‘అయ్యా! పూజకు పూలు తెండి’ అన్నాడు పురోహితుడు.
‘సరే.. ఇప్పుడే తెస్తా’నని చెప్పి పూల కోసం బయటకు వెళ్లాడు ఆ యువకుడు. అటూఇటూ చూశాడు. ఎదురుగా నిండుగా విరబూసిన మోదుగ చెట్టు కనిపించింది. వెంటనే గంపెడు పూలు కోసుకొని పురోహితునికి అందించాడు. ఆ పూలను చూసి తెల్లబోయాడు పురోహితుడు. ‘మోదుగు పూలా! పూజకు పనికిరావే’ అని అన్నాడు. ఆ యువకుడి తెలివితక్కువతనాన్ని చూసి బంధువులందరూ ముసిముసిగా నవ్వుకోసాగారు. అది గమనించిన ఆ యువకుడి భార్య ఎంతో నొచ్చుకుంది. ఆమె గొప్ప విద్వాంసురాలు. చివరాఖరికి ఎవరో తెచ్చిన పూలతో పూజ ముగిసింది. ఆ తర్వాత విందు ప్రారంభమైంది. విందులో తన భర్తకు ప్రత్యేకంగా చారును వడ్డించింది ఆ యువకుడి భార్య. అది రుచి చూసి ‘అయ్యో ఇది చప్పగా ఉంది’ అన్నాడా యువకుడు. దానికి జవాబుగా ఆయన భార్య ఒక శ్లోకం చెప్పింది.
చారు చారు సమాభాతం-
హింగు జీర సమ్మిశ్రితం
లవణ హీ నం న శోభన్తే-
పాలాశ కుసుమం యథాః
ఇంగువ, జీలకర్ర వంటి దినుసులు వేసి చిక్కటి రంగుతో చేసినా, పూజకు పనికిరాని మోదుగ పువ్వు వలె, ఉప్పు లేని చారు తినడానికి పనికిరాదని ఆ శ్లోకానికి అర్థం. అది విన్న బంధువులంతా పకపకా నవ్వసాగారు. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని ఆ యువకుడు తింటున్న అన్నాన్ని విడిచిపెట్టి ఎటో వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ పరిసరాల్లో ఎంత వెతికినా కనిపించలేదు.
కాలచక్ర పరిభ్రమణంలో కొన్నేండ్లు గడిచిపోయాయి. కనిపించకుండాపోయిన ఆ యువకుడు ఒకరోజు ఇంటికి తిరిగివచ్చాడు. అయితే ఇప్పుడాయన ఒక పండితుని వేషధారణలో ఉన్నాడు. తిరిగివచ్చిన భర్తను చూసి ఎంతో ఆనందపడింది అతడి భార్య. తన భర్త ఒక పండితుడయ్యాడని గ్రహించిందామె. ఒకనాడు తన తెలివితక్కువతనానికి పదిమందిచే పరిహసించబడ్డ ఆ యువకుడే, కాశీ నగరానికి వెళ్లి పండిత శుశ్రూష చేసి గొప్ప పండితుడై సంస్కృత భాషలోని మహా కావ్యాలకు అద్భుతమైన వ్యాఖ్యానాలు రాసి, వ్యాఖ్యాన చక్రవర్తి, పదవాక్య ప్రమాణ పారావార పారీణ, మహా మహోపాధ్యాయ బిరుదాలంకృతుడైన కోలాచల మల్లినాథ సూరి.
విద్యా విహీనుడి నుంచి మహా పండితుడిగా మారిన మల్లినాథుడి గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉన్నది. అదేమిటంటే.. ‘పండిత కుటుంబంలో జన్మించినప్పటికీ, మల్లినాథుడికి చదువు అబ్బలేదు. అందువల్ల కుటుంబసభ్యులు ఆయనను పశువుల కాపరిగా వాడుకున్నారు. అయితే మల్లినాథుని స్వగ్రామమైన కొలిచలమ సమీపంలో ఉన్న తిరుమల్లయ్య గుట్టపై ఒక యోగి ఉన్నాడని తెలుసుకొన్న మల్లినాథుడు ప్రతిరోజు ఆ యోగిని దర్శించి, సేవలు చేసేవాడట. అందుకు సంతసించిన ఆ యోగి తన అవసాన దశలో మల్లినాథునికి మంత్రోపదేశం చేసి ఆయన నాలుకపై బీజాక్షరాలు రాశాడట. దాంతో ఆయనకు వన దుర్గాదేవి సాక్షాత్కారం లభించిందట. తర్వాత అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడి పండితుల వద్ద శిష్యరికంతో సకల శాస్ర్తాలు నేర్చుకొని తిరిగి స్వగ్రామానికి వచ్చాడట. ఆ తర్వాత సంస్కృత మహా కావ్యాలకు వ్యాఖ్యానాలు రచించి వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరిగా పేరుగాంచాడట’. సూరి అనగా పండితుడని అర్థం.
ఇక, ప్రచారంలో ఉన్న గాథల విషయం ఎట్లున్నా, మల్లినాథుడికి మొదట విద్యాగంధం అబ్బలేదు. కానీ, కాశీపుర పండిత శిష్యరికంతో ఒక గొప్ప పండితుడయ్యాడన్నది ఈ రెండు గాథలు వెలువరించే సత్యం.
