హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : మేడిగడ్డలో నీళ్లున్నా ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తుందోననే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఎత్తిపోయకుండా ప్రాజెక్టును పడావు పెడుతున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎల్‌నినో వల్ల వచ్చిన కరువు కంటే సర్కార్ నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువే ఎక్కువని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి, విద్యుత్తు కష్టాలపై ప్రభుత్వం చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. భేషజాలు పకనపెట్టి కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి గోదావరి నీళ్లు ఎత్తాలని, యాదాద్రి, భద్రాద్రిలో విద్యుత్తు ఉత్పత్తి స్టార్ట్ చేసి రైతులకు 24గంటల కరెంటివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎల్‌నినోపై నెట్టేయడం బాధ్యతారాహిత్యం
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్‌రెడ్డి తెచ్చిన కరువు అంటూ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. నీళ్లు, కరెంటు.. ఈ రెండు విషయాల్లోనూ ప్రభుత్వం తన తప్పిదాలను ఎల్‌నినోపై నెట్టి చేతులెత్తేయడం బాధ్యతారాహిత్యమని ధ్వజమెత్తారు. కృష్ణా బేసిన్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా 2024-25లో 286 టీఎంసీల నీటిని వాడామని మంత్రి ఉత్తమ్ చెబుతున్నదంతా పచ్చి అబద్ధమని తేల్చిచెప్పారు.
శ్రీశైలం నుంచి ఈ ఏడాది తెలంగాణ 84 టీఎంసీలు వాడుకున్నదని మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు ఆడారు. 84టీఎంసీలు వాడితే ఆ నీళ్లు ఎటుపోయాయి? ఏ రిజర్వాయర్ నింపారు? ఏ పొలాలకు ఇచ్చారు? నిజానికి శ్రీశైలం మీద మనకున్నది కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలు మాత్రమే. కేసీఆర్‌కు పేరొస్తుందని పాలమూరు మోటర్లను దాదాపు మూడేండ్ల్లు పడావు పెట్టారు. కల్వకుర్తి ద్వారా ఎత్తింది 8టీఎంసీలే.
-హరీశ్‌రావు
నీటి కోటాను వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం
మన తాత్కాలిక వాటా 34శాతం కాగా ఆ కోటా మేరకు కూడా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. 2014 నుంచి 2017 వరకు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ 31శాతం, 35.8శాతం, 45శాతం దాకా వాడుకుంటే.. 2024-25లో ఆంధ్రప్రదేశ్ 71.5% వాడుకున్నదని, తెలంగాణ వాడింది కేవలం 28.4శాతమేనని వివరించారు. 2025-26 సంవత్సరంలో మరీ దారుణంగా 25శాతం జలాలను మాత్రమే వాడుకున్నదని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం ఎల్‌నినో కరువు కాలంలోనూ ఏపీ 83 టీఎంసీలు వాడుకుంటే, హైదరాబాద్ తాగునీటితో కలిపి తెలంగాణ వాడింది కేవలం 43టీఎంసీలేనని చెప్పారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద శ్రీశైలంలో నీళ్లున్నా ఐదు మోటర్లకుగాను ఒకటి, రెండు మోటర్లే, అది కూడా రోజుకు 10 గంటలే నడుపుతున్నారని మండిపడ్డారు. కరెంట్ లేక మోటర్లు నడుపక, కేసీఆర్ సాగులోకి తీసుకొచ్చిన 3.16లక్షల ఎకరాల ఆయకట్టును ఆగం చేస్తున్నారని వాపోయారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల కింద దాదాపు 3లక్షల ఎకరాల పంట ఎండిపోయే ప్రమాదకర స్థితిలో ఉన్నదని, కనీసం కర్ణాటకలోని అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగి ఆల్మట్టి నుంచి ఒక నెల రోజులు నీళ్లు తెప్పించి పంటలు కాపాడే సోయి తెలంగాణ కాంగ్రెస్‌కు లేదని నిప్పులు చెరిగారు.
