ఎమ్మెల్యేగా దానం నాగేందర్ అనర్హుడని సభాపతికి, సభానాయకుడైన ముఖ్యమంత్రికి తెలియదా? దానం మాత్రమే కాదు, పార్టీ ఫిరాయించిన పది మందీ అనర్హులు కాదా? ఇక వీరిని పవిత్రులు, రాజకీయ పతివ్రతలు, పతితలు, పురుషపుంగవులు అని ఎవరైనా అంటే కూడా మనం వినక తప్పదు. 2023 డిసెంబర్ 3న ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఏప్రిల్ 23న కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం పదో షెడ్యూల్లోని 2(1)(ఏ)తోపాటు ఆర్టికల్ 191(2) ప్రకారం ఆ రోజే ఎమ్మెల్యే పదవికి ఆయన అనర్హుడు. ఆ కేసు వచ్చిన మరునాడే చెప్పవలసిన బహిరంగ రాజ్యాంగ వ్యవహారం. అది అధికార రహస్యం కాదు. నేరం జరిగినప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా బయటపడ్డ పచ్చి నిజం.
పార్టీ ఫిరాయించిన వాళ్లు ఎమ్మెల్యేలుగా అనర్హులని చెప్పడం కోసం మాటిమాటికీ రాజ్యాంగ పుస్తకం చూపించాల్సిన అవసరంలేదు. రాజ్యాంగం మహాఘనత వహించిన స్పీకర్‌కు న్యాయమూర్తి వలె (వలె అంటే ఆ విధంగా క్వాజీ జ్యుడీషియల్) అధికారాలు ఇచ్చింది. ఈ నెల 18న హైకోర్టు తీర్పు ఇవ్వగానే దానం స్పందిస్తూ సుప్రీంకోర్టుకు అప్పీలు చేయబోనని అన్నారు. కానీ శనివారం ఎస్ఎల్పీ దాఖలు చేశారు. దీనిని సుప్రీంకోర్టు అనుమతిస్తుందా లేదా చూడాలి. మరోవైపు హైకోర్టు తీర్పు ఇచ్చిన టైమ్‌లో దానం తరఫు న్యాయవాది కల్పించుకుని సుప్రీంకోర్టులో సవాల్ చేసే వరకు తీర్పు అమలును సస్పెన్షన్‌లో పెట్టాలని కోరారు. దీనిపై పిటిషనర్ పాడి కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఇప్పటికే పార్టీ ఫిరాయించిన దానం రెండున్నరేండ్లుగా అన్యాయంగా పదవిని అనుభవించారని గుర్తుచేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కరోజు కూడా పదవిలో కొనసాగడానికి వీల్లేదని, అర్హత కూడా లేదనే పిటిషనర్ వాదనను హైకోర్టు ధర్మాసనం ఆమోదించింది. అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం ప్రకటించింది. తీర్పు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి, శాసనసభ కార్యదర్శికి పంపాలంటూ హైకోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఖైరతాబా ద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు స్పష్టంచేసిం ది. అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ మార్చి 11న స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఇక దానం మాత్రమే కాదు, పార్టీ ఫిరాయించిన ఘనత వహించిన ప్రతీ ఎమ్మెల్యే సమర్థించుకుంటూనే మాట్లాడుతారు. కానీ వాళ్లు అనర్హులనే విషయం అందరికీ తెలుసు. స్పీకర్‌కు, సీఎంకి కూడా తెలుసు. ఈ బహిరంగమైన అబద్ధాన్ని రహస్యం అనడానికి వీల్లేదు. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నుంచి పోటీ చేయడం ద్వారా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంటే వేరే సాక్ష్యం అవసరమే లేదు. ఈ విషయం స్పీకర్‌కు తెలియలేదా? ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం 91 పేజీల తీర్పు ద్వారా రాజ్యాంగ పాఠాలు చెప్పక తప్పలేదు.
దానం నాగేందర్‌పై అనర్హత వేటుకు దారితీసిన పరిణామాలను పరిశీలిద్దాం. పార్టీ మారిన దానంపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి 2024 మార్చి 18న, బీజేపీ శానససభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 2024 జూలై 1న స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్, ఈ ఏడాది మార్చి 11న వాటిని కొట్టివేశారు. బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు తేల్చడానికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడం మాత్రమే సరిపోదని స్పీకర్ తీర్పులో పేర్కొన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని, ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టు నిరూపించే సభ్యత్వ ఆధారాలు లేవని, బీఆర్ఎస్ కూడా ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలూ తీసుకోలేదని వెల్లడించారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విడివిడిగా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం ఆగస్టు 21న తీర్పును రిజర్వ్ చేసింది. స్పీకర్ పేర్కొన్న కారణాలన్నీ హైకోర్టులో నిలబడలేదు. పదో షెడ్యూల్ కింద అనర్హతను నిర్ణయించేటప్పుడు అసెంబ్లీలో సభ్యుడి ప్రవర్తన, ఓటింగ్‌కు మాత్రమే పరిమితం కావాల్సిన అవసరంలేదని హైకోర్టు వివరించింది.
దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం కీలకమైన ‘సభ వెలుపలి చర్య’గా హైకోర్టు పరిగణించింది. ఈ అంశం స్పీకర్‌కు తెలియలేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం అంటే బీఆర్ఎస్తో అనుబంధాన్ని వదులుకున్నట్టు ఆధారాలుగా సరిపోతాయని అర్థం కాలేదా?
ఫిరాయింపుల గురించి ఇప్పుడు హైకోర్టు తీర్పు ద్వారా మాత్రమే తెలిసిన విషయం కాదు. ఇటువంటి అంశాల పట్ల సుప్రీంకోర్టు, హైకోర్టులు పదే పదే చెప్తూనే ఉన్నాయి. శాసనసభ వెలుపల జరిగిన చర్యల ఆధారంగా కూడా పదో షెడ్యూల్ కింద అనర్హతను నిర్ధారించవచ్చని డాక్టర్ మహాచంద్రప్రసాద్సింగ్ వర్సెస్ బిహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు గతంలో రవి.ఎస్.నాయక్, ఆర్.భూపతిరెడ్డి, కొండా మురళీధర్‌రావు, రాజేంద్రసింగ్ రాణా తదితర కేసుల్లోనూ సభ వెలుపల ప్రవర్తన ఆధారంగా పదో షెడ్యూల్ కింద అనర్హత వేటు తీర్పులను వెలువరించింది. ఆ తీర్పులను స్పీకర్లు ఎందుకు పరిగణలోకి తీసుకోరు? భిన్నమైన తీర్పులు ఎందుకు ఇస్తారు? పోనీ, దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది కూడా నిజం కాదా? అందులలో స్పష్టత లేదా? పదో షెడ్యూల్ 2 (1) (ఏ) కింద అనర్హతను నిర్ణయించవచ్చని ధర్మాసనం చాలా స్పష్టంగా చాలాసార్లు పేర్కొన్నది.
హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధి, స్పీకర్ అధికారాలు, న్యాయ సమీక్ష పరిధి, సాక్ష్యాల ప్రాముఖ్యత, అనర్హత అమల్లోకి వచ్చే తేదీ తదితర అంశాలను పేర్కొన్నది. వీటిని విశ్లేషిస్తే రాజ్యాంగ ఆదేశాల ఉల్లంఘన, దురుద్దేశం, సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన, చట్టపరంగా నిలబడని నిర్ణయం వంటి అంశాలపై ఆర్టికల్ 226 కింద జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు పూర్తిగా ఉంటుంది. ఇదీ కొత్తమాట కాదు. స్పీకర్ పదో షెడ్యూల్ కింద వ్యవహరించేటప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ పదవిలో విధులు నిర్వహిస్తార కాబట్టి ట్రిబ్యునల్, స్పీకర్ నిర్ణయాలను న్యాయ సమీక్ష చేయవచ్చు. అటువంటి బాధ్యతను స్పీకర్ కూడా అర్థం చేసుకోవాలి. దానంపై బీఆర్ఎస్ క్రమశిక్షణ చర్య తీసుకోకపోవడం, ఆయనను పార్టీ సభ్యుడిగా కొనసాగించడం తదితర అంశాలను స్పీకర్ వరుసగా చేసిన తప్పులు, రాజ్యాంగ వ్యతిరేకపు పనులు అవుతాయని హైకోర్టు వివరించింది. స్పీకర్‌కు ఆ విషయం తెలియదా? లేకపోతే సీఎం ప్రభావానికి లోనై నిష్పాక్షిక నిర్ణయం తీసుకోలేదా? ఇందుకు బాధ్యత వహిస్తూ సభాపతి, సభా నాయకుడైన సీఎం ఇద్దరూ రాజీనామా చేయాలి.
పదో షెడ్యూల్లోని 2(1)(బీ) కింద అనర్హత అనేది ఏర్పడింది. రాజకీయ పార్టీ విప్‌నకు విరుద్ధంగా సభలో ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండడం వంటి పరిస్థితులకు సంబంధించిన 2(1)(ఏ)లో పార్టీ క్షమాపణకు అవకాశం ఉంటుంది. కానీ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న అంశాన్ని పరిశీలించే 2(1)(ఏ)లో అదే సూత్రాన్ని వర్తింపజేయలేమని, సాధ్యంకాదని స్పీకర్‌కు తెలియలేదా? దానం నాగేందర్ బీఆర్ఎస్ రికార్డుల్లో కొనసాగడం లేదా పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకోకపోవడం వల్ల 2024 ఏప్రిల్ 23న జరిగిన అనర్హత చర్య చెరిగిపోదు కదా. ఈ విషయం హైకోర్టు చెప్తే తప్ప అర్థం కాదా?