మల్లినాథుడు క్రీ.శ.1350 నుంచి 1430 మధ్యకాలంలో జీవించాడని చరిత్రకారుల అభిప్రాయం. మొట్టమొదట ఆయనకు కాకతీయ రాజుల ఆదరణ లభించిందని, కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఆయనకు రాచకొండ రాజుల ఆదరణ లభించిందని చెప్తారు. రాచకొండ రాజు సింగ భూపాలుడు ఆయనకు మహా మహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరించాడు. అంతేగాక విజయనగర సామ్రాజ్య రాజైన ప్రౌఢ దేవరాయల ఆదరణ కూడా ఆయనకు లభించింది. ఆయన పుట్టి పెరిగిన గ్రామం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని ఒకప్పటి కొలిచలమ. ఆ గ్రామం కాలాంతరంలో కోలాచలంగా, తర్వాత ప్రస్తుత కొల్చారంగా మారింది. ఇది మెదక్ నగర కేంద్రానికి 15 కి.మీ. దూరంలో ఉన్నది.
వ్యాఖ్యాన చక్రవర్తిగా బిరుదునందిన మల్లినాథుడు మహా కావ్యాలుగా పిలుచుకునే కాళిదాసు రచనలైన మేఘసందేశం, కుమార సంభవం, రఘు వంశాలకు సంజీవిని అని పిలువబడే వ్యాఖ్యానాలను రచించాడు. తర్వాత మహాకవి భారవి రచన కిరాతార్జునీయానికి ఘంటాపథమని, మాఘుని రచన శిశుపాల వధకు సర్వంకష పేరిట, శ్రీహర్ష చక్రవర్తి రచన నైషధీయానికి జీవాతువుగా, భట్టి కావ్యానికి సర్వపథీన వ్యాఖ్యానాలు రాసి ఖ్యాతిగాంచాడు. అంతేగాక ఒడిశాకు చెందిన విద్యాధరుని అలంకార రచన ఏకావళి శాస్త్రంపై తరళ, న్యాయశాస్ర్తానికి సంబంధించిన వరదరాజు రచన తార్కిక రక్ష టీకాపై నిష్కంటక పేరిట రచనలు చేశాడు.
ఇవేగాక రఘువీర చరితం, వైశ్య వంశ సుధాకరం, ఉదార కావ్యం, భక్తి రహస్యం, నక్షత్ర పాతాధ్యయం లాంటి సృజనాత్మక రచనలను కూడా చేశాడు. ఆయన వ్యాఖ్యానాల్లోని విశిష్ఠత గురించి ‘ఇహాన్వయ ముఖేనైవ- సర్వం వ్యాఖ్యాయతే మయా నమూలం లిఖ్యతే-కించిన్నా నపేక్షితముచ్యతే’ (మూలంలో లేనిది చెప్పను- అనవసరమైనదేదీ చెప్పను) అని స్వయంగా ప్రకటించుకున్నాడు. ముఖ్యంగా కువ్యాఖ్యల విష ప్రభావం వల్ల మూల కావ్యాలకు తీరని నష్టం జరిగిందని, దాన్ని సరిదిద్దేందుకే మల్లినాథుడు సువ్యాఖ్యానాలతో రచనలు సాగించాడని పండితుల అభిప్రాయం.
ఇన్ని రచనలు చేసిన మల్లినాథుడు దాదాపు ఎనభై ఏండ్లు జీవించాడు. జీవిత చరమాంకంలో కళ్లు తెరిచే ఓపిక లేకపోయినా కింది రెప్పకు తాడు కట్టుకొని, పై రెప్పకు కూడా తలపై నుంచి మరొక తాడు కట్టుకొని, దీపం ముందు కూర్చొని కావ్యాలు
చదువుతూ, వ్యాఖ్యానాలు రాసేవాడని చెప్తారు. మల్లినాథుడి వ్యాఖ్యానాలు లేకపోతే సామాన్య ప్రజలకు, సంస్కృత కావ్యాలు అర్థమయ్యేవి కాదన్నది వాస్తవం.
తెలంగాణ సాహితీ, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచి తెలంగాణ ఖ్యాతిని నలుమూలలా చాటిన మహా పండితుడు, మల్లినాథ సూరికి తెలంగాణలో ఉమ్మడి పాలకుల కాలంలో తగిన గౌరవం లభించలేదు. కొల్చారం గ్రామంలో ఆ మహనీయుడు పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పటికీ ఉన్నదని, ఆ ఇంట్లో ఆయన స్మారకార్థం ఒక వేద పాఠశాలను ఏర్పాటు చేయాలని తలచి 1981లో అప్పటి ప్రభుత్వం ఆ ఇంటిని కొనుగోలు చేసిందని కానీ, వేద పాఠశాల కార్యరూపం దాల్చలేదని తెలుస్తున్నది. అయితే మల్లినాథుని స్వగ్రామమైన కొల్చారంలో మల్లినాథసూరి సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని 2023 మే 14న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం, అందుకు తగిన ఆదేశాలు జారీ చేయడం సాహితీ ప్రియులందరికీ ఆనందదాయకం. ఇక ఇప్పుడు ఏర్పడిన తెలంగాణ కొత్త ప్రభుత్వ సారథ్యంలోనైనా పండితలోకం ఎన్నాళ్లుగానో కలలుగంటున్న ఈ సంస్కృత విశ్వవిద్యాలయం త్వరలో రూపుదిద్దుకుంటుందని ఆశిద్దాం.
బసవరాజు నరేందర్‌రావు
9908516549