కట్టంగూర్, జూలై 25 : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్ మంజుల సూర్యవర్ అన్నారు. శనివారం కట్టంగూర్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ చట్ట విరుద్ధమని, చిన్నారులను పనులకు పంపిన తల్లిదండ్రులు, పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. బాల నేరస్తుల విషయంలో జువైనైల్ కోర్టులు ప్రత్యేకంగా పని చేస్తాయని, నేరాలకు దారితీసే పరిస్థితులను కూడా అర్థం చేసుకునే విధంగా చట్టాలు ఉన్నాయని వివరించారు. చిన్నారులను కిడ్నాప్ చేసి బలవంతంగా అడుక్కునేలా చేయడం, మానవ అక్రమ రవాణాకు గురిచేయడం వంటి ఘటనలు ఆందోళనకరమని పేర్కొన్నారు. బాల్య వివాహాలు నేరమని, అలాంటి వివాహాలు జరిపితే సంబంధిత వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
బాల్య వివాహాలు లేదా చిన్నారులపై దాడులు, వేధింపులు వంటి ఘటనలు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పోక్సో చట్టం కింద చిన్నారులపై లైంగిక నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయని, నేరం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని, తల్లిదండ్రులకు కూడా వాటి గురించి తెలియజేస్తూ విద్యాభ్యాసంలో రాణించాలని పిలుపునిచ్చారు. ఏఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆపద సమయంలో వెంటనే 100కు కాల్ చేస్తే పోలీసులు తక్షణ సహాయం అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శేరి చత్రపతి, నోముల గోవిందరాజులు, పులిపాపయ్య, బల్లెం విజయ్‌కుమార్, ఎంఈఓ అంబటి అంజయ్య, ఎస్ఓ నీలంబరి, పోలీసు సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్ జయరాజ్, లీగల్ సర్వీస్ సిబ్బంది సింగం సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.