ఇక్కడ మరో టెక్నికల్ పాయింట్ ఉన్నది. అనర్హత పిటిషన్లో ప్రతీ అనుబంధ పత్రాన్ని సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ధ్రువీకరించలేదని స్పీకర్ అనడం తప్పు. స్పీకర్ ఇచ్చిన ఆ ఉత్తర్వు పనికిరాదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ కేసులోనే కాదు, ఎన్నో కేసుల్లోనూ ఇలాగే జరిగింది. రవి.ఎస్.నాయక్, డాక్టర్ మహాచంద్రప్రసాద్సింగ్ కేసుల్లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. 1986 నాటి డిస్క్వాలిఫికేషన్ రూల్స్ ‘ప్రక్రియాపరమైనవి’ మాత్రమేనని రాజ్యాంగ ప్రకారంగా లేవని, తప్పనిసరి నిబంధనలుగా చదివితే పదో షెడ్యూల్ ఉద్దేశమే దెబ్బతింటుందని హైకోర్టు వివరించింది. కాబట్టి రూల్ 6(6), 6(7)లోని ధ్రువీకరణ లోపాలను ఆధారంగా చేసుకుని అనర్హత పిటిషన్‌ను కొట్టివేయడం చట్టబద్ధం కాదని ఎన్నోసార్లు హైకోర్టు పేర్కొన్నది.
ఇప్పటివరకు శాసనసభ పదవీకాలంలో దాదాపు మూడేండ్లు గడిచిపోయింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2025 జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ స్పీకర్ చేసిన ఆలస్యానికి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు జవాబుదారీ? హైకోర్టు తీర్పులో కీలకమైన అంశం ఏందంటే, కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన 2024 ఏప్రిల్ 23 తేదీనే దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు పరిగణించాలని ప్రకటించింది. సుభాష్ దేశాయ్, శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా అనర్హతకు దారితీసిన చర్య జరిగిన రోజు నుంచే అనర్హత నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది.
2024 ఏప్రిల్ 23 నుంచి దానం నాగేందర్ శాసనసభ సభ్యుడిగా అనర్హుడే అనీ, అప్పట్నుంచే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించింది. అంటే కాంగ్రెస్ బీ-ఫారం తీసుకుని నామినేషన్ వేసినప్పటి నుంచి దానం నాగేందర్ అనర్హత అమల్లోకి వస్తుంది. అంటే అప్పట్నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చిన దాదాపు ఏడాదిన్నర కాలానికి సంబంధించిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలి. అందుకు ఇన్నాళ్లూ ఇచ్చిన జీతభత్యాలు ఒక్కోపైసా ప్రభుత్వానికి వాపస్ ఇచ్చితీరాలి. అటువంటి తీర్పు కూడా కావాలని పిటిషిన్ వేయాలి. అప్పుడు తీర్పులు ఇచ్చిన స్పీకర్, వారికి కారకులైన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కూడా రాజీనామా చేసినా తక్కువనే అవుతుంది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎం.సంజయ్‌కుమార్‌పై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఫిరాయించే వాళ్లు పలు తప్పులు చేశారు. అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణను ఇప్పటికే అక్టోబర్ 6కి వాయిదా వేసింది.
లోక్‌సభ ఎన్నికల కోసం సమర్పించిన ఫారం- 26లోనే దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొన్నారని, ఫారం-7ఏలో కూడా కాంగ్రెస్ పార్టీ, ‘హస్తం’ గుర్తుతోపాటు దానం నాగేందర్ పేరు కూడా ఉన్నదని హైకోర్టు తీర్పులో వివరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫారం- 26, ఎన్నికైన సభ్యుల గెజిట్ నోటిఫికేషన్, 2024 ఏప్రిల్ 23న లోక్‌సభ ఎన్నికల కోసం సమర్పించిన ఫారం- 26, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థుల తుది జాబితా, కాంగ్రెస్ అభ్యర్థిగా పొందిన బీ-ఫారం మొదలైనవన్నీ పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్టు ఆధారాలే అని అందరికీ తెలిసిన అంశాలు. వీటి గురించి గౌరవ హైకోర్టుకు 91 పేజీల తీర్పులో వివరించింది. ఇంకా మరికొన్ని సాక్ష్యాలు కూడా పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారరు. 2024 మార్చి 15న దానం కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, సంబంధిత వార్తలు సాక్ష్యమని చెప్పారు. సోషల్‌మీడియా పోస్టుల ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. అసలు వాటి అవసరం కూడా లేదు. కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన నాడే దానం ఎమ్మెల్యేగా అనర్హుడు. ఇది స్పీకర్‌కు, ముఖ్యమంత్రికి తెలియదా? తెలిసీ ఎందుకు వేటు వేయలేదనేది ఆలోచించాల్సిన అంశాలు.
(వ్యాసకర్త: న్యాయ నిపుణుడు)
2023 అసెంబ్లీ ఎన్నికల ఫారం- 26, ఎన్నికైన సభ్యుల గెజిట్ నోటిఫికేషన్, 2024 ఏప్రిల్ 23న లోక్‌సభ ఎన్నికల కోసం సమర్పించిన ఫారం- 26, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థుల తుది జాబితా, పోటీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పొందిన బీ-ఫారం మొదలైనవన్నీ పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్టు ఆధారాలే అంటే అందరికీ తెలిసిన అంశాలు. వీటి గురించి రాయడానికి హైకోర్టుకు 91 పేజీలు అవసరమైంది.
మాడభూషి శ్రీధర్