స్విచ్ ఆన్ చేస్తే 2టీఎంసీలు ఎత్తిపోయవచ్చు
గోదావరి బేసిన్ విషయానికొస్తే మరీ దారుణమని హరీశ్‌రావు మండిపడ్డారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్‌లపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ వాటర్ అండ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్) ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ తమ వద్ద ఉన్నదని వెల్లడించారు. బరాజ్‌లపై రీబౌండ్ హామర్ టెస్ట్, జీపీఆర్, అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ(యూపీవీ) తదితర 3 రకాల టెస్టులు చేశారని వివరించారు. సుందిళ్ల, అన్నారంలో 100శాతం నాణ్యత బాగున్నదని, మేడిగడ్డలోనూ కుంగిన బ్లాక్-7 మినహా, మిగతా ఆరు బ్లాకులు సేఫ్ అని తేల్చిందని తెలిపారు.
నీటి నిర్వహణ, నిల్వ, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని, నీళ్లు ఎత్తుకోవచ్చని ఎన్డీఎస్ఏనే హైకోర్టులో అఫిడవిట్ వేసిందని, విశ్రాంత ఇంజినీర్లు కూడా మేడిగడ్డ గేట్లు తెరిచి ఉంచి ప్రవాహం ద్వారా నీళ్లు ఎత్తొచ్చని ప్రభుత్వానికే లేఖ రాశారని గుర్తుచేశారు. అయినప్పటికీ సర్కార్ ఎందుకు మోటర్లు ఆన్ చేయడం లేదని నిలదీశారు. ‘ఈ రోజు, ఈ నిమిషానికి కూడా మేడిగడ్డ బరాజ్ వద్ద 46,990 క్యూసెకుల ప్రవాహం, రోజుకు 4టీఎంసీలకు పైగా వృథాగా దిగువకు పోతున్నదని తెలిపారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నడుపడానికి కావాల్సిన కనీస మట్టం 93.5మీటర్లే. ఇప్పటికిప్పుడు మోటర్లు స్విచాన్ చేస్తే రోజుకు 2టీఎంసీలు ఎల్లంపల్లిలో ఎత్తుకోవచ్చు.

కరెంటు కోతలతో రైతుల గోస..
కాంగ్రెస్ సర్కార్ రైతులను కరెంట్ కోతలతో గోస పెడుతున్నదని ధ్వజమెత్తారు. ఆ వైఫల్యాలన్నింటినీ అసెంబ్లీలో నిలదీస్తామనే భయంతోనే తమ గొంతు నొకడానికి బీఆర్ఎస్ సభ్యులందరినీ సస్పెండ్ చేశారని విమర్శించారు. రైతులు తమ పంటలను కాపాడుకొనేందుకు రోజుకు రూ.1,500 ఖర్చు పెట్టి డీజిల్ జనరేటర్లు పెట్టుకోవాల్సిన దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ లెకల ప్రకారమే 4వేల మెగావాట్లు ఉత్పత్తి కావాల్సిన యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో బొగ్గు లేక కేవలం 1,500 మెగావాట్లే ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. 40వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని చెబుతున్న ప్రభుత్వం, కరెంట్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయిందో సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎల్‌నినో వస్తుందని ఆరు నెలల ముందే తెలిసినప్పుడు.. బొగ్గు నిల్వలు పెంచుకొని పవర్ ప్లాంట్లను ఎందుకు సిద్ధం చేసుకోలేదని నిలదీశారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం
కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ దుష్ప్రచారం చేస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. రూ.38,500 కోట్ల ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లకు ఎలా పెరిగిందంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో అబద్ధాల పరంపర కొనసాగించారని ధ్వజమెత్తారు. ‘నాడు మీరు పెట్టిన ప్రాణహిత-చేవెళ్లలో ఆయకట్టు 16 లక్షల ఎకరాలైతే, కాళేశ్వరంలో 37లక్షల ఎకరాల ఆయకట్టు అని.. ప్రాణహిత కెపాసిటీ 16 టీఎంసీలు.. కాళేశ్వరంలో 141 టీఎంసీలు.. అప్పటి నీటి వినియోగం 160 టీఎంసీలు. ఇప్పుడు 240 టీఎంసీలు.. పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 3 టీఎంసీలకు పెరిగింది.. భూసేకరణ కింద ఎకరాకు రూ.2 లక్షలు ఇస్తే మేము రూ.13 లక్షలు ఇచ్చినం’ అని గుర్తుచేశారు.
కొడంగల్ లిఫ్ట్ ఖర్చు రూ.6,825 కోట్లా?
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ అంచనా వ్యయాన్ని ఐదింతలు పెంచడంలోని అంతర్యమేందని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేవలం 25శాతం పనులు కూడా కాకముందే 5 రెట్లు పెరిగితే ఇక పూర్తయ్యే నాటికి ఎన్నింతలు పెంచుతారో ప్రజలు అర్థంచేసుకోవాలని కోరారు. ‘కొడంగల్ ప్రాజెక్టుకు మొదట జీవో 69 ద్వారా రూ.1,450 కోట్లు కేటాయించిన్రు.. మొదటిసారి అంచనాలు సవరించి రూ.2,945 కోట్లు.. రెండోసారి రూ.4,725 కోట్లు.. మూడోసారి రూ.6,825 కోట్లు.. కేవలం లక్ష ఎకరాలకు నీరందించే కొడంగల్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,450 కోట్ల నుంచి 6,825 కోట్లకు ఐదు రెట్లు పెరిగింది.. కానీ ఇప్పటికీ 25శాతం పనులు కూడా పూర్తి కాలేదు.. మరి ప్రాజెక్టు వ్యయం ఇంతగా ఎందుకు పెరిగిందో మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పాలి?’ అని ప్రశ్నించారు.
మేడిగడ్డ వద్ద ఇప్పటికీ 46,990 క్యూసెక్కుల వరద వస్తున్నది. కన్నెపల్లి వద్ద స్విచ్ ఆన్ చేస్తే రెండు టీఎంసీలు ఎత్తిపోయవచ్చు. తెలంగాణలో బారానా వంతు ప్రజానీకానికి నీళ్లివ్వొచ్చు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లున్నా.. కానీ కేసీఆర్‌కు ఎక్కడ పేరొస్తుందోనని ప్రభుత్వం ప్రాజెక్టులను పడావుబెట్టింది. నీళ్లను ఎత్తిపోయకుండా రాష్ర్టాన్ని కరువు ముంగిట నిలబెట్టింది. ఇప్పుడు ఎల్‌నినోపై నెపాన్ని నెడుతున్నది.
-హరీశ్‌రావు
ప్రజాసమస్యలపై ఫోకస్ చేయండి
మీడియా మిత్రులకు ఒక్క రిక్వెస్ట్.. ‘పాలిటిక్స్ ఎలా అయిపోయినయంటే.. బాగా బూతులు మాట్లాడితేనో, బాగా తిడితేనో, మాట్లాడితేనో బ్యానర్లు అయితున్నయ్. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మాట్లాడితే వార్త ఎక్కడ వచ్చిందా? అని వెతుక్కోవాల్సి వస్తున్నది. కానీ, మీ బాధ్యత అయినా, మా బాధ్యత అయినా రాష్ట్రం, ప్రజలు మొదలు.. ఆ తర్వాతే రాజకీయాలు ఉండాలని నా ఫీలింగ్. బాగా ఎనాలిసిస్ చేసి, కష్టపడి బాగా చదివి, అర్థం చేసుకుని బాధ్యతగా మాట్లాడితే.. బ్యాడ్‌లక్ ఏందంటే దానికి సంబంధించిన వార్తను వెతుక్కోవాల్సి వస్తున్నది. కొన్ని అత్యవసరమైన, ప్రజలకు సంబంధించిన అంశాలను కూడా సమ ప్రాధాన్యంతో ఫోకస్ చేయడం ద్వారా రాష్ర్టానికి, ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మీకు విన్నవిస్తున్నా’ అని హరీశ్‌రావు చెప్పారు.