గుమ్మడిదల,ఫిబ్రవరి26: సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం కాన్రాజ్ కుంటలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను కబ్జా చేయడానికి ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో కొంత మంది రియల్ వ్యాపారులు యత్నించారు. అలుగును, తూమును, కట్టను జేసీబీ యంత్రంతో తొలిగించి కుంటలోని నీటిని తోడేశారు. కబ్జా విషయం తెలుసుకున్న మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు డి.వీరస్వామి, పీఏసీఎస్ మాజీ డైరెక్టన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మత్స్యకారులు కాన్రాజ్ కుంట వద్ద ఆందోళన చేశారు. అంతేకాకుండా ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా కబ్జాకు గురైతున్నదని ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. మత్స్యకారుల ఫిర్యాదులు, ఒత్తిడితో ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇరిగేషన్ డీఈ రామస్వామి, ఏఈ చక్రవర్తి కాన్రాజ్ కుంటను సందర్శించి పలకలతో నిర్మించిన గోడను జేసీబీతో తొలిగించారు. అలుగు, తూము,కట్ట వద్ద తీసిన కాలువను పూడ్చివేసి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా కుంటను కబ్జా చేయాలని ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు పెడుతామని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు.