సుబేదారి, ఫిబ్రవరి 26 : హనుమకొండ అదాలత్లోని వరంగల్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని ఓ ఆగంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో రెండు గంటల పాటు కోర్టు ఆవరణలో కలకలం నెలకొంది. తనిఖీలు చేపట్టిన బాంబు స్కాడ్, పోలీసులు చివరకు ఇది తుంటరి చర్యగా తేల్చారు. వివరాల్లోకి వెళితే గురువారం హనుమకొండ జిల్లా న్యాయమూర్తికి కోర్టులో ఆర్డీఎక్స్ బాంబులు అమర్చామని, గంట సేపట్లో పేలుతాయని మెయిల్ పంపాడు.
దీంతో అప్రమత్తమైన ఆయన సిబ్బంది, కక్షిదారులను బయటకు వెళ్లాలని ఆదేశించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో అప్రమత్తమైన సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ తన సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్కాడ్, జాగిలాలతో కలిసి వచ్చి కోర్టు ఆవరణంతా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా ఏమీ కనిపించకపోవడంతో ఇది కేవలం బెదిరించేందుకు చేసిన చర్యగా నిర్ధారించారు. దీంతో రెండు గంటల పాటు కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. రెండు నెలల్లో ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మూడోసారని, పోలీసులు సదరు ఆకతాయిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.