‘నగృహం బంధనాగారం బంధనే నచ కారణమ్
మనసాయో వినిర్ముక్తో గృహస్థోపి విముచ్యతే!’
ఇల్లు అనేది కారాగారం కాదు, అది బంధన కారణం కూడా కాదు. మనసే అన్నిటికీ కారణం. అది బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలోనే ఉండి మోక్షాన్ని సాధించవచ్చు… ఈ విషయాన్ని శ్రీ దేవీ భాగవతం మనిషికి బోధిస్తుంది. అష్టాదశ పురాణాల్లో అద్వితీయమైన దేవీ భాగవతం ఉపాసనకు జ్ఞానాన్ని సమన్వయించి, ఒకవైపు ఐహిక ప్రయోజనాలు సాధిస్తూనే, పారమార్థిక సాధనకు మార్గాన్ని అన్వేషించేవారికి దారిచూపుతుంది. ఇందులో 11వ అధ్యాయం మనిషి పాటించాల్సిన నిత్య విధులను వివరించింది. శారీరక, మానసిక వ్యవస్థలను శుభ్రపరచుకుని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించే విధానాలెన్నో తెలియజేసింది.
సదాచారం: లోకంలో ద్రవ్యజ్ఞానం, దివ్యజ్ఞానాలని రెండు రకాల విజ్ఞతలున్నాయి. లౌకిక విషయాలపై పరిజ్ఞానాన్ని ద్రవ్యజ్ఞానం అంటారు. పారమార్థిక ప్రయోజనాలను సాధించి పెట్టేది, దైవాన్ని పరిచయం చేసేది దివ్యజ్ఞానం. ఈ రెండిటినీ సమపాళ్లలో సమన్వయం చేసుకున్నవారి జీవితాలు ధన్యతను పొందుతాయి.
శౌచవిధి: వేదవేదాంగాలు వల్లించినా, ఆచారహీనుడు పవిత్రుడు కాలేడు. మనిషి ముందు తన ఒంటి పరిశుభ్రతను, ఇంటి స్వచ్ఛతను పాటించాలి. అప్పుడే గృహస్థు ధర్మ నిర్వహణకు అర్హత లభిస్తుంది.
భూతశుద్ధి: సుఖసంతోషాలు డబ్బులో ఉండవు. ప్రకృతితో కలిసి ప్రయాణించడం, ప్రకృతిని ఆరాధించడంలో ఆనందం దాగుంది. ప్రకృతి స్వరూపాలైన పంచభూతాలను ఆదరిస్తూ, పూజిస్తూ ఉండమని దీని సందేశం. ఇదే అధ్యాయంలో రుద్రాక్షధారణ విధిని, శిరోవ్రత విధానాన్ని, గాయత్రీ ఉపాసన, విభూతిధారణ ఫలితాలను వివరణ ఉంది. అంటే శారీరక పరిశుభ్రత, మానసిక ప్రక్షాళన, దరిమిలా ఆధ్యాత్మిక జీవనం ద్వారా ఉత్తమ గతులను సాధించే మార్గాలను దేవీభాగవతం ద్వారా తెలుసుకోవచ్చు.